Category Archives: సామాజిక న్యాయం కోసం

Book Review on Pasunoori’s LADAAYI

This article was published in Andhra Jyothi (Vividha 01/02/2011)

ఒడువని శోకం.. ఉప్పొంగిన భావావేశం

‘మా భూమెందుకు పడావు పడ్డది?
మా అయ్యెందుకు పురుగుల మందు తాగిండు?
మా అన్నెందుకు కొలువు లేని గాయిదోడైండు?
నేనెందుకు సావుకైనా తెగిస్తున్నా..??’ అనడుగుతున్నడు పసునూరి రవీందర్.

భౌగోళిక విభజనలకు ముందు మానసిక విభజనల సరిహద్దురేఖ మీద నిలబడ్డ హృదయం సంధిస్తున్న ప్రశ్నలవి. ప్రాంతీయ చైతన్యం సామాజికంగా, సాహిత్యపరం గా నిండి ఉన్న నేల మీద ఉన్న ఏ కవి అయినా ఇవాళ సంధిస్తున్న ప్రశ్నలివే. సీమాంధ్రలో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సాహిత్య అధ్యయనపరునిగా, పరిశోధకునిగా ఈ దీర్ఘకవిత చదివిన తర్వాత నాలుగు వాక్యాలు రాయాలనిపించింది. విస్తృతమైన జీవన సంఘర్షణను చిత్రించడానికి తెలంగాణ కవులు అనివార్యంగా ఎంచుకుంటున్న సాహిత్య రూపం దీర్ఘకవితే. ఆ విధంగా తెలంగాణ కవి తన సుదీర్ఘ పోరాట చరిత్రను అక్షరాలకు ఎత్తడానికి సిద్ధమవుతున్నాడు.

మరులుగొలిపే అతివ అందాల విందుకై అర్రులు చాచే మగాడు సృష్టించిన సాహిత్యం లాంటిది కాదు తెలంగాణ సాహిత్యం. తిండి లేక ఎముకల గూళ్ళైనవారు.. పొట్టలు అతుక్కపోయినవారు పొత్తికడుపు నుండి పెట్టిన పొలికేకలే తెలంగాణ సాహిత్యం. అందుకే ఇందులో నవయవ్వనంతో మిసమిసలాడే వరూధినిలాంటి పడతులు, పచ్చటి పైర్లు, సెలయేటి గలగలలు, కోయిలమ్మల మధుర గానాలు కనపడవు, వినపడవు. మూడుపదులు కూడా నిండకుండానే ఎండిపోయిన రొమ్ములతో ముడుతలు పడ్డ ముఖాల అమ్మలుంటారు.  నెర్రెలిచ్చిన పంటపొలాలు, ఎండిన చెరువులు, మేతలేక నీళ్లు లేక కబేలాలకు తరలే పశువులు.

ఇంతటి దారుణ పరిస్థితులలోను, మొక్కవోని ధైర్యం గల చాకలి అయిలమ్మ వీరత్వం తెలంగాణ సాహిత్యం సొంతం. బతుకంటే పోరాటమని, బతుకంటే ఆత్మాభిమానమని, బతుకంటే మానవత్వంతో జీవించడమేనని చాటిచెప్పేదే తెలంగాణ సాహిత్యం. అట్టి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని, ఒరవడిని అందిపుచ్చుకున్న కవి పసునూరి రవీందర్ గుండె గొంతుకలో నుండి ఉప్పొంగిన భావావేశమే ‘లడాయి’ దీర్ఘ కవిత.

సెలుకల మీద సిలుకలు/ఎండిన సెరువుగట్ల మీద పిట్టలు/గుంపులు గుంపులుగా…/ఎండిన బాయి గుండెకోతను/తలాకొంచెం వలపోస్తుంటయి నీళ్లు లేక పడావుపడ్డ భూమి పంటలు పండక, తిండికి మెతుకు లేక ఊళ్లో బతుకు భారమైతే కూలీ వెతుక్కుంటూ పట్టణాలకు తరలివెళ్లే అవ్వ అయ్యలను సాగనంపుతూ ఉబికి వచ్చిన కన్నీళ్లకు అక్షరరూపం ఈ దీర్ఘ కవిత. వానలు పడక ఏసిన పంటలెండిపోతే ఎదురింటి ఎంకన్న తాత, పక్కింటి సోమన్న కాక, పంటలకు పెట్టవలిసిన పురుగుల మందు తమ నోట్లో పోసుకొని నురుగులు కక్కుకుంటూ ఎందుకు చనిపోతున్నారో ఒంటరిగా చేసుకున్న సుదీర్ఘ ఆలోచనే ఇదంతా.

‘లడాయి’ దీర్ఘకవిత ఛిద్రమైన నేటి తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని, సీమాంధ్ర ఆధిపత్యాన్ని, తెలంగాణ విద్యార్థుల పోరాట పటిమను ఆవిష్కరించింది. అందులో మనకు ఆకలికేకలు వినబడుతాయి. ఎముకల గూళ్లుగా మారిన రైతన్నలు, బీడుపడి నెర్రెలిచ్చిన భూములు కనబడతాయి. కన్నబిడ్డల్ని సైతం అమ్ముకునే అమ్మలు కనపడతారు. తాను పుట్టిన నేల మీద రెండు నదులు ప్రవహిస్తున్నప్పటికీ అందులోని నీళ్లు ఎందుకు దక్కడంలేదో ఒక తాత్విక చింతనను కవిత్వమై కురిపిస్తాడు. సుభిక్షంగా ఉండాల్సిన గడ్డ, క్షామంతో ఆకలికేకలతో అల్లాడుతున్నది.

ఉబికివస్తున్నదుఃఖాన్ని పంటిబిగువున ఆపుకుంటూ చెప్తాడు తమ నోటికాడి కూడులాంటి గోదావరి నీళ్లను కాజేస్తున్నవాడికి, తన కన్నీటిగాథ పట్టదు. ఒక్క పంటకోసమే తెలం గాణ రైతుకి చాలా కష్టమైతుంటే, ఆ నీళ్లను దోచుకపోయినోడికి మూడేసి పంటలు పండించడం ఏమి న్యాయమని ఆ గోదావరినే ఆ్రర్థంగా నిలదీస్తాడు పసునూరి.

గల గల మాటల/స్మృతిరూపమా.. గోదారి తల్లీ/మా దూప కూడా తీర్చని అందాల జాబిల్లీ! నీ నిండా పారుతున్నవి నీళ్లు కావు/అవి మా కన్నీళ్లు -అంటాడు.

పాఠ్యపుస్తకాలలో కోస్తాంధ్ర వారి సాంస్కృతిక విషయాలకు సంబంధించిన పాఠాలు మాత్రమే ఉండి తాము పుట్టి పెరిగిన సాంస్కృతిక వాతావరణానికి సంబంధించిన విషయాలు ఎక్కడా లేకపోవడమే తెలంగాణ పట్ల కోస్తాంధ్ర వారు ఆచరిస్తున్న అంటరానితనమంటాడు.

అర్థం కాని అట్లతద్ది పండుగ/ నా పుస్తకంలకు ఎట్లచ్చిందో/నా బతుకమ్మ పండుగ అంటరానిదెట్లయ్యిందో/ఒక్క పీరియడ్‌లోనైనా చెప్పలేదెందుకు సారు?! -అంటాడు. న్యాయం కావాలని రోడ్డెక్కిన వారిని నేరగాళ్లుగా హింసించడాన్ని ఖండిస్తాడు. పట్టుపడని లౌక్యాన్ని, పాలుపోని కోపాన్ని అక్షరాలకెక్కిస్తాడు. మా డొక్కల ఊపిరి ఉద్యమాలనే శ్వాసిస్తది/మా గొంతులు నినాదాలను మాత్రమే ఉచ్ఛరిస్తయి/మా నోళ్లల్లో పోరాట పాటలు మాత్రమే/జీవనదులై పారుతుంటయి…

మనిషి ఎంత పేదరికాన్నైనా భరిస్తాడు కానీ, అవమానించడాన్ని, అంటరానితనాన్ని ఆపాదించడాన్ని మాత్రం భరించలేడు. మన దేశంలో దళితుల పోరాటం, అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమాలు ఈ విషయాన్నే పదే పదే చెబుతున్నాయి. ఇవాళ్టి తెలంగాణ ఉద్య మం కూడా ఈ సత్యాన్నే ప్రకటిస్తున్నది.

తెలంగాణ అంతలా ఆగ్రహించేదాకా, ఆవేశపడడంలో, ఆక్రోశపడడంలో గల కారణాలకు మూలమని సీమాంధ్రీయులను కాస్త కటువుగానే అడుగుతున్నాడు. ఎముకల గూళ్లుగా మిగిలి/బక్కరైతుల దుఃఖం వినండి/తిరిగిరాని శవాలవుతున్న/ పాలమూరు కూలీల కన్నీళ్ల తడిని తాకండి/తిండికోసం/కన్న బిడ్డలనమ్ముకునే పేదరికాన్ని/నిండు మనసుతో గుండె తడమండి/చేతికండిన కొడుకుల్ని/ఉద్యమాలకు అంకిత మిచ్చి/గుడ్డి దీపం వెలుగులో/కుమిలి యేడుస్తున్న తల్లుల/ఒడవని శోకంరా మా తెలంగాణ -అంటున్నాడు.

ముసుగులు తొలగించమని సీమాంధ్రీయులను పసునూరి అడుగుతూనే తెలంగాణ వాకిళ్లు కళకళలాడుతుంటే, తెలంగాణ జెండా రెపరెపలాడాలంటున్నాడు. బంతిపూత అందాలను చూసి పాలబుగ్గల పసిపిల్లలు ముసిముసిగా నవ్వుకుంటూ, కేరింతలు కొడుతున్న సుందర స్వప్నాన్ని కంటున్నాడు పసునూరి తన ‘లడాయి’ కవితలో. ప్రజా ఉద్యమాన్ని ప్రేమించే, అభిమానించే వారందరూ చదువతగింది ఈ ‘లడాయి’.

– సాంబయ్య గుండిమెడ
పాలక్కాడ్, కేరళ,
‘లడాయి’ తెలంగాణ దీర్ఘ కవిత, కవి: పసునూరి రవీందర్
ఒరవ్వ ప్రచురణలు, ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు, వెల: 25/-

7 Comments

Filed under సామాజిక న్యాయం కోసం

Is it wrong to demand Representative Telangana (samaajika telangana)?

సామాజిక తెలంగాణాను కోరడమే నేరమా?

(ఈ వ్యాసాన్ని నేను గుర్రం సీతా రాములుతో కలసి రాయడం జరిగింది. కొన్ని మార్పులతో 18 ఫిబ్రవరి 2010 సూర్య పత్రికలో ప్రచురితమైనది.)
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నేడు ఒక నిర్ధాయక దశకు చేరుకున్న నేపథ్యంలో ఇటీవల ఫిబ్రవరి 7 వ తేదీన జరిగిన విద్యార్ధి పొలికేకలో, పొలిటికల్ జే ఏ సి లో వివిధ కుల సంఘాల జే ఏ సి లు నేడు ఉద్యమంలో కీలకమయిన పాత్ర పోషించడానికి అనిర్వచనీయమయిన స్పూర్తిని అందించిన మాదిగ దండోరా నాయకుడు, పొలిటికాల్ జే ఏ సి లో నిర్ణాయక పాత్ర పోషిస్తున్న కృష్ణ మాదిగపై జరిగిన దాడి అత్యంత హేయమయిన చర్య. ఈ చర్యపట్ల తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులు, పౌర హక్కుల సంఘాలు, కొందరు దళిత మేథావుల ఉదాసీనతను ఎలా ఆర్థం చేసు కోవాలి?

తర తరాలుగా ఈ కుల సమాజంలో సామాజిక పెత్తనం కోసం రాజ్యాధికారం కోసం అగ్ర వర్ణాలు జరుపుతున్న, కొనసాగిస్తున్న కుయుక్తులు; రాజ్యాధికార ప్రాతినిథ్యం కోసం, సామాజిక సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం అట్టడుగు కుల – వర్గాలు సాగిస్తున్న పోరాట క్రమంలో కృష్ణ మాదిగ మీద మొన్న జరిగిన దాడిని అర్థం చేసుకోవాలి. అయితే, అట్టడుగు కుల వర్గాలపై ఆధిపత్య అగ్ర కులాల జరిపించే దాడులు, చేసే అవమానాల పరంపరలో నిన్న జరిగిన దాడి మొదటిది కాదు, చివరిదీ కాదు.

సామాజిక సమానత్యం కోసం పాటుపడే యే అణగారిన కుల-వర్గ ప్రతినిధి అయినా అవమనాలకు లోనవుతాడు. ఫూలే – అంబేద్కర్ జీవిత అనుభవాలనుండి మనం అర్థం చేసుకోవలసింది ఇదే. నాడు ఫూలే- అంబేద్కర్ లాంటి ఎందరో నాయకులు ఎన్నో అవమానాలకు, తిరస్కారాలకు గురై తాము వ్యక్తిగతంగా లబ్ది పొందకున్నా తదనంతరం తమ జాతి భవిష్యత్తు కోసం ఆలోచించారు. కాని జగజ్జీవన్ రాం లాంటి నాయకులు జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కి, వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్ద పీట వేసుకునడాన్ని మనం మరువకూడదు. కృష్ణపై జరిగిన దాడిని దళిత నాయకులుగా చెలామణిలోనున్న చాలామంది కుహనా మేథావులు ఖండించక నిమ్మకు నీరెత్తినట్లు ఉండడాన్ని వారు జగజ్జీవన్ రాం పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే, దళితుల పోరాటాల కాల గమనంలో అంబేద్కర్ స్థానం చెక్కు చెదరని సుస్థిరతను సంపాదించుకుంటే, జగజ్జీవన్ రాం స్థానం మసకబారి పోయినట్లుగా; అంబేద్కర్ సిద్థాంతాల వెలుగులో వర్తమాన సామాజిక న్యాయ పోరాటాలకు సిద్థాంత భూమికను అందిస్తున్న కృష్ణ మాదిగ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడి, పేరుకే అంబేద్కర్ వాదాన్ని- ఆచరణలో జగజ్జీవన్ రాం తత్వాన్ని అంది పుచ్చుకున్న నేటి దళిత మేథావుల పాత్రలు కాలక్రమంలో కనుమరుగయి పోతాయి అనడంలో ఎట్టి సందేహం లేదు.

తెలంగాణ పొలిటికల్ జే ఏ సి లో రాజకీయ పార్టీల ద్వంద వైఖరి పట్ల కేసిఆర్ ఉదాసీనత పలు అనుమానాలకు తావిస్తూంది. అదే విధంగా, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకొని రావడంలో పొలిటికల్ జే ఏ సి మెతక బారితనం ఒక పట్టాన అర్థం కావడంలేదు. ఎందుకంటే సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధులు ఇరవై నాలుగు గంటల్లొనే రాజీనామాలు చేస్తే, తెలంగాణాలో ఆ రాజీనామాల కార్యక్రమం యిప్పటికీ ఒక కొలిక్కి రాకపోగా, అదో పెద్ద ప్రహసనంగా మారడం ఇక్కడి ప్రజా ప్రతినిథులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కంటే వారి పదవులే ప్రియమైనట్లుగా తేట తెల్లమవుతుంది. ఈ విషయాలపైననే ఇటీవల జరిగిన జే ఏ సి సమావేశాల్లో రెండుసార్లు కృష్ణ మాదిగ వేసిన ప్రశ్నలు అక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేశాయి. అంతే కాకుండా, గత కొంత కాలంగా పొలిటికల్ జే ఏ సి మీద అత్యంత స్పష్టతతో నిర్మాణాత్మకమైన విమర్శ పెట్టగలిగిన వ్యక్తి అతనే కనుక మొదటి నుండి జే ఏ సి లో అతనిని పక్కకు పెట్టాలనే అగ్రకుల కుతంత్ర వాదనను అగ్రకుల మీడియా చాలా బలంగా వినిపిస్తూనే ఉంది.

యాభై యేళ్ళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, ఆ సమస్యను ప్రజలల్లోకి తీసుకెళ్ళడంలో, దానిని రాజకీయ ప్రక్రియ నుండి ఒక జాతీయ పొరాటంగా మరల్చడంలో భాగంగా తగిన స్పూర్తిని అందిచడంలో అన్ని శక్తులూ – ముఖ్యంగా బూర్జువా పార్టీలు, విప్లవ పార్టీలు – వైఫల్యం చెందాయి. ఆ క్రమంలో కే సి ఆర్ మొదలు పెట్టిన రాజకీయ ప్రక్రియ సరైన ఫలితాన్నివ్వలేక పోయింది. అయితే అతని ఆమరణ నిరాహర దీక్ష భూమికగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకత్వం విధ్యార్థుల చేతులలోకి పోవడం ఆధిపత్య కులాలకు మింగుడుపడడం లేదు. ఆ విద్యార్థి ఉద్యమం కూడా ఒక మహోన్నతమైన ప్రజా ఉద్యమంగా మారింది. తెలంగాణ పోరాట క్రమంలో యిదొక చారిత్రక మలుపు.

అయితే, విద్యార్థి ఉద్యమాన్ని తమ చెప్పు చేతలలోకి తీసుకోవడానికి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఉస్మానియ విద్యార్థి జే ఏ సి లో ఆ పని సాధ్యం కాలేదు. ఎందుకంటే అక్కడ నాయకత్వం వహిస్తున్నవారిలో అత్యధికులు అట్టడుగు కుల వర్గాలకు చెందినవారే. పైపెచ్చు తమ జే ఏ సిలో రాజకీయ పార్టీల జోక్యాన్ని నిర్ద్వందంగా ఆ విద్యార్థులు తిరస్కరించారు. ఆర్ట్స్ కాలేజీలో విజయవంతంగా జరిగిన విద్యార్థి గర్జనే యిందుకు ప్రబల నిదర్శనం.

ఈ క్రమంలో, దాదాపు పదకొండు యూనివర్శిటీలనుండి ఇరవై ఒక్క రోజులపాటు రెండు బృందాలుగా మూడు వందల మంది విద్యార్థులు కాళ్ళకు సరైన ఆచ్చాదనలు లేకుండా దాదాపు పన్నెండు వందల కిలో మీటర్ల పైగా పాద యాత్ర చేసే క్రమంలో, కాళ్ళకు పుండ్లతో, ఈగల్లో దోమల్లో కటిక నేల పైన నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ, వందలాది గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలను చైతన్య పరుస్తూ పొలికేకకు ఓరుగల్లుకు చేరుకున్నారు. ఆ విద్యార్థులు ఒక బహిరంగ సభ పెట్టుకుని తమ అనుభవాలను పంచుకొనడంతోపాటు, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించుకోవాడానికి ఏర్పాటు చేసుకున్న సభలో, కూర్చోనడానికి – నిలబడడానికి కూడా అవకాశం లేకుండా చేసి వారిని అవమానించారు.

పాద యాత్ర చేసిన విద్యార్థులను సభకు పరిచయం చేసే కనీస మర్యాదను కూడా విస్మరించి, సభ పోస్ట్లర్లపైన ఎవరెవరి పేర్లుండాలో, వేదికపైన ఎంతమందుండాలో, ఆ ఎంత మందిలో ఏ కులస్తులుండాలో, ఎంతసేపు మాట్లాడాలో లాంటి అన్ని అంశాలపైన తమ పెత్తనాన్ని చెలాయించబోయారు. అందుకోసం కే యూ జే ఏ సి కి డబ్బులు ఎర జూపెట్టారు. దానికి తోడు కే యూ జే ఏ సి అభిప్రాయానికి వ్యతిరేకంగా కృష్ణ మాదిగను ఎట్టి పరిస్థితులలోనూ పోలికేక సభకు పిలువ వద్దని తనకు అనుకూలురయిన విద్యార్థి నాయకులను హైదరాబాద్ కు ప్రత్యేకంగా పిలిపించుకుని ఉచిత సలహా ఇవ్వడమే గాక; వక్తలకు కోర్టునుండి అనుమతి తీసుకునే క్రమంలో కృష్ణ మాదిగ పేరు విద్యార్థి జే ఏ సి సూచించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా అతని పేరును చేర్చక పోవడం అగ్రవర్ణ కుయుక్తులలో భాగంగానే అర్థం చేసుకోవాలి. పోలికేకలో విద్యార్ధులు వినలేదు కాబట్టే ఎలాగైనాదాడి చేయించాలని భావించారు. కేయూలోని కొంతమంది అధ్యాపకులు, ప్రొఫసర్ జయశంకర్, దేశపతి శ్రీనివాస్ మాట్లాడినంత సేపు ప్రశాంతంగా ఉన్న సభా ప్రాంగణం వారి ప్రసంగం పూర్తయ్యి, కృష్ణ మాదిగ ప్రసంగం మొదలుపెట్టి పెట్టగానే ఇసుకతో నింపిన వాటర్ పాకెట్స్, రాళ్ళు, కర్రలు, వాటర్ బాటిల్స్ తో అకస్మాత్తుగా అగ్రకుల కిరాయి విద్యార్థులు ఉన్మాదుల్లా దాడి చేశారు. కేవలం రెండే రెండు నిమిషాలలో జరిగిన ఈ దాడి ముందుగా రూపొందించుకున్న పథకంలో భాగమేనని వేదికకు కేవలం కొన్ని అడుగుల దూరంలోనున్న మాకు స్పష్టంగా కనిపింది.

ఈ దాడిని, దానిని మీడియాలో చూపించిన క్రమాన్ని గమనించినట్లయితే కొన్ని విషయాలు స్పష్టంగా అవగతమవుతాయి. ఒకటి, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు కుల – వర్గాలకు వారి వారి జనాభా దామాషా ప్రాతిపదికన రాజ్యాధికారంలో భాగం కావాలని డిమాండ్ చేస్తున్న వారి ఆకాంక్షల గొంతు నొక్కే క్రమం; రెండు, మహోన్నతంగా సాగిన విద్యార్థి పాద యాత్రను మీడియా ఉద్దేశ్యపూర్వకంగా కవర్ చేయక పోవడం అటుంచి, సంఘటన వల్ల ఉద్యమానికి మేలు జరుగక పోగా విచ్చిన్నం చేసే చర్యగానే భావించదగిన దాడిని పదే పదే ప్రసారం చేయడం అనేది ఆంధ్ర – అగ్రవర్ణ మీడియాతో తెలంగాణా రాజకీయ నాయకులు మమేకమయ్యి చేసిన కుట్రపూరిత పథకంలో భాగమే. ఈ సంధర్భంగా ఇంకొక విషయాన్ని సుస్పష్టంగా చెప్పుకోవాలి. ఉద్యమంలో వందలాది మంది చనిపోయినప్పటికీ వారిని స్మరించకుండా ఒక్క వేణుగోపాల్ రెడ్డినే పదే పదే స్మరిస్తూ పాట పాడడం, మిగిలిన వందలాది అట్టడుగు కుల వర్గాల వారిని విస్మరించడం వెనుక బలిదానాలకి సైతం కులం ఉందనే విషయం రుజువు చేస్తుంది.

అసలు పొలిటికల్ జే ఏ సి తో కృష్ణ మాదిగకు ఉన్న ప్రధాన వైరుధ్యమేమిటి? కేవలం అతని మాటలు మాత్రమే ఎందుకు చర్చనీయాంశమవుతున్నాయి? దీనిని పరిశీలిస్తే అతని ప్రధాన లక్ష్యం ‘సామాజిక తెలంగాణ’ మేనని స్పష్టంగా తెలుస్తుంది. గతంలో భూసంస్కరణలు అమలులో భాగంగా జరిగిన భూపంపిణీలో అత్యథిక భాగం ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాలకే చేరినవి. ఆ భూమిని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకున్నట్లుగానే రాజ్యాధికారాన్ని కూడా తమ గుప్పెట్లోకి తెచ్చుకోగలిగారు. రేపు తెలంగాణాలో ఇది పునరావృతం కాకుడదని, అణచివేతకు గురి కాబడిన కుల – వర్గాల వారికి, ఆదివాసీలకు, మత మైనార్టీలకు పరిపాలనలో, వనరుల పంపిణీలలో సరి అయిన ప్రాతినిథ్యం లభించాలన్న డిమాండే అతని మీద దాడికి పురి గొల్పి ఉండొచ్చు. అంతే కాకుండా, ‘తెలంగాణను ఎవడూ యుద్దం చేసి గెలవలేదు. తెలంగాణలో జరిగిన అన్ని అక్రమాలు ఇక్కడి అగ్ర కుల, ఆధిపత్య వర్గాలకు చెందిన పెద్ద మనుష్యుల కనుసన్నలలోనే జరిగినవి. ఉదాహరణకు, ఇక్కడి భూములను బయటి వారు కొనకూడదు, అమ్మకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ, దానిని తుంగలో తొక్కి వేలాది ఎకరాల భూమిని బయటి వారి చేతుల మీదుగా హస్తాలు మారడానికి సహకరించినది కూడా ఇక్కడి దొరలే. కేవలం అధికార దాహం, అగ్రకుల దురహంకారం నాటి నుంచి నేటి వరకు ఈ నేల విముక్తికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ముఖ్య మంత్రి పదవిపై వ్యామోహంతోనే నాటి తెలంగాణ ప్రజా సమితీని మర్రి చెన్నారెడ్డి కాంగ్రేసు పార్టీలో వీలీనం చేశాడు. నేడు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కేవలం రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా అగ్ర కులాలు పావులు కదుపుతూ రాజీనామాలు చెయ్యడానికి వెనుకాడుతున్నాయని’ పలు సందర్భాలలో కృష్ణ మాదిగ పేర్కొనడం సహించని కొందరు అతనిపైకి దాడికి పురికొల్పేరనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం ఇంత కాలం దొరల ఆధిపత్యంలోనే ఉందని, తెలంగాణా వస్తే ఆదే ఆధిపత్యం కొనసాగుతుందనే సత్యం కృష్ణ మాదిగ మీద జరిగిన దాడి దృఢ పరుస్తుంది.

ఆధిపత్య కులాలలో ఉన్న అభ్యుదయవాదులు, విప్లవకారులు, హక్కుల సంఘాల నాయకులు బడుగు బలహీన కుల – వర్గాల వారిపై రాజ్యం చేసే హింసను పలు సందర్భాలలో ఖండించడాన్ని మనం చూస్తూనే ఉంటాము. అదే సందర్భంలో, ఆ నాయకుల కుల స్వభావాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సత్యమూర్తి, కలేకూరి, కృష్ణ మాదిగ లాంటి కొంతమంది దళితులపై జరిగే దాడుల పట్ల – అవి వ్యక్తులు చేసినా, రాజ్యం జరిపించినా – తమ కనీస స్పందన కూడా ప్రకటించరు. ఆ మధ్య బాడుగ నేతలు పేరుతో ఒక పత్రిక జరిపిన పరోక్ష దాడినిగాని, నిన్న వరంగల్ పొలికేక సభలో కొంతమంది జరిపించిన ప్రత్యక్ష దాడినిగాని ఖండిచక పోవడం అనేది ఆ నాయకులలో నిబిడీకృతమైన అగ్రకుల నిజ స్వభావానికి నిలువెత్తు నిదర్శనం.

తెలంగాణ వచ్చాక వచ్చే దొరల ఆధిపత్యాన్ని కూల దోయడం పెద్ద కష్టం కాదు. ఈ నేలకు కాకతీయులను ఎదిరించిన సమ్మక్క – సారక్కల శౌర్యం ఉంది. నిజాం రాజులను పారద్రోలిన శక్తి ఉంది. ఉళ్ళో తిష్ట వేసిన దొరలను గడిలనుండి తన్ని తరిమిన చరిత్ర ఉంది. రేపు వచ్చే తెలంగాణ మీద పెత్తనం చెలాయించాలనుకున్న దొరలను, అగ్రవర్ణాలను తరిమివేసి అంతిమగా అట్టడుగు కుల వర్గాల స్వప్నం – సామాజిక తెలంగాణను ఎలా సాధించుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అణగారిన కుల వర్గాలకు సరి అయిన రాజకీయ ప్రాతినిథ్యంతో పాటు, సామాజిక అసమానతలులేని, ఆర్ధిక సమతుల్యం గల సామాజిక తెలంగాణే అంతిమ లక్ష్యం అని కృష్ణ మాదిగతో పాటు వివిధ కుల సంఘాల జే ఏ సి నాయకుల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష సాకారం చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదు.

2 Comments

Filed under సామాజిక న్యాయం కోసం

ప్రత్యేక-సమైక్యతల నడుమ వర్గీకరణ భవితవ్యమేమిటి? (What is future of Sub-Classification Demand?)

ప్రత్యేక-సమైక్యతల నడుమ వర్గీకరణ భవితవ్యమేమిటి?

మాదిగ హక్కుల కొరకై పదహారేళ్ళుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో దండోరా ఉద్యమం ఎన్నో ఆటుపోట్లకు గురయ్యింది, ఎందరో నవ యువకులను కోల్పోయింది. పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టిస్తానని మాటిచ్చిన వై యస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, తెలంగాణ-సమైక్య ఉద్యమాల హోరుల నడుమ దండోరా కేకలో నిన్నటి చిక్కదనం కనిపించడంలేదు. తెలంగాణాలోని మాదిగలు, కోస్తాలోని మాలలు ప్రత్యేక రాష్ట్రంతో వర్గీకరణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు. కాని వర్గీకరణ విషయంపైన భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. దానికితోడు, మాదిగ అధి నాయకత్వ తీరు వర్గీకరణ ప్రక్రియపై పలు అనుమానాలకు, వ్యాఖ్యానాలకు దారి తీస్తుంది. ప్రత్యేక-సమక్య రాష్ట్ర ఉద్యమాల సందర్భాన దండోరాపై వినిపిస్తున్న భిన్న స్వరాల, వెల్లు వెత్తుతున్నా పలు సందేహాల నడుమ వర్గీకరణ భవితవ్యమేమిటి?

తెలంగాణ మాదిగలేమంటున్నారు?: దళిత రిజర్వేషన్లను వర్గీకరించాలంటూ దండోరా ఉద్యమం ఆరంభమయిన తొలినాళ్ళనుండి కోస్తాంధ్ర మాదిగలతో పోల్చుకుంటే తెలంగాణలోని మాదిగలు విద్యా పరంగా వెనుకబడి ఉన్నారని, ప్రాంతీయంగా ఉత్పన్నమైన ఈ హెచ్చు తగ్గుల్ని అవగాహనలోకి తీసుకోకుండా రాష్ట్రంలోని మాదిగలందరినీ ఒకే గాటికి కట్టివేయడం న్యాయం కాదు. కాబట్టి దళిత రిజర్వేషన్లను వర్గీకరించడంలో కులంతో పాటు ప్రాంతీయ కోణాన్ని కూడా అవగాహనలోకి తీసుకోవాలనే వాదనను రాష్ట్ర దండోరా అంతర్గత సమావేశాలలో తెలంగాణ దండోరా నాయకత్వం చర్చకు పెట్టింది. వాస్తవానికి తెలంగాణ దండోరా వాదన ఎంతో న్యాయబద్ధమైన వాదన. దళిత రిజర్వేషన్లను వర్గీకరించగా మాదిగలందరికి ఉమ్మడిగా వచ్చిన వాటా సీట్లకొరకు తెలంగాణ-కోస్తాంధ్ర మాదిగలు పోటీ పడితే, ఆ పోటీలో విద్యాపరంగా ముందంజలో ఉన్న కోస్తాంధ్ర మాదిగలే ముందువరుసలో నిలబడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, అసలు వర్గీకరణే రాలేదు, దానికి ముందే ఈ ప్రాంతీయ కోణం ఏమిటి? ఇలా అయితే ఉద్యమం నీరు కారిపోతుందని అప్పట్లో ప్రాతీయ దృక్కోణ గొంతుకను దండోరా నాయకత్వం నొక్కివేసింది.

అయితే, దళిత రిజర్వేషన్లను వర్గీకరిస్తూ 1997లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్సును, ఆ తరువాత ఆ ఆర్డినెన్సు స్థానే 2000ల సంవత్సరంలో ‘ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్) యాక్ట్ ను అమలులోకి తెచ్చింది. ఆ యాక్టు అమలులో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ మాదిగలు మొత్తం వర్గీకరణ ప్రహసనం పట్ల పునరాలోచించడం మొదలు పెట్టారు. ఇక్కడ మచ్చుకు 2000ల సంవత్సరంలో వరంగల్ డి యస్ సి నిర్వహించిన టీచర్ నియామకాల పరీక్ష ఫలితాల అనుభవాన్ని పేర్కొంటాను. ఆ పరీక్షలో ఒక మాదిగ విద్యార్థికి ఒక మాల విద్యార్థికంటే అధికంగా మార్కులు వచ్చాయి. అధికంగా మార్కులు వచ్చిన మాదిగ విద్యార్థిని తోసిరాజని, అతని కంటే తక్కువ మార్కులు వచ్చిన మాల విద్యార్థికి డి యస్ సి టీచర్ ఉద్యోగం కట్టబెట్టింది. వివరాలలోకి వెళితే, వరంగల్ జిల్లాలో స్వతహగా మాదిగల జనసంఖ్య ఎక్కువ. గత రెండు దశాబ్దాల కాలం నుండి వారిలో డిగ్రీలు చదువుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. విద్యా పరంగా జిల్లాలో మాదిగల కంటే మాలలు ముందునుండే ముందున్నప్పటికీ  జన సంఖ్యలో వారిది చాలా అధమ స్థానం. 15 శాతంగానున్న దళిత రిజర్వేషన్లను వర్గీకరించిన పిమ్మట 7 శాతం రిజర్వేషన్లు మాదిగలకు రాగా, 6 శాతం మాలలకు వచ్చాయి. రాష్ట్రం మొత్తానికి వర్తించే ఈ వర్గీకరణలో ప్రాతీయ కుల జనాభా ప్రాతిపదిక లేదు. అందువలన ప్రాతీయ దళిత జనాభాలో అత్యధికంగా ఉండి, అత్యధికంగా మార్కులు తెచ్చుకున్న మాదిగ విద్యార్థికి డి యస్ సి పోస్టులలో అన్యాయం జరిగితే, 6 శాతం కోటా వలన జన సంఖ్యలో తక్కువ ఉన్న మాలలు మరింత లబ్ది పొందటం జరిగింది.

ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మాదిగలలో డిగ్రీలు చదివిన కొంతమంది యువకులు వర్గీకరణ పట్ల అంత ఆసక్తిని కనపరచడం లేదు. అయితే, ఇక్కడ మనమొక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. జిల్లాల వారిగా తీసే డి యస్ సి లాంటి పోస్టులలో తెలంగాణ మాదిగలకు వర్గీకరణ ద్వారా అన్యాయం జరిగి ఉండవచ్చు. కాని రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే వర్గీకరణ ప్రక్రియ తరువాత రిజర్వేషన్ వసతులలో మాదిగలు లబ్ది పొందారనేది నిర్వివాదాంశం.

అయితే, గత నెలలో తెలంగాణ ఉద్యమం ఉధృతమై, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడతామని చిదంబరం ప్రకటించిన దగ్గరనుండి వర్గీకరణ విషయంపై తెలంగాణ మాదిగలలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో కూడా కుల జనాభా ప్రాతిపదికన దళిత రిజర్వేషన్లను వర్గీకరించాలనేది మొదటి వాదన. దండోరా మొదటి నుండి వినిపిస్తున్న వాదనకు ఇది కొనసాగింపు వాదం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత వర్గీకరణ ఆవశ్యకత తెలంగాణాలో లేదు అనేది రెండవ వాదన. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వర్గీకరణావసరం ఎందుకు ఉండదు? తెలంగాణ రాష్ట్ర దళిత జనాభాలో అత్యధికులు మాదిగలే గాబట్టి దళిత రిజర్వేషన్ అవకాశాలలో కూడా అత్యధిక భాగాన్ని మాదిగలే పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని వర్గీకరణ కోసం తెలంగాణాలో మాదిగలు తమ శక్తియుక్తులను ధార బోయడం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని రెండవ రకపు వాదన వినిపించేవారి సమాధానం. ఈ వాదనను ఓ వైపునుండి పరిశీలిస్తే  తెలంగాణా మాదిగలలో పొడచూపుతున్న మెజారిటీ అహంభావం కనిపిస్తే, మరో వైపునుండి వారి అమాయకత్వానికి నిలువెత్తు దర్పణం పడుతుంది. ఇది ఓ రకంగా వాపుని చూసి బలుపనుకునే అమాయకత్వంతో కూడుకున్న మూర్ఖత్వం.

1962-2009 ల మధ్య పార్లమెంటుకు తెలంగాణ నుండి ఎన్నికైన దళిత అభ్యర్థుల కుల వివరాలు

సంవత్సరం

మాల మాదిగ
1962 2 1
1967 3 0
1971 2 1
1977 2 1
1980 2 1
1984 3 0
1989 2 1
1991 2 1
1996 1 2
1998 1 2
1999 0 3
2004 1 2
2009 1 2

మూలం: భారతీయ ఎన్నికల సంఘం

తెలంగాణా దళితులలో మాదిగ జనసంఖ్య అధికమే. అయితే, ఆ ఆధిక్యత ఏనాడు వారిని దళిత రిజర్వేషన్ వసతుల దరిదాపులకి సైతం రానీయలేదు. ఉదాహరణకు, రాజకీయ రంగాన్ని తీసుకుంటే, తెలంగాణ దళితులకు ముడు పార్లమెంటరీ రిజర్వడ్ సీట్లున్నాయి. ఈ ప్రాంత దళిత జనాభాలో మాదిగల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ పటంలో చూపించినట్లుగా 1962 నుండి 1991 వరకు జరిగిన ఎనిమిది పార్లమెంటరీ ఎన్నికలలో అత్యధిక సీట్లను మాలలు కైవసం చేసుకున్న సంగతి తెలుస్తూనే ఉంది. 1967, 1984 లలో అయితే ఉన్న మూడు సీట్లను మాలలే చేజిక్కించుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ దండోరాకు మద్దతునిచ్చి మందా జగన్నాథం, సుగుణ కుమారి లాంటి మాదిగలకు పార్లమెంటు టిక్కెట్లిచ్చి ప్రమోట్ చెయ్యకుంటే ఈనాటికీ మాదిగల రాజకీయ పరిస్థితి 1967, 1984లానే ఉండేదనడంలో ఎటువంటి సందేహం లేదు. వర్గీకరణపై తెలంగాణ మాదిగల వాదనలు ఈ విధంగా ఉంటే అదే విషయంపైన కోస్తాంధ్ర మాలల వాదన మరో రకంగా ఉంది.

ప్రత్యేకతకు మాల మహనాడు సమర్ధన వెనుక మర్మం: కోస్తాంధ్రాకు చెందిన మాల నాయకులు ముఖ్యంగా అమలాపురం ఎంపి హర్ష కుమార్ లాంటివారు, “విడిపోవాలనే అభిప్రాయం మనసులో కలిగినప్పుడు విడిపోవడమే మేలు” అని అంటూ తాను జై ఆంధ్రాకు కట్టిబడి ఉన్నానని పత్రికాముఖంగా ప్రకటించారు (వార్త,25 డిశెంబర్,2009).కారెం శివాజీ,మల్లెల వెంకట్రావు లాంటి మాల మహానాడు నాయకులు మరో అడుగు ముందుకు వేసి, “రాష్త్ర విభజన జరిగితేనే కోస్తాలో దళితులకు న్యాయం జరుగుతుంది. వర్గీకరణ వివాదానికి శాశ్వత ముగింపు లభిస్తుంది” (ప్రజాశక్తి, 17 డెశెంబర్, 2009) అని పేర్కొంటూ మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు కోస్తాంధ్రాకు చెందిన మాల నాయకులు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? రాష్ట్ర విభజన జరిగితే కోస్తాలో దళితులకు జరిగే న్యాయం ఏమిటి? రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే వర్గీకరణ వివాదానికి శాశ్వత ముగింపు ఎలా లభిస్తుంది?

దళితులకు రాజ్యాంగ పరంగా సామాజిక న్యాయం పేరిట కల్పించబడిన రిజర్వేషన్ వసతులలో సింహభాగాన్ని మాలలే అనుభవిస్తున్నందువలన మాదిగ, రెల్లి యిత్యాధి దళిత కులాలకు అన్యాయం జరిగిందని, దళిత కూటమిలోని అన్ని కులాలకు న్యాయం జరగాలంటే ఆ రిజర్వేషన్లను కుల జనాభా దామాషా పద్దతిన వర్గీకరించాలంటూ దండోరా ఉద్యమం మొదలయిన నాటి నుండి నేటి వరకు మాల నాయకుల మాటలను, చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్న వారెవరికైనా అవి రెండు విషయాలపైననే కేంద్రీకృతమైనట్లు సుస్పష్టంగా తెలుస్తుంది. ఒకటి, వర్గీకరణను అడ్డుకోవడం; రెండు, రాజ్యాధికార సాధన దిశగా పావులు కదపడం. మొదట్లో వారి శక్తులన్నీ రెండవ విషయం పైనకంటే మొదటి దాని పైననే కేంద్రీకరించడం జరిగింది. అయితే ఎప్పుడయితే వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో అప్పటినుండి వారు వర్గీకరణ వ్యతిరేకిత విషయాన్ని ప్రకటనలకు మాత్రం పరిమితం చేసుకుని, తమ శక్తి యుక్తులను రాజ్యాధికార సాధనపై లగ్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే నూతనంగా ఏర్పడిన ప్రజా రాజ్యం పార్టీ తలుపు తట్టి, ఆ పార్టీ సైద్ధాంతిక స్పోక్స్ పర్సన్స్ గా కొందరు, సామాజిక న్యాయం కోసం ఉద్భవించిన ప్రజా రాజ్యం పార్టీని గెలిపించి చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయమంటూ మరికొందరు ఆ పార్టీకి వెలుపల నుండి మద్దతు పలికిన విషయం పఠితులందరికీ పరిచితమే. రాష్ట్ర విభజన కొరకు ఈనాడు మాల నాయకుల ప్రకటిస్తున్న సమ్మతాన్ని కూడా వర్గీకరణ వ్యతిరేకం, రాజ్యాధికార సాధన విషయ కోణాలనుండే (ముఖ్యంగా మొదటి కోణం నుండి) అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది.

రాష్త్ర ప్రభుత్వం గావించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ పార్లమెంటులో వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టి అమోదింప జేసుకున్నట్లయితే దళిత రిజర్వేషన్లను వర్గీకరించుకునవచ్చుననే విషయం జగమెరిగిన సత్యం. ఆ మధ్య కాలంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టించి వర్గీకరణ సాధించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ప్రయత్నాలు కూడా జరిగాయి. వైయస్ మరణంతో ఆ ప్రయత్నాలకు గండిపడడం, ఆయన మాదిరే ఢిల్లీలో మాదిగల సమస్యను గట్టిగా వాదించే నాయకుడు లేకపోవడంతో వర్గీకరణ విషయాన్ని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టడం జరిగింది. అయితే, ప్రక్కన పెట్టింది ప్రస్తుతానికేగాని శాశ్వతంగా కాదు. అయిదు దశాబ్దాలకుపైగా దళితుల విద్యా, ఉద్యోగ, తదితర సంక్షేమ పథకాలలో అత్యధిక అవకాశాలను మాలలు, ఆది-ఆంద్రులే అనుభవిస్తంటే, డొక్కలెండిన డెక్కలి, మాదిగ, రెల్లి తదితర దళిత కులాలు చూస్తూ కూర్చోవు. పోరుబాట పట్టక పోరు, వర్గీకరణ జెండాను దశదిశలా ఎగురవేయకపోరు. అలా జరుగుతుందని మాల నాయకులకు కూడా తెలుసు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో పోల్చుకుంటే కోస్తాంధ్రాలో మాలల సంఖ్య ఎక్కువ. అదే విధంగా కోస్తాంధ్ర, రాయలసీమలతో పోల్చుకుంటే తెలంగాణాలో మాదిగల సంఖ్య ఎక్కువ. దీని ఆధారంగా వారి వ్యూహంలో రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే, దండోరా ఉద్యమానికి ఆయువు పట్టుగానున్న తెలంగాణ మాదిగలు ప్రత్యేక రాష్ట్రంలోని దళితులలో జనాభాపరంగా అత్యధిక సంఖ్యలోనున్న తమకే రిజర్వేషన్ వసతులలో ఎక్కువ అవకాశాలు దొరుకుతాయన్న భ్రమలో ఉన్నందున వారు వర్గీకరణ నిమిత్తమై ఉద్యమించే ప్రసక్తే లేదు. కోస్తాంధ్ర మాదిగలు తెలంగాణ మాదిగల మాదిరే ఉద్యమించే అవకాశాలు లేవు. పైగా దండోరా నాయకుడు కృష్ణమాదిగ లాగా మాదిగ యితర దళిత కులాలను చైతన్యపరిచే సత్తాగల నాయకుడు కోస్తాంధ్రాలో లేడు. కాబట్టి రాష్ట్ర విభజన జరిగితే యిప్పటికే అచేతనంగా ఉన్న వర్గీకరణ ఉద్యమం సమూలంగా అంతరించిపోతుందనేది మాల నాయకుల వ్యూహాత్మ ఎత్తుగడ. ఒక్క మాటలో అలా అంతరించిపోవడమే ఆ నాయకుల దృష్టిలో ‘వర్గీకరణ వివాదానికి శాశ్వత ముగింపు’.

అయితే, మాల నాయకులు పేర్కొంటున్నట్లుగా రాష్ట్ర విభజన జరిగితే కోస్తాలోనున్న దళితులకు జరిగే న్యాయం ఏమిటి? దళిత కూటమిలో మాలలు, ఆది-ఆంధ్రులతో పాటు మాదిగ,రెల్లి,డెక్కలి లాంటి యిత్యాధి అరవై కులాలు ఉన్నాయి. దళిత ఉమ్మడి రిజర్వేషన్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని, వర్గీకరణతో న్యాయం చెయ్యమని మాదిగ తదితర కులాలవారు గత పదహారు సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామికమైన ఆ డిమాండ్ ని అప్రజాస్వామికంగా మాల మహానాడు వ్యతిరేకిస్తూనే ఉంది. అంటే, వర్గీకరణ జరగకుంటే కోస్తాంధ్ర దళితులలోని దండోరా కూటమికి చెందిన కులాలన్నింటికీ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మాల కూటమికి చెందిన కులాల వారు రిజర్వేషన్ లలో సింహ భాగాన్ని కైవసం చేసుకూంటూనే ఉంటారు. మరి, రాష్ట్ర విభజన జరిగితే కోస్తాంధ్రాలోని దళితులందరికీ జరిగే న్యాయం ఏమిటి?

సారాంశంలో వర్గీకరణ జరగకుండా రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తాంధ్రాలోని దళితులందరికీ జరిగే న్యాయమంటూ ఏమి లేదు. ఏతా వాతా ఏదైనా జరిగితే మాల కూటమిలోని కులాలు మాదిగ కూటమిలోని కులాలను అణచివేసి బలపడడమే జరుగుతుంది. ప్రత్యేక, సమైక్యత ఉద్యమాల నేపథ్యంలో కోస్తాంధ్రాలో మాలలు, తెలంగాణలో మాదిగలు పైన చెప్పినట్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే, మరి మాదిగ అధినాయకత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది?

మాదిగ అధినాయకత్వపు దారెటు?: 1994 జులై 7వ తారీఖున దండోరా ఉద్యమం ఆరంభమయినప్పటినుండి ఎందరో మాదిగ నేతలు దివ్వెలై ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించినా, నాటినుండి నేటివరకు దండోరాకు దిక్సూచి, వర్గీకరణకు చిరునామా కృష్ణ మాదిగ అనే చెప్పుకోవాలి. ఆ దిక్సూచే ఈ రోజున తెలంగాణ ఓడకు వెలుతురై దారి చూపుతుంటే, నడి సంద్రంలో చిక్కుకుపోయిన వర్గీకరణ పడవ చుట్టూ చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. తమకు దారి చూపించాల్సిన దిక్సూచి తమను కాదని, పగటిని మించిన వెలుతురును విరజిమ్ముకుంటూ దారిచూపించాల్సిన అవసరం లేకుండానే ముందుకు దూసుకెడుతున్న ఓడకు దారి చూపడంలోనున్న ఔచిత్యం ఆర్థంగాక ఖిన్నులౌతున్నారు.

ప్రత్యేక తెలంగాణ అనేది ఒక ప్రజాస్వామ్యక డిమాండ్. ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై నమ్మకమున్న ప్రతి ఒక్కరు ఈ డిమాండ్ ని బలపరచాలి. అందులో రెండవ ఆలోచనకు తావుండరాదు. అయితే ‘తెలంగాణ’ అనే నాలుగు అక్షరాల కంటే ‘ఎ బి సి డి’ అనే నాలుగు అక్షరాలే ముద్దు’ అని ఒకనాడు పలికిన కృష్ణ మాదిగ ఈ నాడు తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా లీనమై ఎ బి సి డి ల ఊసెత్తక పోవడంతో జాతి ప్రయోజనాలపై అతనికున్న నిబద్దతపైన ప్రాంతాలకతీతంగా ఎందరో మాదిగలు సందేహ పడుతున్నారు. మాదిగ జాతికి ప్రయోజనాలు కల్గించే వర్గీకరణ కాదని తెలంగాణ బాట పట్టడంలో అతని వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా చూచుకుంటున్నాడనే ఒక బలమైన విమర్శ మాదిగలలో వినిపిస్తుంది. ఇట్టి విమర్శకు ఒక ఆధారాన్ని కూడా చూపుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కే చంద్రశేఖరరావు యిది వరకే ప్రకటించి ఉన్నాడు. మొదటినుండి కే సి ఆర్ పట్ల గుర్రుగా ఉన్న కృష్ణ మాదిగ తెలగాణ ఉద్యమం ఉధృతమైన ఈ రోజున అతని ప్రక్కన కూర్చోవడం ఆ ముఖ్యమంత్రి పదవిపై మోజుతోనే నేమో!.

ముఖ్యమంత్రి పదవిపై కృష్ణ మాదిగకు మోజు ఉన్నా, లేకున్నా నిన్న మొన్నటి వరకు రంగుల ప్రపంచంలో విహరించి నిజమైన ప్రజా జీవితం గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే చట్టసభలకు వెళ్ళిన చాలామందికంటే, మూడు దశాబ్దాలకు పైగా అట్టడుకు కులాలవారి హక్కుల కొరకు అహర్నిశలు పాటుపడుతున్న అతను తెలంగాణలోనైనా, సమైక్య రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి పదవికి నూరింతలు అర్హుడు. పైపెచ్చు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగాగల దళితులకు కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి అవ్వడం శుభపరిణామం. అయితే, ఒక్క కృష్ణ మాదిగ అధికారంలోకి వస్తే దళితుల కడగండ్లు తీరతాయా? అలా అయితే స్వాతంత్ర్యం తరువాత ఈ రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితులు ముఖ్యమంత్రి పదవినలంకరిచారు. కోనేటి రంగారావులాంటి వారు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇంకా ఎందరో మంత్రులయ్యారు. దళిత కార్డుపైన పదవులరంకరించినప్పటికీ ఈ వ్యక్తులవలన దళిత జాతి మొత్తానికి ఒన గూరిన ప్రయోజనాలు శూన్యం.

స్వాతంత్ర్యం వచ్చిన పిదప మీకు ఒక మంచి పదవినిస్తాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం. ముందు మీరు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోనండి అని అనాడు అగ్ర కుల నాయకులు అంబేద్కర్ తో అంటే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నా జాతి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని గ్యారంటీ లేకుండా నేను మీ పోరాటంలో పాల్గోలేను. నాకు మీ స్వాతంత్ర్యం కంటే నా జాతి జనుల ప్రయోజనాలే మిన్న అని సూటిగా చెప్పి, స్వప్రయోజనంకంటే జాతి జనుల ప్రయోజనాల పరిరక్షణకే అంబేద్కర్ ఆరోజున కంకణ బద్దుడవ్వబట్టే ఈ రోజున దళితులకు ఈ మాత్రమైనా వసతులున్నాయి. మాదిగ జాతి ప్రయోజనాలను కాపాడే వర్గీకరణకు గ్యారంటీ లేకుండా, దళిత జాతి ప్రయోజనాలను కాపాడే రాజ్యాధికార భాగం గ్యారంటీ లేకుండా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అవ్వడం అంటే, అగ్రకుల రాజకీయ కుయుక్తి కోరలలో కృష్ణ మాదిగ చిక్కుకుంటున్నాడేమో?

అయితే,ఈ విషయాలన్నింటిపైన కృష్ణ మాదిగ ఒక స్పష్టతతో ఉన్నాడని అతనితో జనవరి 15 వ తారీఖున నేను జరిపిన ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. అతని మాటలలో: “వర్గీకరణను మాదిగ జాతి వదులుకోదు. వదులుకోవడం జరుగదు కూడా. అయితే మన యిష్టాయిష్టాలతోటి సంబంధంలేకుండా కొన్ని పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. మరి ఆ పరిస్థితులలో మనం ఏ విధంగా ప్రవర్తించేమనే దానిపైననే ఆధారపడి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది… చరిత్ర నుండి కొన్ని పాఠాలను గుణ పాఠాలను మనం నేర్చుకోవలసి ఉంది. స్వాతంత్ర్య పోరాటానికి అగ్ర కులాలు నాయకత్వం వహించాయి. స్వాతంత్ర్యోద్యమ కాలంలో స్వతంత్ర్యుడిగా (ఏ పార్టీకి చెందనివాడిగా) అంబేద్కర్ ఆ పోరాటంలో భాగస్వామి కాదు. కాని స్వాతంత్ర్యానికి ముందే మా జాతి సంగతి తేల్చండి అని ప్రశ్నించి దళితులకు రిజర్వేషన్లను సాధించాడు. అలా రిజర్వేషన్లనయితే దళితులు సాధించుకున్నారు గాని, అరవై యేళ్ళుగా రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడ్డారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది మేమే’ అన్న ఆ ఒక్క నినాదంతోటే అగ్ర కులాలు యిప్పటికీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. అంబేద్కర్ ఆనాటి పొరాటానికి దూరంగా ఉండకుండా తన జాతికి హక్కులను కోరుకుంటూనే అందులో భాగస్వామ్యులుగా దళితులను నడిపించినట్లయితే ‘రిజర్వేషన్లను యివ్వండి’ అని అగ్ర కులాలను అడిగే దుస్థితి నుండి రిజర్వేషన్లను తామే కల్పించుకునే ఒక నిర్ణాయక శక్తిగా దళితులు ఎదిగి ఉండేవారు. స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన అ తప్పిదాన్ని సరిదిద్దుకునే ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ ఉద్యమం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణ పోరాటంలో మనం భాగస్వామ్యులం కాకుంటే చరిత్ర పునరావృతమయ్యి, తెలంగాణ రాష్ట్రంలో దళితులకు యితర అణగారిన వర్గాలు, తెగలు, మైనార్టీలకు  కొన్ని రాయితీలు కల్పించి, వెలమలు – రెడ్లు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారు.”

వర్గీకరణ భవితవ్యమేమిటి?: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత రిజర్వేషన్లను వర్గీకరించుకోవాల్సిన అవసరంలేదని తెలంగాణ మాదిగలలో కొందరు అనుకోవడం వారి అమాయకత్వానికి నిలువెత్తు దర్పణమైతే, రాష్ట్రాన్ని విభజిస్తేనే కోస్తాంధ్రలోని దళితులకు న్యాయం జరుగుతుందని మాల మాహానాడు నాయకులు ప్రవచించడం వారి అతి తెలివికి పరాకాష్ఠ అవుతుంది.

రాష్ట్రాన్ని రెండుగా విభజించినా లేదా ఇప్పుడున్నట్లే ఒకటిగా ఉంచినా దళిత రిజర్వేషన్ల పంపిణీలో మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ఉమ్మడి పంపిణీ విధానంలోనే పంపిణీ చేయడం ఏ కోణం నుండి చూసినా సామాజిక న్యాయం అనిపించుకోదు. ఇది పొట్టనిండి త్రేంచే వారికే మృష్టాన్నం పెడుతూ, డొక్కలెండి ఆకలో అంటున్నవారికి గుప్పెడు మెతుకులు కూడా పెట్టక పోవడమే అవుతుంది. ఉన్న వాడికే యింకా పెట్టడం కులతత్వమేగాని అంబేద్కర్ తత్వం మాత్రం కాదు. కాబట్టి, తెలంగాణ రాష్ట్రం రాని పక్షంలో కుల జనాభా ప్రాతిపదికకు ప్రాంతీయత కోణాన్ని కూడా జోడించి దళిత రిజర్వేషన్లను వర్గీకరించుకోవాలి. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పరిస్తే అప్పుడు కుల జనాభా ప్రాతిపదికన దళిత రిజర్వేషన్లను వర్గీకరించుకోవాల్సి ఉంది. అలా జరుగని పక్షంలో తెలంగాణ దళితులలో అత్యధిక సంఖ్యలోనున్న మాదిగలు విద్యను పెంపొందింపజేసుకుని దళిత కోటాలోని వసతులన్నింటినీ తామే ఆక్రమించేందుకు అవకాశం ఉంది. లేదా, అల్పసంఖ్యలోనున్నప్పటికీ విద్యాపరంగా ముందంజలోనున్న మాలలే దళిత కోటా మొత్తాన్ని తన్నుకు పోయేందుకు అవకాశం ఉంది. అదే విధంగా ఆంధ్రాలో మాదిగ కూటమిలోని కులాల పరిస్థితి దయనీయంగా మారి, మాలల ఆధిపత్యం వెర్రి తలలు వేస్తుందనడంలో లేశమంత సందేహం కూడా ఉండాల్సిన అవసరంలేదు. సారాంశంలో, దళిత రిజర్వేషన్లను వర్గీకరించకుంటే ఒక దళిత కులం యొక్క అభివృద్ధి, ఆధిపత్యం మరొక కులం యొక్క వెనుకబాటుకి, అణచివేతకు దారి తీస్తుంది. కాబట్టి ఏ కులానికి ఎంత జనసంఖ్య ఉందో ఆ జనసంఖ్య ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్గీకరించుకోవడం తప్పనిసరి, అది సామాజిక న్యాయం కూడా.  ఆ న్యాయాన్ని సాధించేందుకు ఒక్క కృష్ణ మాదిగ కాకుంటే వేయిమంది కృష్ణ మాదిగలు పుడతారు, ఒక్క దండోరా ఉద్యమం చాలకుంటే లక్ష దండోరా ఉద్యమాలు పుట్టుకొస్తాయి.

సాంబయ్య గుండిమెడ

(వ్యాసకర్త లండన్ యూనివర్శిటీలో పోస్టు డాక్టోరల్ ఫెలో)

4 Comments

Filed under సామాజిక న్యాయం కోసం

‘సమైక్యత’ ఎవరి కోసం?

    1. (Published in Andhra Jyothi, December 27, 2009)

      “ఆంధ్ర విశ్వ విద్యాలయం వంటి కొన్ని చోట్ల అణగారిన కుల-వర్గాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమైక్య ఆంధ్ర అంటూ ఉద్యమంలో ముందున్నప్పటికీ, నిజానికి ఈ ఉద్యమం ద్వారా వారు బావుకునేది ఏమీ లేదు. సమైక్యంగా ఉండడం వల్ల వారు పొందుతున్న ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రత్యేక ప్రయోజనాలకు ఎట్లా గండి పడుతుందో ఓ పట్టాన అర్థం కావడం లేదు.”

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడతామని కేంద్ర హోం మంత్రి చిదంబరం మొదట ప్రకటించిన తరువాత కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, ప్రజల వినిపించిన వాదాలు, చేపట్టిన చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి. మలిదశం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైన దగ్గర నుంచి ఏనాడు మచ్చుకైనా వినిపించని సమైక్య వాదం ఇప్పుడు ఎందుకు ఇంత ప్రబలంగా వినిపిస్తున్నది? ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కానీ, సమైక్య వాదానికి మద్దతుగా కానీ కనీసం ఓ మీటింగ్‌ పెట్టడం, ఓ చిన్న పాదయాత్ర జరపడం చేయని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, ప్రజలు ఇప్పుడు భారీ ఎత్తున బయటకొచ్చి నిరసన వ్యక్తం చేయడంలో ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి? అసలు సమైక్యవాద ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందా లేక ఆర్థిక, రాజకీయ, సామాజిక బలాలున్న కొందరు వ్యక్తులు స్పాన్సర్‌ చేసిందా? ఇటీవల శక్తివంతంగా జరిగిన విద్యార్థి ఉద్యమం వల్లనే తెలంగాణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది అనుకుంటే పొరపాటే.

      అంతకు ముందు ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ మరింత బలంగా ఉన్నా కేంద్రం ఎందుకు సానుకూలత చూపలేదో అర్థం చేసుకోవాలి. వై.ఎస్‌. మరణం, చంద్రబాబు అధి కార లేమి ప్రత్యేక తెలంగాణకు మార్గం సుగమం చేశాయి. ఆంధ్ర విశ్వ విద్యాలయం వంటి కొన్ని చోట్ల అణగారిన కుల-వర్గాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమైక్య ఆంధ్ర అంటూ ఉద్యమంలో ముందున్నప్పటికీ, నిజానికి ఈ ఉద్య మం ద్వారా వారు బావుకునేది ఏమీ లేదు. సమైక్యంగా ఉండడం వల్ల వారు పొందుతున్న ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రత్యేక ప్రయోజనాలకు ఎట్లా గండి పడుతుందో ఓ పట్టాన అర్థం కావడం లేదు.

      అయితే వారికి తెలుసో, తెలియదో కానీ ఒక్క విషయం మాత్రం నిజం. సమైక్య ఆంధ్ర ఉద్యమం వెనుక అగ్రకులాలున్నాయి. ముఖ్యంగా ఆ కులాలలో ఆర్థికంగా బలపడిన వర్గాల వారి ప్రయోజనాలున్నాయి. హైదరాబాద్‌లో, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలలో బట్టల వ్యాపారం దగ్గర నుంచి, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, మీడియా – వంటివి కోస్తాంధ్ర, రాయలసీమ వారి చేతిలో ఉన్నాయి. వీరి వ్యాపార సామ్రాజ్యాలలో పనిచేసే ఉద్యో గస్తులలో కింది శ్రేణిని తప్పించి ఉన్నత, మధ్య శ్రేణులకు చెందిన వారి సామాజిక, ప్రాంతీయ చిట్టా తీస్తే అప్పుడు తెలుస్తుంది, ఆ వ్యాపార అధిపతులలో పేరుకు పోయిన కుల, ప్రాంతీయ తత్వం.

      మరి ఉన్నత కులాల వారు నిర్వహిస్తున్న వ్యాపారాలలో , సంస్థలలో తమకు ఉద్యోగాలు కూడా ఇవ్వని అగ్రకుల వర్గాలు నడిపిస్తున్న సమైక్య ఉద్యమంలో అణచివేతకు గురి కాబడిన కుల వర్గాల వారు సిపాయిలుగా ఎందుకు మారాలో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌లో, నగర శివారులో సంస్కృతి కళల పేరిట, అభివృద్ధి వ్యాపారాల పేరిట ఉన్నత వర్గాలకు కట్టబెట్టిన వేలాది ఎకరాల చిట్టాను బయటకు తీసే అవకాశం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది సాధ్యమైన రోజున అన్యాయంగా కట్టబెట్టిన , అక్రమం గా ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం తీసుకుని తెలంగాణలో అణగారిన కుల-వర్గాలకు, అగ్రకులాలలోని పేదలకు పంచడానికి మార్గం సుగమం అవుతుంది.

      తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల మైనారిటీల రక్షణకు భంగం కలుగుతుందనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. నిజాం చరిత్రను పరికిస్తే- వందల ఏళ్ళుగా హైదరాబాద్‌ సంస్థానంలో భిన్న మతాల వారు సామరస్యంతో జీవించారు. హైదరాబాద్‌, సికిందరాబాద్‌లలోనే కాదు తెలంగాణలోని పలు చోట్ల క్రైస్తవ దేవాలయాలు నిజాం కాలంలో నిర్మితమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత మైనారిటీల శాతం పెరిగి మరిన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనారిటీలు సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకించి, ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలుపవలసి ఉంది.

      ఇందుకు తగిన కారణాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడం వల్ల ఈ ప్రాంతంలోని కింది కుల-వర్గాలవారు కొందరయినా విద్య నేర్చుకుని ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. కానీ విద్యాభివృద్ధి అంతగా లేని తెలంగాణలో కింది కుల-వర్గాల వారు అధికశాతం ఇంకా వ్యవ సాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కృష్ణా గోదావరి వంటి జీవనదులు తమ ముంగిటే ప్రవ హిస్తున్నప్పటికీ వాటిని తమ పొలాల్లోకి మళ్ళించుకోలేక పోతున్నారు. తెలంగాణ వస్తే వారి ముంగిట్లో పరవళ్లు తొక్కుకుంటూ పారే నదీ ప్రవాహాలను తమ పొలాలకు మళ్లించుకుంటారు. కొత్త రాష్ట్రం అంటే ప్రభుత్వంలోని ప్రతి శాఖను ప్రత్యేకించి ఏర్పాటు చేయవలసి ఉంటుం ది.

      దీని వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీనిలో ఎస్‌సి, బిసి, ఎస్‌టి, మైనారిటీలకు తమ కోటా ఎలాగూ ఉంటుంది. అంబేద్కర్‌, ఆయన అనుయాయుల చిరకాల స్వప్నం దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ వర్గాల వారికి రాజ్యాధికారం. ఇప్పటి వరకు రెండు కులాల వారే అన్ని పార్టీలను గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తున్నారు. తెలంగాణలో బహు సంఖ్యలో ఉన్న దళి త, ఆది వాసీ, మైనారిటీలు ఉమ్మడిగా రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో చేజిక్కించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. అందుకే న్యాయబద్ధమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించవలసిన బాధ్యత అణచివేతకు గురవుతున్న కుల-వర్గాల ప్రజలపై ఉంది.

      – సాంబయ్య గుండిమెడ
      (వ్యాసకర్త గుంటూరు జిల్లా వాస్తవ్యుడు, లండన్‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో)

Leave a comment

Filed under సామాజిక న్యాయం కోసం

దళిత సాహిత్యం: మాదిగ దృక్పథం – ఒక పరిశీలన (Dalit Literature and Madiga Perspective – A Critique)

దళిత సాహిత్యం: మాదిగ దృక్పథంఒక పరిశీలన

– సాంబయ్య గుండిమెడ*

మాదిగ దండోరా భారతీయ సామాజిక ఉద్యమాల్లో ఒక మార్పు.  సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సైద్ధాంతిక విషయాల్లో అది తెచ్చిన మార్పు గణనీయం. కొందరి ద్వారా తిట్టు పదంగా వాడబడే మాదిగ అనే పదాన్ని వాళ్ళు రావు, రెడ్డి, శాస్త్రి, శర్మ లాగా గౌరవ వాచకంగా మార్చారు, విలువలు మార్చబడ్డాయి, మాదిగ భాష మానవీయమైంది. మాదిగ సాహిత్యం ఉధృతమై పాట, ప్రసంగం, వ్యాసం, కథ, నవల ప్రక్రియలన్నిటిలో విస్తరించింది. మాదిగ దండోరా శ్రామిక కుల సంఘాలలో కొత్త చైతన్యాన్ని తెచ్చింది.

— బి. యస్. రాములు[1]

దళితుల విద్య – ఉపాధికై కల్పించిన రిజర్వేషన్ వసతులలో అగ్ర భాగాన్ని ఆ కూటమిలో అప్పటికే సాంఘికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగిన మాలలు, ఆది-ఆంధ్రులు చేజిక్కుంచుకుంటున్న కారణాన మాదిగలు, రెల్లి యిత్యాది దళిత కులాలు ఆ వసతులనుండి దూరంగా నెట్టివేయబడటం జరిగింది. సామాజిక న్యాయం పేర రాజ్యాంగ బద్దంగా కల్పించిన అవకాశాలు దళిత కూటమిలోని కులాలన్నింటికీ చెందుతాయి. అలాగాక కూటమిలోని కేవలం రెండు కులాలే వినియోగించుకోవడం అనేది ఆ కూటమిలోని మిగిలిన కులాలకు జరుగుతున్న సామాజిక అన్యాయం. రిజర్వేషన్ వసతులను కులపర విభజన చేసి దళిత కూటమిలో అభివృద్ధికి నోచుకోని కులాలకు సామాజిక న్యాయం చేకూర్చమంటూ మాదిగలు, రెల్లిలు ఇంకా ఇతర దళిత కులాలు ఒక కూటమిగా ఏర్పడి ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ (ఎం.ఆర్.పి.యస్.) పేర ‘వర్గీకరణ’ డిమాండ్ తో దండోరా ఉద్యమానికి పూనుకున్నారు.  వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాలలు, ఆది-ఆంధ్రులు ఒక కూటమిగా ‘మాల మహానాడు’ ను ఏర్పాటు చేసుకుని వర్గీకరణతో సామాజిక న్యాయం జరగదని, పైపెచ్చు అది దళితుల ఐక్యతకు గొడ్డలిపెట్టు అంటూ ప్రతికూల ఉద్యమంతో మాదిగలను ప్రతిఘటించారు.  కులం, సామాజిక న్యాయం, ఐక్యత అనే మూడు అంశాలు ప్రధానంగా దండోర – మాల మహానాడు ఉద్యమ వేదికలపై ముందుగా  మాదిగ-మాలల మద్య ఒక గొప్ప చర్చ జరిగింది. ఆ ఉద్యమాలు, అవి లేవనెత్తిన ప్రశ్నలు ప్రధాన వస్తువులుగా పరిగణించి ఈ రెండు కులాలకు చెందిన రచయితలు, వ్యాసకర్తలు, కవులు, కథకులు తమదైన రీతిలో స్పందించి దళిత సాహిత్యంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆరంభించారు.  దండోరా ఉద్యమ నేపథ్యంలో, ఆ ఉద్యమ స్పూర్తితో ఎందరో మాదిగ విద్యావంతులు తమ కలాలకు పదునుపెట్తి కరపత్రాలతో, పాటలతో ప్రారంభించి కవిత, కథానిక, వ్యాసం, నవల మొదలైన ప్రక్రియలతో తెలుగు సాహిత్య నాట్య రమణికి కొత్తనడకలు నేర్పారు. అరంభంలో కేవలం మాదిగోడి గోడు వినిపించడానికే పట్టిన కలం క్రమేపి తమ కుల సమస్యల ఎల్లలు దాటి తమలాగే సామాజిక గుర్తింపు కోల్పోయి, సామాజిక అన్యాయానికి గురయిన ఎన్నో దళిత దళితేతర కులాల సమస్యలను కూడా తట్టింది, మానవత్వంతో వారి పక్షాన నిలిచింది. దండోరా లేవనెత్తిన చర్చను, సృష్టించిన సాహిత్యాన్ని ఆమూలాగ్రం పరిశీలించే భగీరథ ప్రయత్నాన్ని వెంకటేశ్వరరావు దార్ల తన వ్యాస సంకలనంలో చేపట్టి, ఆణిముత్యాల్లాంటి అయిదు వ్యాసాల సమాహరాన్ని “దళిత సాహిత్యం: మాదిగ దృక్పథం” పుస్తకంగా ప్రచురిస్తున్నాడు.[2] ఆ అయిదు వ్యాసాలను నాలుగు స్వతంత్ర విభాగాలలో పరిశీలించే ప్రయత్నమే ఈ వ్యాసం.

I. పుల్లం రాజు నుండి నల్ల రేగడిసాల్లు వరకు: తెలుగు దళిత కథా పరిణామం

తెలుగు దళిత కథా పరిణామాన్ని వివరిస్తూ దళిత కథకు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని కల్పించే ప్రయత్నాన్ని ‘తెలుగు దళిత కథా పరిణామం’ వ్యాసంలో దార్ల చేశాడు. సాధారణంగా ఒక వ్యవస్థనో లేదా ఒక రంగాన్నో శాసిస్తున్నవారు కొత్తదనాన్ని అహ్వానించరు. ముఖ్యంగా ఆ కొత్తదనం తమ పీఠాలను కదిలించేటట్లుంటే ఆరంభంలోనే దాన్ని భూస్థాపితం చేసేందుకు ఎన్నో సామ, దాన, భేద, దండోపాయాలు ఆచరిస్తారు. ఎన్ని చేసినప్పటికీ ఆ కొత్త శక్తిని ఆపడం తమ తరం కానప్పుడు జీవంలేని వాదాలతో దాని ప్రభావాన్ని తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇట్టి ప్రయత్నాలు వారి మూర్ఖత్వాన్ని, వితండవాద బుద్దిని బట్టబయలు చేస్తాయేకాని  ఆ నవ్యతలోని శక్తిని ఏ మాత్రం తగ్గింపజాలవు. కవిత్వం, కథ, నాటకం, పాట, విమర్శ తదితర సాహిత్య ప్రక్రియలతో దళిత సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నప్పటికీ అట్టి సాహిత్యం ఉద్యమం కాదు అది వాదమేనని సంప్రదాయవాదులు మార్క్సిస్టులు, వాదించడం వారి వితండవాద బుద్దికి పరాకష్ట. వితండవాదుల వాదాలకు సమాధానాలు యివ్వవలసిన అవసరం ఉండదు, అసలు వాటి గురించి పట్టించుకోవలసిన పనే లేదు.  అయితే ఈ వితండవాదుల నోర్లు మూయించకుంటే వారు మరలా మరలా అటువంటి వాదాలను చెయ్యడానికి అవకాశం ఉంది.  పైగా వీరు తెలుగు సాహితీ రంగాన్ని ఇంకా శాసిస్తునే ఉన్నారు, కాబట్టి కొత్తదనం ముందుకు సాగాలంటే ఈ ముదితల సణుగుడిని ఆపింపజేయడం తప్పనిసరి అవుతుంది. దళిత కథా పరిణామాన్ని పరిశీలించే ముందు ఈ పనికే దార్ల నడుం బిగించాడు. వాదానికి తాత్విక దృక్పథం కంటే ఆ వాదాన్ని వినిపించేవారి ఆశలను – ఆశయాలను వినిపించడమే ప్రధానంగా ఉంటుంది.  పైపెచ్చు వాదం చాలాసార్లు కొన్ని తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తుంది.  అయితే ఉద్యమం అలాకాదు.  దానికి  “స్పష్టమైన ప్రణాళిక, లక్ష్యం, తాత్విక నేపథ్యం, దృక్పథం మొదలైనవి ఉంటాయి”, అని ఉద్యమాన్ని నిర్వచించి దళిత సాహిత్యం ఉద్యమేనని స్పష్టంగా చెబుతాడు.  ఆ విషయాన్ని నా మాటలలో కంటే దార్ల మాటలలో పేర్కొంటేనే అందులోని స్పష్టత తెలుస్తుంది.

దళిత సాహిత్యానికి ‘దళిత పాంథర్స్’ నుండే ఒక ప్రణాళిక ఉంది.  కుల నిర్మూలన లక్ష్యం ఉంది.  వర్ణాశ్రమ  ధర్మాలపై నిర్మితమైన భారతీయ సమాజం, వివిధ మతాల ప్రభావాలు వంటి వాటినుండి శారీరక, మానసిక, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక క్షోభలను, అవమానాలను ఎదుర్కొన్న జాతుల ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలనే నేపథ్యం ఉంది.  డా. బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ మొదలైన వారి భావ జాలాన్ని అర్ధం చేసుకుంటేగాని ఇవన్నీ అవగాహనలోకిరావు.  ఆ దృక్పథంతో తెలుగు దళిత సాహిత్యాన్ని చూస్తేగాని తెలియదు. అలా చూడగలిగినప్పుడు దళిత సాహిత్యం ఉద్యమేనన్న విషయం స్పష్టమవుతుందని దళిత సాహిత్యానికి ఒక పటిష్టమైన దీప శిఖరాన్ని అతను నిర్మిస్తాడు.  ఆ దీప శిఖరంపైనుండి దళిత కథా కట్టడాన్ని పర్యవేక్షిస్తాడు.

తెలుగు దళిత కథా పరిణామం రెండు దశలలో జరిగింది. అవి స్వాతంత్ర్యానికి పూర్వం ఒక దశ అయితే స్వాతంత్ర్యం తరువాత రెండవ దశ. స్వాతంత్ర్యానంతరం తెలుగు రాష్ట్ర రాజకీయాలను, దళితుల (వీరితోపాటు దళితేతరులలో సామాజికంగా-ఆర్ధికంగా వెనుకబడిన అణగారిన వర్గాలవారి)  జీవన స్థితిగతులను వివిధ రాజకీయ-తాత్విక ఉద్యమాలు, సంఘటనలు, సమస్యలు ప్రభావితం చేస్తాయి. అట్టి వానిలో ముఖ్యమైనవి: కమ్యూనిస్ట్ తాత్విక ఉద్యమం-రాజకీయాలు, నక్సల్బరీ-శ్రీకాకుళ పోరాటాలు, స్త్రీవాద ఉద్యమం, కారంచేడు-చుండూరు దురాగతాలు, మాదిగ దండోరా వర్గీకరణ డిమాండ్. వీని ఆధారంగా స్వాతంత్ర్యానంతర తెలుగు కథా పరిణామాన్ని మూడు దశలలో దార్ల వీక్షిస్తాడు. దళిత వాదానికి ప్రాతినిధ్యమనదగిన కొన్ని కథలను పరిశీలించడం ద్వారా దళిత కథా స్వరూప స్వభావాలను, పరిణామాన్ని తెలియ జేయడం జరిగింది. కాల ప్రాతిపదికన దళిత కథా పరిణామాన్ని వీక్షించినప్పటికీ వామపక్ష, స్త్రీవాద, దళిత, మాదిగ ఉద్యమాల నేపథ్యంలో ఆయా కాలాల దళిత సమస్యల వస్తుపరంగా ఈ పరిణామాన్ని తెలియజేయడం ఈ వ్యాస విశిష్టత.

స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన దళిత కథల్లో దళితేతరులు ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి చెందినవారు రాశారు.  అలా రాసిన వారు మహాత్మా గాంధీ ‘హరిజనోద్ధరణ’ పిలుపుకి ప్రభావితులై రాయడం జరిగింది. వీరిలో  ‘పుల్లం రాజు’, ‘సాగర సంగం’ లాంటి కథలు రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి , ‘నరసన్నపాపాయి’ కథకుడు అడవి బాపిరాజు ముఖ్యులు. వీరి కథలలో ప్రధానంగా కనిపించేవి మూడు విషయాలు/సమస్యలు: (1) దళితుల మధ్య అనైక్యత, (2) దళితుల దేవాలయ ప్రవేశం, (3) దళితుల మతాంతరీకరణ.  వీరు తమ కథానికలలో హరిజన సమస్యలను చెప్పడంతోటే సరిపెట్టుకోక ఏ హరిజనోద్ధరణ పిలుపుతో తాము ప్రభావితులయ్యారో, ఆచరణలో ఆ హరిజనోద్ధరణలోని డొల్లను నిజాయితితో స్పష్టం చేశారు.  ఉదాహరణకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ కథ అసలు హరిజన సమస్యను అగ్రకులాలు ఎంత చాకచక్యంగా తప్పుదారి పట్టిస్తున్నారో స్పష్టం చేస్తుంది. వీరితో పాటు చలం లాంటి సాహితీవేత్తలు ‘హరిజన సమస్య’, ‘మాదిగమ్మాయి’ లాంటి కథలను రాసినప్పటికీ హరిజన ‘సమస్య’ లోతులు తెలియకుండా రాసిన కథలని దార్ల వ్యాఖ్యానిస్తాడు.  ఈ విషయాన్నే బి.యస్. రాములు వేరొక సందర్భంలో:  “చలం రాసిన ‘హరిజన విద్యార్ధి’ కథ అతనిలో గల బ్రాహ్మణ స్వభావాన్ని పట్టిస్తుంది. హరిజనులంటే మొగోల్లే అన్నట్టు, హరిజనుల్లో స్త్రీలుంటారని మతికిరాని చలం కడుపుమంటతో రాసిన కథ యిది,”[3] అని స్పష్టపరుస్తాడు.

స్వాతంత్ర్యం తరువాత, కారంచేడు సంఘటనకు ముందు ఉన్న కాలం దళిత ఉద్యమ – రాజకీయాలకు సంధి కాలమైనట్లే దళిత కథకు కూడా సంధి కాలం అవుతుంది. ఈ కాలంలో అటు దళిత కూటమిలో – యిటు హిందూ కూటమిలో గాంధీ హరిజనోద్ధర ఉద్యమం, రాజ్యంగం ద్వారా దళితుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధికై చేపట్టిన వివిధ పాలసీ-పథకాల రూపేణా ఎన్నో మార్పులు-చేర్పులు జరుగుతాయి. ఈ మార్పు-చేర్పుల సమస్యలే స్వాతంత్ర్యానంతరం వచ్చిన దళిత కథకు ప్రధాన వస్తువులయ్యాయి. అస్పృశ్యత, నీటి సమస్య, రాజకీయాధికారం, వృత్తి వల్ల వచ్చే అనారోగ్యం, వృత్తులు మారి చదువుకున్నా వీడని కుల పీడన, గ్రామాల్లో భూస్వామ్య పెత్తందారీ రాబందుల విధానాలవల్ల దళితులు పడిన ఇబ్బందులు ప్రధానమైనవిగా దార్ల గుర్తిస్తాడు. ఈ సంధి కాలంలో దళిత కథను సుసంపన్నం చేసిన వారు ముఖ్యంగా రెండు కూటమిలకు చెందిన వారు: ఒకరు వామపక్ష కూటమికి  చెందిన వారైతే (వీరిలో అధికులు దళితేతరులు), మరొకరు దళిత కూటమికి చెందిన వారు.  దళిత కూటమికి చెంది దళిత వస్తువు ప్రధానంగా కథలు రాసిన వారిపై అంబేద్కర్ భావజాల ప్రభావం కనిపిస్తుంది.  ఈ కూటమికి చెందిన వారిలో అగ్రజుడు కొలకలూరి ఇనాక్. అతను వ్రాసిన ‘ఊరబావి’ కథ కేవలం దళిత కథలలోనేగాక మొత్తం తెలుగు కథానికలలో ఒక కోహినూర్ వజ్రం లాంటిది.  అందుకే ఆ కథ “స్వాతంత్ర్యానంతర తెలుగు ఆధునిక కథ”, అని, “కొలకలూరి ఇనాక్ స్వాతంత్ర్యానంతర ఆధునిక తొలి తెలుగు కథకుడు” అని బి.యస్. రాములు తన ‘50 ఏళ్ళ తెలుగు కథ తీరు తెన్నులు’ వ్యాసంలో ప్రతిపాదిస్తాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1970వ దశకం చివరాంకంలో ఆరంభమై 1980వ దశకం ప్రధమాంకానికే జాగృతి ఉద్యమాల జాబితాలో ప్రధమ స్థానంలో నిలబడిన స్త్రీవాద ఉద్యమం, 1980వ దశకం చివరాంకంలో మొలకెత్తి 1990వ దశకం ప్రధమాంకానికల్లా మహవృక్షమైన దళిత ఉద్యమం మన సమాజంలోని పురురుషాహంకారాన్ని, అగ్రకులతత్వాన్ని జూలు పట్టుకుని నడివీధిలోకి లాక్కొచ్చి ఆ పురుషహంకారం, ఆ అగ్రకులతత్వం ఇకపైన చెల్లవంటూ నిష్కర్షగా తేల్చి చెప్పాయి. ఈ రెండు ఉద్యమాల స్ఫూర్తితో ఆవిర్భవించిన దళిత స్త్రీవాద ఉద్యమం తమ మగపుంగవుల పెత్తనం; ఆడది, పేదది అందులోనూ అంటరానికులానికి చెందినదని అలుసు తీసుకుని తమ బులుపును తీర్చుకోవాలని చూచే అగ్రకుల సైంధవుల ఆటలను కట్టి పెట్టమని, లేకుంటే చెప్పు తెగుదుందని తూటాలవంటి మాటలతో గట్టిగానే హెచ్చరించింది. ఈ ఉద్యమాల నేపథ్యంలో ‘దళిత కథలు’ పేరుతో కె. లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో వచ్చిన ఎనిమిది సంపుటాలు;  వాటితో పాటు  ‘ఉప్పు నీళ్ళు’, ‘హెచ్. సరస్వతి’, ‘నలుపు’ లాంటి అనేక కథలు; జూపాక సుభద్ర, గోగు శ్యామలల సంపాదకత్వంలో వెలువడిన ‘నల్ల రేగడిసాల్లు’ లాంటి కథానిక సంపుటాలు దళిత కథను సుసంపన్నం చేశాయని తెలుగు దళిత కథా పరిణామంలో ఈ కథల ప్రాముఖ్యతను దార్ల గుర్తిస్తాడు.  వీనితోపాటు దండోరా ఉద్యమ నేపథ్యంలో మాదిగల జీవితం ప్రధాన వస్తువుగా వచ్చిన కథలను గురించికూడా ఈ వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావన గురించి కింద చెప్పటం జరుగుతుంది.

II. కరపత్రాలనుండి కక్క నవల వరకు: మాదిగ సాహిత్య పరిణామం, దాని దృక్కోణం

ఎండిన చెరుకాకులతో మంట పెట్టి ఆ మంటలో కాపిన తప్పెటలతో మాదిగలు వేసే పదునైన దరువుకి, చేసే లయ బద్దమైన తాండవానికి ఊరంతా ఒక్కొక్కమారు వెర్రెత్తిపోతే ఒక్కొక్కమారు భయకంపితులై గుండెలు పట్టుకుంటారు. వచ్చీ రావడంతోనే వివిధ ప్రక్రియలతో సాహిత్య ఫలకంపై మాదిగలు వేసిన దరువుకి, చేసిన తాండవానికి తెలుగు సాహితీ రంగం వెర్రెత్తిపోతే; ఉమ్మడి రిజర్వేషన్లలో దళితుల పేర తమ వారు తిష్ట వేసినట్లే దళిత సాహిత్యం పేర తమ కుల జీవితాన్ని, తమ కుల అజెండాను ముందుకు నెడుతున్న మాల సాహితీకారులు ఒక్క సారిగా భయభ్రాంతులయ్యారు, బిక్కసచ్చిపొయ్యారు. మాదిగ సాహిత్య సూర్య కిరణాలను చేవలేని మూడు వాద చేతలతో అడ్డుకోవడానికి ప్రయత్నించారు.  అవి: (1) సాహిత్యం పేర మాదిగలు రాస్తున్న రాతలు సాహిత్యమేకాదు. వారి కవిత్వం శిల్ప పరంగా లోపభూయిష్టంగా ఉంది; (2) దళిత రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ప్రచారం చేయడానికే మాదిగ సాహిత్యం పుట్టుకొచ్చింది; (3) మాదిగ సాహిత్యం పేరుతో ప్రత్యేక సాహిత్యంగాని, ప్రత్యేక వాదంగాని రావలసిన అవసరంలేదు. ఆ సాహిత్యం, ఆ వాదం దళిత సాహిత్యంలో, దళిత వాదంలో అంతర్భాగాలే.  ఈ మూడు వాదాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టంగా అవగతమవుతుంది. నేను పైన పేర్కొన్నట్లుగా ఒక రంగంలో తిష్టవేసి దానిని శాసిస్తున్న పాతతరం కొత్తతరం తెచ్చే నవ్యతనుగాని మార్పునుగాని హర్షించలేదు, ఆహ్వానించలేదు. దళిత ఉద్యమ నేపథ్యంలో వచ్చిన దళిత సాహిత్యాన్ని సంప్రదాయ, మార్క్సిస్టు సాహితీకారులు ఆహ్వానించకపోగా దానిని ఆదిలోనే అంతమొందించడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. అలా చేసిన ఏ ప్రయత్నమూ ఫలవంతం కాక పోగా, దళిత సాహిత్య ప్రవాహం పరవళ్ళు తోక్కుకుంటూ ముందుకు దూసుకు పోయింది.  అప్పటికీ తమ ప్రయత్నాలు వీడక  ప్రవాహాన్ని అపడం సాధ్యం కాకపోతే పోయింది కనీసం దాని వేగాన్నయినా అపలేమా అని కొన్ని చొప్పదంటు వాదాలు అడ్డుపెట్టడం చేశారు. సరే, దళిత సాహిత్య ప్రవాహ ఒరడిలో ఆ అడ్డులన్నీ కొట్టుకుపోయిన సంగతి సాహితీకారులందరూ ఎరిగిన విషయమే.

ఇప్పుడు రంగం మారింది.  అప్పటి సంప్రదాయ, మార్క్సిస్టు సాహితీకారుల స్థానాలలో దళిత సాహితీకారులుగా చెలామణి అవుతున్న మాల సాహితీకారులు నిలబడితే, అప్పటి దళిత సాహితీకారుల స్థానాలలో మాదిగ సాహితీకారులు నిలబడటం జరిగింది. అయితే, ఈ సమరానికి సానపట్టిన వాదకత్తులు, యుద్ధ తంత్రాలు మాత్రం పాతవే, పూర్వపు రంగానికి చెందినవే.   అందుకే ముందుగా మాదిగ సాహిత్యాన్ని అసలు సాహిత్యమే కాదంటూ ప్రసేన్ పేర్కొన్నట్లుగా “మాల దళిత కవులు ఎంచక్కా బ్రాహ్మణ భావజాల కన్యక చేలాంచలాల వెనుక కుంటుకుంటూ వెళ్ళిపోయారు”.[4] భూమిపై బీజం పడినాక మొలకెత్తక మాననట్లే మాదిగ సాహిత్య బీజానికి మాల సాహితీకారులు పాదులు తీయనంత మాత్రాన దాని పెరుగుదల ఆగిపోలేదు. పైపెచ్చు వివిధ సాహితీ ప్రక్రియల సంతులిత ఎరువుతో రోజు రోజుకీ వాపుగా ఏపుగా ఎదగడం ఆరంభించింది.  మాదిగ సాహిత్యాన్ని తాము గుర్తించినా గుర్తించకపోయినా దాని ఎదుగుదల ఆపడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన మాలలు, అలా ఆపలేకపోయినా కనీసం దాని పటుత్వాన్నైనా ఏదొక రూపంలో బలహీనపరచాలనే దురుద్ధేశంతో కేవలం దండోరా ఉద్యమ ప్రచారమే మాదిగ సాహిత్య ఆశయ – లక్ష్య ఆద్యంతాలు అని ప్రచారం చేసి ఆ సాహిత్య పరిధిని కుదించే ప్రయత్నం చేశారు.  అయితే మాదిగ కలం గూడేంలో పుట్టినప్పటికీ గూడెపు హద్దులు దాటి అణచివేతకు, అన్యాయానికి గురైన వారందరి పక్షనా కులాతీతంగా, మతాతీతంగా నిలబడటం సాహితీకారులందరికీ తెలిసిన విషయమే. తాము వెర్రి మొర్రి అనుకున్నదే ఏ రంపానికీ తెగని మర్రి వృక్షమవడంతో ఇక చేసేదేమిలేక ఆ వృక్షంకూడా దళిత సాహితి వనంలోదే అని మాదిగ సాహిత్యాన్ని స్వంతం చేసుకోవడం మొదలుపెట్టారు దళిత సాహితీకారులమని చెప్పుకునే కొంతమంది మాల సాహితీకారులు. మాదిగ సాహిత్యాన్ని యిలా స్వంతం చేసుకోవడాన్ని ఆ సాహిత్యాన్ని వారు గుర్తించినట్లుగా చాలామంది భావించడానికి అవకాశముంది.  అయితే నా దృష్టిలో యిలా స్వంతం చేసుకోవడం అనేది మాల సాహితీకారులు పన్నిన మరో పన్నాగం.  వృక్షం మర్రి వృక్షమైనా అది దళిత వనంలోదే.  దళిత వనంలో మర్రి వృక్షంతో పాటు పలు వృక్షాలు ఉంటాయి. కాబట్టి ఒక్కదాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అయితే గియితే ఏదైనా చెప్పుకోవాలంటే ఆ వృక్షాలన్నీ ఉన్న వనం గురించి సార్వజనికంగా చెప్పుకుంటే సరిపోతుంది. వివరణలో మాదిగ సాహిత్యం దళిత సాహిత్యంలో అంతర్భాగం అని చెప్పడం ఆ సాహిత్యానికున్న ప్రత్యేకత, విశిష్టతలను కొల్లగొట్టడం లేదా తగ్గిండానికి చేసిన ప్రయత్నమే.  ఈ విషయాలన్నింటిని సవిస్తరంగా చెబుతూ మాదిగ సాహిత్య చారిత్రక పరిణామాన్ని, ఆ సాహిత్య లక్ష్య దృక్పథాలను, దాని ప్రత్యేకతలను ‘దళిత సాహిత్యం: మాదిగ సాహిత్యం’ అన్న వ్యాసంలో దార్ల విశ్లేషణ చేశాడు.

ఈ వ్యాసంలో మూడు ముఖ్యమైన అంశాలపై దార్ల తన దృష్టిని కేంద్రీకరిస్తాడు. అవి: (1) మాదిగ సాహిత్య చారిత్రక పరిణామం; (2) మాదిగ సాహిత్య ఆశయ-లక్ష్యాలు; (3) మాదిగ సాహిత్య ప్రక్రియలు-వస్తు విషయాలు. మాదిగ సాహిత్య పరిణామం మూడు దశలలో జరిగింది. దండోరా ఉద్యమ ఆరంభంతో ఆ ఉద్యమ వాదాన్ని వినిపించడమనే ఏకైక ఉద్దేశ్యంతో కరపత్రాలు, పాటల రూపంలో ప్రారంభమైన మాదిగ సాహిత్యం కవిత్వంతో ఒక క్రొత్త మలుపు తిరగడం ప్రాధమిక దశ.  ఈ తొలి దశలో వచ్చిన సాహిత్యంలో పదునైన ఆలోచనలతోపాటు చిక్కనైన ఆవేశం కూడా ఉంది.  దళిత రిజర్వేషన్ వసతులలో అధిక శాతాన్ని తమకంటే తక్కవ జనాభా కలిగిన మాలలు ఎక్కువగా వినియోగించుకోవటం ఈ ఆవేశానికి ఆధారం.  కొత్తగా పట్టిన కలం కావడంతో అది ఆవేశ కట్టను తెంచి ఆలోచన పంటను ముంచెయ్యడం ఈ దశలో జరిగిన ఒక వైపరీత్యమని దార్ల నిజాయితీగా ఒప్పుకుంటాడు. అయితే దళిత సాహిత్యం తొలినాళ్ళల్లో దళిత కలం దళితేతరులపైనా, ఇప్పుడు మాదిగ కలం మాల కులంపై విరుచుకుపడిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా, తీవ్ర స్థాయిలో అవేశంతో ఊగిపోయినప్పటికీ దళిత ఉద్యమాన్ని దాని కలాన్ని సమర్ధించే ఒక వర్గం అప్పటికే ఏర్పడి ఉండడం, అట్టి వర్గ పందిరి మాదిగ కలల మల్లెమొగ్గకు లేక పొవడంతో అది ఎదుర్కొన్న ఒడుదుడుకులను కుడా గుర్తించాలని దార్ల గుర్తుచేస్తాడు. మాదిగ ఉద్యమానికి అవసరమైన భావజాలాన్ని అందిస్తూనే తమ ప్రాచీనులు తమకు అందించిన జానపద, మౌఖిక సాహిత్య వారసత్వ సంపదను తిరిగి దొరకబుచ్చుకునే ప్రయత్నంలో మాదిగ సాహితీకారులు నిమగ్నులవ్వడం వారి సాహిత్య పరిణామంలోని రెండవ దశ.  ఇక మూడవ దశ మాదిగ సాహిత్య వ్యవస్థీకృత దశ. “మాదిగ సాహిత్య వేదిక ఏర్పడి, మాదిగలకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉందని చాటి చెప్తూ, ఆత్మగౌరవంతో ప్రత్యేక సాహిత్య వాదంతో నిలబడాలనుకోవడం” ఈ దశలోని ప్రత్యేకత అని దార్ల పేర్కోంటాడు.

రెండవ అంశమైన మాదిగ సాహిత్య ఆశయ-లక్ష్యాలలో, కులం పేరుతో కారంచేడు కమ్మలు జరిపిన మాదిగ మేథానికి వ్యతిరేకంగా దళిత ఆత్మ గౌరవ ఉద్యమం ఆరంభమైతే, దళిత కూటమిలో తమనే ప్రధాన కేంద్రంగా చేసుకుని మాలలు సాగిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా వచ్చిందే మాదిగ ఆత్మ గౌరవ ఉద్యమం. కుల నిర్మూలన, రాజ్యాధికారం అనే రెండు ప్రధానమైన అంశాల అజెండా సాధన దళిత ఉద్యమ-సాహిత్యాల ఉమ్మడి ఆశయ-లక్ష్యాలైతే; కుల వివక్ష నిర్మూలన, దళిత రిజర్వేషన్లను దళిత కులాన్నింటికి సమ పంపిణి, రాజ్యాధికారంలో అందరికి సమాన భాగస్వామ్యం అనే మూడు ప్రధానమైన, ప్రజాస్వామ్యకమైన అంశాల అజెండా సాధనే మాదిగ ఉద్యమ-సాహిత్యాల ఉమ్మడి ఆశయ-లక్ష్యాలని దార్ల స్పష్టంగా ప్రకటిస్తాడు.  ఈ విస్పష్ట ప్రకటనతో మాదిగ సాహిత్యం దళిత సాహిత్యంలో అంతర్భాగమని సనిగే నోళ్ళకు గొల్లేలు వేసి, మాదిగ సాహిత్య స్వతంత్రతను, ప్రత్యేకతలను చాటతాడు.

మాదిగ సాహిత్య స్వతంత్రతను కేవలం ప్రకటించడంతోనే సరిపెట్టుకోక అట్టి స్వతంత్రతను చాటుకునే శక్తి ఆ సాహిత్యానికి ఏ విధంగా ఉందోననే విషయాన్ని ఈ వ్యాసంలో మాదిగ సాహిత్య ప్రక్రియలు-వస్తు విషయాలు అనే మూడవ అంశంలో దార్ల  సమన్వయించి  చూపాడు. దీన్ని బట్టి నిజానికి దళితసాహిత్యం అని ఇంతవరకూ పిలవబడుతున్నదంతా మాదిగ సాహిత్యమే అని స్పష్టం చేస్తున్నాడు.  ఈ ప్రతిపాదన చాలా ముఖ్యమైంది. లోతుగా దీన్ని చూస్తే మాదిగ సాహిత్యంలో అంతర్భాగంగానే దళిత సాహిత్యం ఉండవలసి వస్తుంది. ఇది యావత్తు తెలుగు సాహిత్య విభజననే మార్చే ప్రతిపాదన. దీన్నిదార్ల చాలా జాగ్రత్తగా ప్రతిపాదించి సమన్వయించాడు. దళిత సాహిత్యం పేరుతో ఎవరు రాసినా మాదిగల జీవితం, మాదిగల వృత్తులు, మాదిగ పనిముట్లే కనిపిస్తాయనేది దార్ల ప్రతిపాదన. ఇది నిజం. ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చిన వాటిని ఇక్కడ మాదిగ సాహిత్యంలోని నాలుగు ప్రధానమైన ప్రక్రియల ఆధారంతో ఆ సాహిత్య శక్తి ప్రదర్శన చేయడం జరిగింది. అవి: కవిత, కథానిక, నవల, వ్యాసం. వీనిలో మొదటి ప్రక్రియ అయిన కవితను తీసుకుంటే, కవితలలో వ్యక్తమైన వస్తువు ఆధారంగా మాదిగ కవితను మూడు రకాలుగా విభజింపవచ్చును.  వర్గీకరణ డిమాండ్ చేసే కవితలు మొదటివి. ‘మాదిగోడు’, ‘మాదిగ మేనిఫెస్టొ’, ‘వర్గీకరణీయం’, ‘దండోరా’ లాంటి కవితలు ఈ కోవకు చెందుతాయి. మాదిగల వర్గీకరణ డిమాడ్ ని వ్యతిరేకిస్తూ, మాదిగ మల్లె మొగ్గలను దళిత వనంలో పూసిన గంజాయి మొక్కలుగా తులనాడుతూ ‘ఏకీకరణీయం’, ‘నీలి పతాక’ లాంటి మాలలు  రాసిన కవితా రాతలకు సమాధానంగా మాదిగలు  రాసిన కవితలు రెండవ కోవకు చెందుతాయి. ‘నల్లద్రాక్ష పందిరి’, ‘మాకొద్దు ఈ మాల దొరతనం’ లాంటి కవితలు ఈ రెండవ కోవలో ప్రధానమైనవి. మాదిగ సంస్కృతిని, ఆ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే కవితలు మూడవ కోవకు చెందుతాయి. ఈ కోవలో ‘చండాల చాటింపు’, ‘చెప్పులకు నమస్కరిస్తున్నాను’, ‘గూటెం దెబ్బ’, ‘ఎర్కోషి’ లాంటి కవితలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

మాదిగ సాహిత్య కవిత మాదిరే మాదిగ సాహిత్య కథానికలను కూడా రెండు రకాలుగా విభజింపవచ్చును. గత, వర్తమాన మాదిగ జీవితాన్ని, ఆ జీవన సంఘర్షణను ప్రతిఫలించే కథానాలు ఒక కోవకి చెందగా; మాదిగ కుల పౌరాణిక వారసత్వాన్ని, ఆ వారసత్వంలో గల కుట్రను కూడా విప్పి చెప్పే కథానికలు రెండవ కోవకి చెందుతాయి. ‘మాదిగోడు’, ‘మల్లె మొగ్గల గొడుగు (మాదిగ కథలు)’, ‘కులవృత్తి’, ‘నల్లరేగడి సాల్లు’- లాంటి కథలు మొదటి రకానికి ఉదాహారణలు కాగా, ‘జాంబవంతుడు – పిచ్చిమామ’, ‘ఆరంజోతి’ లాంటివి రెండవ కోవకు ఉదాహరణలు.  మాదిగ సాహిత్యం సృష్టించిన నవలలో ‘జాతర’, ‘గద్దలాడతాండాయి’, ‘కక్క’ నవలలు ముఖ్యంగా పేర్కొనదగినవి.[5] కరువు కాటకాలు, రెడ్ల సామాజిక, ఆర్థిక, రాజకీయాధిపత్యాల రాయలసీమలో మాదిగ జీవనాన్ని వారి సంఘర్షణలను చిత్రించిన నవల గద్దలాడతాండాయి అయితే; తెలంగాణ మాదిగల జీవన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, దళితుల్లోని అనైక్యత, దళిత ఆత్మ గౌరవ పోరాటంలో భాగంగా పురివిప్పిన మాదిగ చైతన్యాన్ని చిత్రించిన నవల కక్క.[6] మాదిగ అస్తిత్వాన్ని స్థిరీకరించే ప్రయత్నం ఈ నవలల్లో చాలా వరకూ జరిగిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ విధంగా మాదిగ సాహిత్యం దళిత సాహిత్యంలో అంతర్భాగంగా ఆరంభమైనప్పటికీ, ఆ సాహిత్యం తడిమిన పలు ప్రక్రియల, వస్తు వైవిధ్యాల దృష్ట్యా చూచినప్పుడు దానికంటూ ఒక స్వంత అస్తిత్వం,  ప్రత్యేకతలు  ఉన్నాయని ఈ వ్యాసంలో దార్ల మాదిగ సాహిత్య స్వతంత్ర బావుటాను దశదిశాంతాలలో ఎగురవేస్తాడు.

మాదిగ సాహిత్యంలోని మరొక ప్రక్రియ వ్యాసం. మాదిగల భావాలను స్పష్టంగా, సరళంగా చెప్పడానికి అత్యవసరంగా కావలసిన ప్రక్రియగా వ్యాసాన్ని మాదిగ సాహితీ కారులు గుర్తించారు. దానిలో భాగంగానే వ్యాసాన్ని బలమైన ఆయుధంగా వాడుకున్నారు. దళిత రిజర్వేషన్లలో మాదిగలకు జరిగిన సామాజిక అన్యాయాన్ని వివరిస్తూ, రిజర్వేషన్ల వర్గీకరణ దళిత కూటమిలోని కులాలన్నిటికి ఏ విధంగా సామాజిక న్యాయానికి తొలి అడుగు కాగలదోనన్న విషయం ప్రధానంగా మాదిగ సాహితీకారులు, మేథావులు పత్రికలలో, వివిధ మేగజైన్ లలో, ఇంకా బుక్ లెట్ల రూపంలో ఎన్నో వ్యాసాలను ప్రచురించారు. అలా ప్రచురించిన వారిలో చింతాడ గౌరీ వరప్రసాద్ (“మాదిగలు మేల్కొన్నారు”, “మాదిగలకేం కావాలి”, “మాదిగల ఆత్మ గౌరవ పోరాటం”), కృపాకర్ మాదిగ  (“మాదిగ దండోర : ఏడు వ్యాసాలు”), పోలుపొంగు ముత్తయ్య (“ఎస్సీలలో వర్గీకరణ ఎందుకు?”)  కొలకలూరి ఇనాక్ (‘ఎస్. సి.ల వర్గీకరణ రాజ్యాంగబద్ధమే’) మున్నగువారు ముఖ్యులు.  మాదిగ దండోర – మాల మహానాడు వర్గీకరణ వాద-వివాదాలను ఒక చోటచేర్చి వర్గీకరణ అంబేద్కర్ దృక్పథానికి వ్యతిరేకమంటూ మాలలు, మాల మాహానాడు సభ్యులు వాదించిన వాదనలన్నీ వాస్తవానికి అంబేద్కర్ దృక్పథానికి వ్యతిరేకమని, నిజమైన అంబేద్కర్ దృక్పథం వర్గీకరణను కోరుకుంటుందని “బ్రాహ్మణత్వ మాలత్వమా…? మానవత్వ అంబేద్కరత్వమా…? (వర్గీకరణ సమస్యపై చర్చ)” పేర ఒక సంక్షిప్త పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని విశ్లేషిస్తూ దార్ల రాసిన వ్యాసమే ‘వర్గీకరణ వాదానికి శాస్త్రీయ దృక్పధం’.

దార్ల వ్యాసంలోని విషయాలను ప్రస్తావించే ముందు ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. సి.ఆర్. శేఖర్ రాసిన “దళిత శక్తిని అంతమొందించే రాజకీయ కుట్రే వర్గీకరణ: పావులుగా మారిన మాదిగ దండోరా నాయకులు” అనే ఒక సంక్షిప్త పుస్తకాన్ని లండన్ లో ఉన్న నాకు నా మిత్రుడు శ్రీథర్ మోదుగు హైదరాబాద్ నుండి పోస్టు చేశాడు. దళిత కూటమికి ఉమ్మడిగా ఇచ్చిన కోటా కుండలోని నీళ్ళను మాలలు ఆది-ఆంధ్రులే తాగడం సరికాదని, ఆ కుండలోని నీళ్ళను కూటమిలో భాగమైన వారందరికీ భాగం పంచాలని మాదిగలు, రెల్లిలు అడిగారన్న ఉక్రోషంతో రాసిన బూతుల దండకమే కాని విషయం శూన్యమని ఆ పుస్తకాన్ని చదివిన వారెవరైనా అంగీకరించే సత్యం. అంతవరకు మాలల ఆగడాలను మౌన మునులై భరించిన మాదిగలు ఈ పుస్తకం వచ్చిన తరువాత రాత పూర్వకంగా కాకపోయినా మాట పూర్వకంగా మాలలకు వ్యతిరేకంగా పరుష పదజాలాన్ని వాడారని తెలిసి నేను చాలా బాధ పడ్డాను.  వీరు వారు పరస్పరం  వాదులాడుకుంటూ గడిపితే ఇక వీరిరువురి కథ ఒక కోతి, రెండు పిల్లులు ఒక అట్టుముక్క కథ అవుతుందని నా పి.ఎచ్.డి. పనిని తాత్కాలికంగా ప్రక్కన పెట్టి నా పుస్తకాన్ని రాసాను. హైదరాబాద్ లో ఉన్న నా మిత్రులు కోటేశ్వరరావు మన్నం, మోదుగు ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురావడానికి చివరి వరకు తోడుగా ఉన్నారు.  పుస్తక ఆవిష్కరణ కోసం ఆంధ్ర వచ్చి అది అయిన వెంటనే నేను తిరిగి లండన్ వెళ్ళిపొయాను. ఈ పుస్తకం మార్కెట్టులోకి వచ్చిన తరువాత మన్నానికి, ముందుమాట రాసిన దార్లకు ఎంతోమంది ఫోన్లు చేసి పేర్లు చెప్పకుండా బూతులు తిట్టడంతోపాటు చంపేస్తామని కూడా ఎన్నోసార్లు బెదిరించారు. అక్కడికీ దార్ల కొంత సమన్వయంతో తమ వాదనలను పుస్తకంగానో, వ్యాసంగానో రాసుకోవచ్చని చెప్పినా వినకుండా దాదాపుగా ఆరు నెలలపాటు అతనిని మానసికంగా హింసించడం చేసారు. ఈ మొత్తం ప్రహసనంలో వర్గీకరణ వ్యతిరేకుల బారిన పడనిది లండన్ లో ఉన్న నేను, కోమటి కులానికి చెందిన మా మోదుగు.

ఇక దార్ల వ్యాస విషయానికి వస్తే, మాల మాహానాడు వర్గీకరణ వ్యతిరేక వాదనలలో ప్రధానమైన తొమ్మిది వాదనలు తీసుకుని అంబేద్కర్ దృక్పథ వెలుగులో వాటిని నేను త్రిప్పి కొట్టడం చేశాను. ఆ త్రిప్పి కొట్టడంతో పాటు మాదిగల, వీరితో పాటు యితర దళిత కులాల సమగ్రాభివృద్ధికి, కుల నిర్మూలనకు కొన్ని ప్రతిపాదనలు కూడా నేనా పుస్తకంలో చేశాను. పుస్తక అసాంతం విస్తరించుకున్న ఆ ప్రతిపాదనలను ఏరి అయిదింటిని మరింత లోతుగా గుర్తించవలసిన అంశాలుగా దార్ల వివరించాడు. అవి:

(1)    దండోర ఉద్యమ స్ఫూర్తితో మాదిగలు తమ పేర్ల చివరన పై నాలుగు వర్ణాల మాదిరే తమ కులం పేరు పెట్టుకొనడాన్ని హిందూత్వం తమపై రుద్దిన మాదిగ కులాన్ని అంగీకరించడమని, అది కుల నిర్మూలనకు ఆమరణాంతం పోరాటం చేసిన అంబేద్కర్ ను అవమానించడమేనని మాల మహానాడు వారు అక్షేపిస్తారు. వర్గీకరణ వ్యతిరేకోద్యమానికి “మాల” మహానాడు అని తమ కులం పేరును స్వయంగా వారే పెట్టుకుని మాదిగలు అంబేద్కర్ ని అవమానిస్తున్నారు అని మాలలు అనడం వెగటు కలిగించే ఆక్షేపణ.  సరే, వీరి అక్షేపణ ఎలా ఉన్నా, కుల నిర్మూలన జరగాలంటే ముందు కుల బాధితులు కులం నుండి బయట పడాలి. అలా బయటపడాలంటే ముందు కూరుకున్న కుల ఊబి అనే సమస్యలోనుండి బయటపడడం జరగాలి. పేరు చివరన మాదిగను చేర్చుకోవడం అనేది కులతత్వంపై తిరుగుబాటుకు సూచన, కుల ఊబినుండి బయట పడేందుకు వేసిన తొలి అడుగు.

(2)    వర్గీకరణతో దళితుల సమస్యలన్నీ తీరిపోవు. అయితే వారి సమస్యల పరిష్కారంలో అది మొదటి మెట్టు.  రాజ్యాంగం దళితులకు కల్పించిన అవకాశాలను దళితులలోని దళితులు అందుకోవాలంటే అవసరమైతే క్రీమిలేయర్ విధానాన్ని కూడా పాటించాలి.

(3)    విద్యారంగంలో సంస్కరణలు తెచ్చి ఆధునిక విద్యను అందరికి అందించాలి. అది జరగనంతవరకు అగ్రకులాల మధ్య అణచివేతకు గురికాబడిన కులాల మధ్య ప్రతిభాపాటవాల అంతరాల దొంతరాలు కొనసాగుతూనే ఉంటాయి గాని వాటికి అంతం ఉండదు. పైగా దళితులకు సామాజికంగా వెనుకబడిన యితర  వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో ఎన్ని రాయితీలు కల్పించినా వాని లక్ష్యం నెరవేరదు.

(4)    ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు అడుగంటి కేవలం ప్రైవేటు రంగంలోనే ఆ అవకాశాలు ఉన్న దరిమిలా ప్రైవేటు రంగలో రిజర్వేషన్ల డిమాండ్ సాధనకై దళితులంతా ఉమ్మడిపోరాటం చేపట్టాలంటే వర్గీకరణ సమస్యను పరిష్కరించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఒకవేళ వర్గీకరణ సమస్య పరిష్కారం జరగకుండానే దళితులకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించబడితే అది మాదిగ ఇత్యాది దళితులలోని దళితులకు సామాజిక అన్యాయ కొనసాగింపే అవుతుంది.

(5)    రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి కులానికి భాగస్వామ్యం కల్పించినప్పుడే యిప్పుడున్న కుల రాజ్యం స్థానంలో ప్రజా రాజ్యం అవతరించేది.

ఈ విధంగా మాదిగ సాహిత్యం సృజించిన ప్రతి సాహితి ప్రక్రియను తక్కెడలో తూచినట్లుగా ఒక నిబద్దతో విశ్లేషించి, తెలుగు సాహితి ఫలకంపై మాదిగ సాహిత్యానిది ఒక కొత్త దరువుగా మాదిగ సాహిత్య స్వతంత్ర ప్రత్యేకతల జెండాను దార్ల ఎగుర వేస్తాడు.

III. అరుంధతి వసిష్టుల కల్యాణం: ఐక్యతా సందేశం

1959లో బోయి భీమన్న రాసిన “రాగ వాసిష్ఠం” నాటకం యొక్క విశిష్టతను అంచనా వేసే ప్రయత్నాన్ని దార్ల ‘రాగవాసిష్ఠం-నాటక వైశిష్ట్యం’ అన్న వ్యాసంలో చేశాడు.  దండోరా ఉద్యమ నేపథ్యం నుండి  పుట్టుకొచ్చిన మాదిగ సాహిత్యంతో ఈ నాటకానికి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం వలన ఈ వ్యాసాన్ని ఈ పుస్తంలోని మిగిలిన వ్యాసాలతో జత చేయడం ఔచిత్యంగా ఉందనిపించదు. అయితే తమ ప్రాచీనులు తమకు అందించిన పౌరాణిక, జానపద, మౌఖిక సాహిత్య వారసత్వ సంపదను తిరిగి దొరక పుచ్చుకునే కార్యక్రమాన్ని మాదిగ సాహిత్య పరిణామ క్రమంలోని రెండవ దశలో మాదిగ సాహితీకారులు చేపట్టినట్లుగా మనం పైన చెప్పుకోవడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే మాతంగ కన్య అయిన అరుంధతీదేవి, బ్రాహ్మణ పురుషుడు వసిష్ఠుడిల మధ్య కులాతీతంగా నడచిన ప్రణయం, అది పరిపక్వమై వారిరివురి మధ్య జరిగిన కల్యాణగాథను మాదిగలు బయటకు తీయడం జరిగింది. మాదిగలకున్న పౌరాణిక చారిత్రక వారసత్వం కోసం జరుగుతున్న అన్వేషణలో నుండి దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ దృష్టితో చూచినప్పుడు అరుంధతి-వసిష్ఠుడిల కల్యాణం ప్రధాన వస్తువుగాగల నాటక విశ్లేషణ వ్యాసాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం అసందర్భమనిపించదు.

ఇక రాగ వాసిష్టం నాటకంపై దార్ల వ్యాసం గురించి చెప్పుకోవాలంటే, అతని వ్యాసాన్ని రెండు భాగాలుగా చేసి అందలి విశ్లేషణను అవగతం చేసుకొనవచ్చును.  మొదటి భాగం నాటకం గురించయితే, రెండవ భాగం నాటకం ప్రతిపాదించిన జాతి సిద్ధాంతం గురించి. బోయి భీమన్న ఆ నాటకాన్ని రాయడానికి  పురిగొల్పిన చారిత్రక సంఘటన, నాటక కథా సారాంశం, నాటక రచనా విధానం, నాటకతత్వం మున్నగు విషయాలపైన మొదటి భాగంలో సాహితీపర చర్చ జరిగితే; శుద్రులు, అంటరానివారి పుట్టు పూర్వోత్తరాలపై అంబేద్కర్ చేసిన చర్చ వెలుగులో శూద్రులు, చండాలురు, మాల-మాదిగల వంటి పేర్లతో పిలిచే వారంతా భరత ఖండ మూలవాసులే కాకుండా, అసలైన ఆర్య జాతులవుతారని బోయి భీమన్న చేసిన జాతి సిద్ధాంత ప్రతిపాదనపై సవిస్తరమైన చర్చ రెండవ భాగంలో జరిగింది. అరుంధతీదేవి చండాల కన్య కాదు, ఆమె ఆర్య జాతికి చెందిన కన్య అని బోయి భీమన్న చేసిన ప్రతిపాదనను వివరణలతో సమర్ధించేందుకు దార్ల పరిశోధించిన గ్రంధ  (భగవద్గీత, మనుస్మృతి, సర్వేపల్లి రాధాకృష్ణన్, బి. ఆర్. అంబేద్కర్ రచనలు) వివరాలను బట్టి ఈ వ్యాస రచనకై అతను చేసిన మేధోగత శ్రమను మనం తప్పక గుర్తించవలసివుంది.

అరుంధతీదేవి కథ భూమికగా చేసుకుని ఆర్య-అనార్య భేదాలను చర్చించి శూద్రులు, పంచములు ఈ దేశ మూలవాసులే కాకుండా కుల వ్యవస్థ పై అంతస్తులలోవున్న మిగిలిన మూడు వర్ణాల మాదిరే ఆర్య జాతీయులని బోయి భీమన్న తన రాగ-వాసిష్టం నాటకంలో చెప్పడంలో భారతీయులంతా ఒకే జాతి సంతతి అనే సందేశమిచ్చి, భారత జాతి సమైక్యతను కాంక్షించారని తెలుస్తుంది. అయితే నాటకం ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనాన్ని అటుంచి అసలు మూల కథలో నిబిడీకృతమైన మాదిగల తాత్వికతను కొంత సమగ్రంగా చర్చించడం అవసరం. ఈ తాత్వికత దార్ల వ్యాసంలో అంతర్లీనంగా వ్యక్తపరచబడినప్పటికీ వ్యాస పరిధి రీత్యా ఆ విషయాలను లోతుగా చర్చించే అవకాశం అతనికి దొరకలేదనిపిస్తుంది. అరుంధతీదేవి కథలో దాగున్న మాదిగల తాత్వికత ఏమిటి? అరుంధతీయ, ఆది జాంబవ సంఘం లాంటి పేర్లతో హైదరాబాద్-సికింద్రబాద్ జంట నగరాలలో ఉన్న కొన్ని మధ్య తరగతి మాదిగ సంఘాలు తప్ప అరుంధతిదేవి కథను దాదాపుగా మర్చి పోయిన మాదిగలు దండోరా నేపథ్యంలో అకస్మాత్తుగా ఆ కథను స్వంతం చేసుకోవడంలో వారు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నలపై సుదీర్ఘమైన చర్చ, పరిశోధన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

IV. అంబేద్కర్ నుండి దార్ల వరకు: వర్గ వాదేయులకు కుల బాధితుల ప్రశ్నలు

‘దళిత సమస్యలపై ప్రజా సాహితి దృక్పథం’ వ్యాసంలో ఆగష్టు 1977 నుండి నేటి వరకు ప్రజా సాహితి మాసపత్రిక వారు దళితుల సమస్యలు, సంఘర్షణలను వర్గ దృక్పథం వెలుగులో అర్ధం చేసుకున్న తీరును, వ్యాఖ్యానించిన రీతులను సాహేతుకంగా అంచనా వేసే ఒక బృహత్తర ప్రయత్నాన్ని దార్ల చేశాడు. దళిత ఉద్యమాలకు, రాజకీయాలకు, సాహిత్యానికి జవ-జీవాలొసిగిన  సిద్ధాంత-త్రయం: జ్యోతిబా పూలే, బాబా సాహేబ్ అంబేద్కర్, గుర్రం జాషువా – సిద్ధాంతాలపై; దళితుల సమగ్రాభివృద్ధికి  స్వతంత్ర భారతం చేపట్టిన వివిధ విధానాలు, పథకాలు – ముఖ్యంగా రిజర్వేషన్ వసతుల పైన; ఖైర్లాంజీ లో దళిత స్త్రీలను వివస్త్రలను చేసి తన సిగ్గు తీసుకున్న యావత్తు భారతావని – ఆ దారుణ సంఘటన ముందుకు తెచ్చిన సామాజిక – ఆర్ధిక ప్రశ్నలపై; ఇంకా దళిత సాహిత్యంపైన ఆ పత్రిక భాష్యాలను, ముందుకు తెచ్చిన వాద-వివాదాలను, దృక్పథాలను సమగ్రంగా, విమర్శనాత్మకంగా పరిశీలించాడు. గమనించాల్సిందేమిటంటే ప్రజాసాహితి వర్గ దృక్పథాన్ని విమర్శించడం ఒక పనిగా పెట్టుకుని ఆపని చేయ్యలేదు. వర్గ దృక్పథాన్ని భారతీయ కుల సమాజానికి వర్తింప జేయడంలోగల పరిమితులను ఎత్తి చూపి ఆ పరిమితులను అంబేద్కర్ సిద్ధాంతాలతో ఏ విధంగా అధిగమించవచ్చోనని నిర్మాణాత్మకంగా సూచించడం అతనిలోని విషయ స్పష్టత, మేథో పరిణత, సదుద్ధేశం తెలుస్తుంది. ఈ వ్యాసంలో దార్ల అడిగిన ప్రశ్నలు తన కాలంలోని సోషలిస్టులకు అంబేద్కర్ వేసిన ప్రశ్నలు, కారంచేడు- చుండూరు దురాగత సంఘటనల తరువాత వామపక్షాలకు, నక్సలైట్లకు కత్తి పద్మారావు, బొజ్జా తారకం, ఉ. సాంబశివరావు, మారోజు వీరన్నలు వేసిన ప్రశ్నలు. 1980వ దశకం నుండి అటు అంబేద్కర్ వర్గీయులలో ఇటు మార్క్స్ వర్గీయులలో నలుగుతున్న- ‘అంబేద్కర్ కుల దృక్పథాన్ని కారల్ మార్క్స్ వర్గ దృక్పథాన్ని జత చేసి నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాధించాలి’ అనే వాదాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాలనే ఆకాంక్షను, అవసరతను ఈ వ్యాసం ద్వారా దార్ల స్పష్టం చేశాడు.  ఈ పరిశీలనను నాలుగు ముఖ్యాంశాలుగా  విశ్లేషించవచ్చు.

ఒకటి, జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, జాషువాలపై ప్రత్యేక సంచికలను ప్రజా సాహితి ప్రచురించడాన్ని ఆ పత్రిక ఆ దళిత సిద్ధాంతకర్తలను గుర్తించడంగా పేర్కోని అట్టి గుర్తింపును దార్ల ఆహ్వానిస్తాడు.  అయితే సిద్ధాంతకర్తలను గుర్తించినంత మాత్రాన వారి సిద్ధాంతాలను కూడా గుర్తించినట్లేనా? – అనే ఒక బలమైన ప్రశ్నను అతను ఈ వ్యాసంలో అడుగుతాడు.  వామ పక్ష ఉద్యమం ఉనికిలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వర్గ దృక్పథానికి కట్టుబడిన దళితేతరులు అంబేద్కర్ విషయంలో వాదించే వాదాలలో ‘అంబేద్కర్ సంస్కరణవాది. కాబట్టి అతని దృక్కోణంగాని, అతని సిద్ధాంతాలుగాని వర్గ పోరాటాలకు, సోషలిస్టు సమాజ స్థాపనకు ఏ మాత్రం పనికిరావు’ – అనే ఒక గుడ్డి వాదం ప్రధానమైనది. అంబేద్కర్ సంస్కరణవాదే కావచ్చు. అయితే అతని సంస్కరణవాదాన్ని ముందుకు తెచ్చి, భారత దేశంలో నూతన సామాజిక విప్లవానికి మూల స్తంభాలవంటి  అతని సిద్ధాంతాలను వెనుకకు తొయ్యడం ప్రజా సాహితి వాళ్ళు కావాలని పక్కదారి పట్టించిన అంశమని దార్ల స్పష్టం చేస్తాడు.

అదే విధంగా దళిత కులాలలో పుట్టిన మనుష్యులు ఏ రంగంలోనైనా అసమానమైన ప్రతిభ కనపరచినప్పటికీ, వారు తమ పురిటి (కుల) కంపునుండి విముక్తం కాలేరని దళిత కులాలలో పుట్టిన మనుష్యులను ఎసెన్షియలైజ్ (essentialize) చేసే ఒక మోసపూరితమైన వాదాన్ని బ్రాహ్మణత్వం మొదటినుండి ముందుకు నెడుతుంది.  దళితులను అలా ఎసెన్షియలైజ్ చేయడంలోనే బ్రాహ్మణత్వ మనుగడ ఆధారపడి ఉంది. కాబట్టి బ్రాహ్మణత్వంపై ఆధారపడి బ్రతుకుతున్నవారు అటువంటి అభిప్రాయాలను పదే పదే ముందుకు తేవడాన్ని మనం అర్ధం చేసుకోగలం.  కాని ‘సంపూర్ణ మానవుని ఆవిష్కరణే తన చిర కాల వాంఛ, జీవిత ధ్యేయమని’ సగర్వంగా చెప్పుకున్న నిత్య సత్యాన్వేషి మార్క్స్, అటువంటి వ్యక్తి శిష్యులమని చెప్పుకునే వర్గ వాదీయులు కూడా దళితులను,  దళిత మేథావులను అదే బ్రాహ్మణికల్ ఎసెన్షియలైజ్డ్  దృష్టితో చూడటాన్ని దార్ల తీవ్రంగా ఆక్షేపిస్తాడు.  ఉదాహరణకు రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ శాస్త్రంలో దిగ్గజాలు వంటి ఎందరో మేథావులు ఉన్నప్పటికీ అంబేద్కర్నే రాజ్యాంగ రచనా కమిటి అధ్యక్షునిగా ఎన్నుకోవడానికి గల రెండు ముఖ్య కారణాలు: ఆ పరిషత్తులోని మేథావులను మించిన రాజ్యంగ నిపుణత, జాతీయ సమగ్రత. అయినప్పటికీ “ఆయన (అంబేద్కర్) చేసిన పోరాటాలు, పడిన రాజీలు –  కుల నిర్మూలనకు ఏదో రూపంలో తోడ్పడతాయన్న అవగాహనతోను, ఆవేదనతోను అమలు జరిపారు” అని ప్రజా సాహితి (1995: 162వ సంచిక) తన సంపాదకీయంలో పేర్కొని అంబేద్కర్ కృషిని, త్యాగాలను కేవలం కులనిర్మూలనకు మాత్రమే కుదించడాన్ని దార్ల అంగీకరించకూడని విషయం అంటాడు.

అంబేద్కర్ కృషిని కేవలం ఇలా కులనిర్మూలనకే కుదించడం వలన రెండు ప్రమాదాలు ఉన్నాయి: మొదటిది,  దళితులు కులాతీతంగా ప్రజా శ్రేయస్సును, ప్రజాభివృద్ధిని, జాతి సమగ్రతను దృష్టిలో ఉంచుకుని చేసే జాతి సేవా కార్యకలాపాలు దళితేతర సమాజం గుర్తించేందుకు అవకాశం లేకుండా చేయడం.  రెండు, దళితుల సేవా కార్యకాలాపాల వలన కులాతీతంగా, మతాతీంగా జాతి మొత్తం ప్రయోజనాలు పొందినప్పటికీ, అవి కేవలం దళిత దృష్టిపథం నుండి, వారి విముక్తి నిమిత్తం మాత్రమే చేశారు, చేస్తున్నారు అని దళితేతరులు భావించడానికి అవకాశం. అంబేద్కర్ మొదలుకొని నేడున్న ఎందరో దళిత మేథావులను, నాయకులను దళితేతర సమాజం గుర్తించక పోవడం అటుంచి, ఏహ్యభావం కలిగి ఉండడానికి  ఈ రకమైన ఆలోచనలు, వాదాలు పరివ్యాప్తిలో ఉండడమే.

మహాకవి గుర్రం జాషువా విషయంలో కూడా ప్రజా సాహితిది ఎసెన్షియలైజ్డ్ దృక్కోణమేనని దార్ల నిర్మోహమాటంగా చెబుతాడు. చోద్యంగా జాషువా కవిత్వానికంటే అతని కవిత్వాన్ని ఆదరించే దళితులపైన తన ఎసెన్షియలైజ్ బాణాలను ఈ పత్రిక సంధించింది. జాషువా శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికలోని (అక్టోబర్, 1995, 168వ సంచిక) సంపాదకీయాన్ని చదివినవారెవరికైనా  “ఎలక్ట్రానిక్   మీడియా, నాటకాలను ఆదరించే సామాన్య ప్రజలను వీరి (జాషువా) పద్యాలు బాగా అకర్షించాయనీ, కులదృక్పధం వల్లనే దళితులు జాషువాని వెనుకేసుకొస్తున్నారనే” ఆలోచన కలుగుతుందని ప్రజాసాహితి వ్యాఖ్యానించడాన్ని  దార్ల కుండ బ్రద్దలు కొట్టినట్లు ఆ వ్యాఖ్య సరైనది కాదని చెబుతాడు. నిర్మోహమాటంగా చెప్పాలంటే భారతీయ సమాజంలో, హిందూ భావజాల ప్రభావంలో పుట్టి పెరిగిన ఏ వ్యక్తైనా కులాతీతులు కారు.  కవులు, కళాకారులు, రచయితలు తమ తమ కులానికి చెందిన వారు కాబట్టే ఆ కవుల కవిత్వానికి, ఆ రచయితల రచనలకు ఉప్పొంగిపోయి అభిమానులుగా మారడం కుల సమాజంలో కనిపించే కుసంస్కృతి. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ ) బ్రాహ్మణులు కాకుంటే, బ్రాహ్మణ సమాజం తమ తమ సిద్ధాంతాలకు, దృక్పథాలకు అతీతంగా వారికి బ్రహ్మరధం పట్టేదా? కమ్మ కులానికి చెందినవారు కాకపోతే సంఘటనతో తమకు సంబంధం లేకున్నా కారంచేడు చుట్టుప్రక్కల గ్రామాలలోని కమ్మలంతా ఏకమై కారంచేడు గ్రామంలోని మాదిగలపై మారణహోమం సృష్టించేవారా? చిరంజీవి కాపు కాకుంటే తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రేసే తమ బంధువని బీరాలు పలికిన హరిరామ జోగయ్య, తదితరులు తమ బొందిలో ప్రాణముండగానే కాంగ్రేసు పార్టీకి, లేదా ఇతర పార్టీలకు  తిలోదకాలిచ్చి ప్రజా రాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకునేవారా?

దళిత కులాలలో అరుదుగా లభించే ఆణిముత్యం జాషువా లాంటి కవుల కవిత్వాన్ని దళితులుకూడా తమ సామాజిక వర్గానికి చెందిన వాడు కాబట్టి ఆస్వాదిస్తున్నారు.  అంతవరకు దళిత సమాజానిది కూడా కుల దృక్పథమే.  అయితే జాషువా కవిత్వానికి వస్తువు, వస్తు విషయాలు ఎవరివి? – దళితులు, వారి ఈతి బాధలు.  మరి తమను, తమ సమస్యలను కవిత్వీకరించిన జాషువాను చదవటం కూడా కుల దృక్పథమేనా? శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అడవి బాపిరాజు, ప్రేంచంద్, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఎందరో రచయితలు తమ సమాజానికి చెందినవారు కాకపోయినప్పటికీ తమగురించి రాసిన వీరి రచనలను దళితులు అధ్యయనం చేశారు, ఆ రచయితలను ఆరాధించారు.  మరి ఇది ఏ కుల దృక్పథం క్రిందికి వస్తుందో ప్రజా సాహితి వారు సమాధానం చెప్పాలి.  అసలు ఒక కవిని అతని అభిమానులు ఏ దృక్పథంతో ఆభిమానిస్తున్నారు? ఏ దృక్కోణంతో ఆదరిస్తున్నారు?  ఇది ఆ కవుల చేతుల్లో కంటే వారి అభిమానుల రుచులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాసాహితి వారు అసలు అడగ వలసిన ప్రశ్నలు: జాషువా కవిత్వం కుల కంపుతో నిండి ఉందా? లేక అందులో కుల కంపుతో మూసుకుపోయిన హిందూ హృదయ కవాటాలను తెరచే ప్రయత్నం జరిగిందా? ఈ ప్రశ్నలకు వారు దైర్యంగా, నిస్పక్షపాతంగా సమాధానం చెప్పగలిగితే ఏ రచయితది కులతత్వాభివృద్ధి దృక్పధమో, ఏ రచయితది కులనిర్మూలన దృక్పధమోననే సత్యం అప్పడు వెలుగులోకి వస్తుంది.  విశ్వ నరుడు జాషువా గురించి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి చెప్పిన మాటలను ఈ క్రింద పేర్కొనడం అసందర్భం కాదు:

భావ కవులు ఊహలలో విహరిస్తున్న కాలంలో, సంప్రదాయం కవులు పురాణాలు తిరగరాస్తున్న కాలంలో, జాషువ జీవితంలోని కఠిన వాస్తవాలను కవితా బద్ధం చేసే ప్రయత్నం చేశారు.  అందరూ మేనకోడలిమీద, పక్కింటి అమ్మాయిల మీద కవిత్వం రాస్తుంటే జాషువ ‘అనాథ’ మీద రాశాడు.  అందరూ కృత్రిమ స్వప్నాలు కంటుంటే జాషువా ‘స్వప్న కథ’ లో మంచి మానవీయ విలువగల కలగన్నారు… ‘విశ్వనరుడ నేను’ అని చెప్పుకున్న జాషువ సమాజం వర్ణాలుగా, కులాలుగా  విడిపోవడం చూడలేకపోయాడు.  మన సంఘాల మధ్య సహజంగా ఉండవలసిన సోదరభావం కులం కారణంగా నశించిందని భావించారు. కులాలు కొందరిని అణచిపెట్టడానికి మాత్రమే కాదు అణచివేయబడ్డవాళ్ళలో సైతం అణచివేసే వాళ్ళను సృష్టించడం చూశాడు.  ఆ స్థితిని నిరసిస్తూ ప్రజలలో విశ్వ జనీన భావాలను రేకెత్తించడానికి చూశాడు.[7]

రెండు, కారంచేడు, చుండూరు సంఘటనలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన దళిత ఉద్యమం, ఆ ఉద్యమ స్ఫూర్తితో దళిత సమాజం నుండి ఒక సాహితీకారుల పటాలం ఏర్పడటం ఒక వరుస క్రమంలో జరిగింది.  పదునైన తమ కలాలతో  చిక్కనైన దళిత సాహిత్యాన్ని వెల్లువలై పారించి, దళిత చైతన్య సస్యశ్యామలతకు బాటలు పరిచారీ సాహితీకారులు.  వీరికి బాసటగా దళితులు కాకున్నప్పటికీ దళితులపై జరుగుతున్న అమానుషాలకు, హత్యాకాండలకు ఖేదిల్లి, తమ కలాలను కత్తులుగా చేసుకుని కుల సమాజ రక్కసిపై విరుచుకుపడిన దళితేతర కులాలనుండి వచ్చిన మానవతామూర్తులు ఎంతోమంది ఉన్నారు.  ఆరంభంలో ఈ దళితేతరుల దళిత విషయ రచనలను దళిత సాహితీకారులు కొంత కామ్రెడరీ దృక్పథంతో, కొంత మొహమాటానికిలోబడి స్వాగతించినప్పటికీ  రాను రాను “దళిత సమస్యలను దళితులే రాయాలనే” ఒక వింత–వితండ వాదనను  ముందుకు తెచ్చారు. దళితులు తమ కుల సరిహద్దులు దాటి సాధారణ మనుష్యులుగా ఎదగలేరనే వాదనతో దళిత సమాజాన్ని ఎసెన్షియలైజ్ చేయ్యడం పైనుండి జరుగుతుంటే, దళిత జీవితానుభావం లేనివారు దళిత సమస్యలను చిత్రించలేరు అని వాదించడం క్రిందినుండి జరుగుతున్న ఎసెన్షియలైజేషన్. దళిత జీవన సంఘర్షణను చిత్రించడానికి అనుభవ జ్ఞానం ఉండటం మంచిదే.  అయితే ఆ జ్ఞానం ఒక్కటే సరిపోదు. శాస్త్రీయంగా విషయాన్ని శోధించి, వివరంగా చెప్పగల జ్ఞానం అవసరం. ఈ రెండవ రకం జ్ఞానాన్ని వ్యక్తులు తాము  పుట్టి పెరిగిన సమాజం నుండి కాకుండా (అంటే అనుభవం నుండిగాక) నిరంతర అధ్యయనం ద్వారా, అవగాహన ద్వారా పెంపొందించుకుంటారు. ఈ విషయాన్నే ప్రజా సాహితి తన పదవ మహాసభ పత్రంలో వ్యాఖ్యానించడాన్ని దార్ల స్వాగతిస్తాడు. దళిత సమాజంలో పుట్టి పెరిగినప్పటికీ ఆ సమాజంలో పరివ్యాపితంలో ఉన్న కుత్సిత వాదనలను నిరసించి సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి, స్వీకరించాలి అని ఘంటాపథంగా చెప్పగలిగే దళిత మేధావులు బహు అరుదు. ఆ అరుదైన మేధావులలో దార్ల ఒకడని ప్రజా సాహితి ప్రతంలోని సత్యంతో అతను ఏకీభవించడం స్పష్టపరుస్తుంది.

మూడు, ‘వ్యవస్థ పరిమితిని బహిర్గత పరచిన సుప్రీం తీర్పు’ పేరుతో వెలువరించిన తమ  సంపాదకీయంలో ప్రజాసాహితి (నవంబరు, 2006: 288వ సంచిక) వారు  దళిత రిజర్వేషన్లపై ఒక మంచి విశ్లేషణ చేశారు.  ఇందులో చట్టబద్ద రిజర్వేషన్లు, వ్యవస్థీకృత రిజర్వేషన్లు అని రిజర్వేషన్లను రెండు రకాలుగా వర్గీకరించి, “వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులను, అధికార హోదాలను, ఆ వర్గం వాళ్ళే మళ్ళీ అధికారాన్ని చెలాయించడాన్ని గుర్తించకుండా, అణచివేతకు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించినంత మాత్రాన (వారికి) ఉపశమనానికి మించిన ప్రయోజనం ఉండదని”  ఒక ఆలోచనాత్మకమైన విశ్లేషణ గావించారు. ఈ ఉపశమనాల ఫలితంగా:

(1)     వీనినే ఆసరా చేసుకుని ఎదగాలని దళితులలో ఒక వర్గం అరాటపడుతుండడం వల్ల అలాంటి వాళ్ళు వ్యవస్థలోని అవినీతితో సర్దుబాటు చేసుకోనడానికీ;

(2)     దళితులలో వివిధ స్థాయిలు (ముఖ్యంగా ఉపశమనాలను పొందినవారు, పొందలేకున్నవారు లేదా ఉపశమనాలకు దూరంగా ఉంచబడినవారు) తయారుకావడానికీ;

(3)     పాలక వర్గాలు దళితులను ఓటు బ్యాంకులుగా రూపాంతరం చెందించుకుని వారిని తమ రాజకీయాలలో పావులుగా ఉపయోగించుకొనడానికి దారి తీస్తున్నదనే ప్రజా సాహితి విశ్లేషణకు దార్ల తన పూర్తి సమ్మతాన్ని తెలియజేస్తాడు.

అయితే, దళిత రిజర్వేషన్ల మొత్తానికి అనువర్తించే ఈ విశ్లేషణను మాదిగ దండోరా వర్గీకరణ డిమాండ్ కి కూడా ప్రజా సాహితి అనువర్తింప జేయడాన్ని దార్ల ఒక స్పష్టతతో, బలమైన కారణాల ప్రాతిపదికతో ఆక్షేపిస్తాడు.

ప్రజా సాహితి తన నవంబరు, 1998, 202వ సంచికలో ప్రచురించిన కరపత్రంలో: “ఎబిసిడిల విభజనలో మెరుగైన న్యాయం వుండినా పాలక గ్రూపులూ,  రకరకాల సంస్కరణవాదులూ, రిజర్వేషన్ల విభజనే కాక దళిత ప్రజల విభజనకు కూడా దాన్ని వినియోగిస్తున్నారు” అని చెప్పడం జరిగింది.  ఈ పత్రాన్ని తయారు చేసిన వారు యస్ ఆర్ శంకరన్. ఈ అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు విషయాలు సుస్పష్టం: వర్గీకరణ డిమాండ్ లో న్యాయం ఉంది.  ఆ న్యాయం కూడా సాదా సీదాది కాదు. అది సమాజానికి మెరుగైన న్యాయం; రిజర్వేషన్లను విభజించడమనే మిషతో పాలక వర్గాలు దళిత ప్రజలను విభజిస్తున్నారు.  వర్గీకరణలో మెరుగైన న్యాయం ఉందని వంతలు పలుకుతూనే దళిత సమాజాన్ని విభజించడానికి పాలక వర్గాల చేతిలో అది సాధనమవుతుందనే వంకర పలుకులు దేనికి? తమ చేతిలో పాలనా పగ్గాలు ఉంచుకోవడమే పాలక వర్గాల పరమావధి. అందుకోసం ప్రజలను విభజిస్తారు, లేదా ప్రజలలోని విభజనలను ఉపయోగించుకుంటారు. వర్గీకరణ కూడా  ఏదో ఒక రకంగా ఆ పరమావధికి దోహదపడితే దానిని ఉపయోగించుకునడానికి కూడా ముందుంటారు; లేదు ఏకీకరణ అందుకోసం అక్కరకొస్తే దాని జపం జపిస్తారు. అసలు వర్గీకరణ పాలక వర్గాల చేతిలో ఏవిధంగా వినియోగించబడుతుంది అన్నది ఇక్కడ అధమ విషయం. వర్గీకరణ ద్వారా మాదిగ ఇత్యాది కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందా లేదా అన్నదే ప్రధాన విషయం. వర్గీకరణలో మెరుగైన న్యాయం ఉంది అని అంగీకరించడం అంటే ఆయా కులాలకు వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది అని అంగీకరించినట్లే కదా? ఒక వేళ అలా వర్గీకరణ జరగకుంటే ఆ కులాలకు అన్యాయం జరుగుతుంది అని కుడా (పరోక్షంగా) అంగీకరించినట్లే కదా?

ఇక ఈ వాదనలోనే రెండవ విషయం/అభిప్రాయం గురించి చెప్పుకోవాలంటే, అసలు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచిన వ్యక్తి/పత్రికకు గల సామాజిక అవగాహనపైన అనుమానం కలుగుతుంది. మను ధర్మ శాస్త్రం భారతీయులను ఐదు వర్ణాలుగా విభజిస్తే, ఐదు కాదు ఐదు వందల యాభై ఐదు కులాలుగా వీరు తమను తాము విభజించుకుని పరిపాలించుకుంటున్నారు.  అంటే విభజన అనే ఒక సూత్రాన్ని మూల సూత్రంగా చేసుకుని నిర్మించబడిందే భారతీయ కుల సమాజం.  ఇది భారతీయ సమాజ కనీస అవగాహన కలిగిన ఏ వ్యక్తైనా అంగీకరించే సత్యం.    ఈ ప్రాధమిక నిర్మాణ సూత్ర దృష్టి కోణం నుండి  గమనిస్తే దళిత ప్రజల విభజనకు కూడా వర్గీకరణను వినియోగిస్తున్నారు, కాబట్టి వర్గీకరణ వద్దు అని అనడం నాకైతే కొంత వెర్రితనంగా, మూర్ఖపు వాదంగా అనిపిస్తుంది. నేను అలా అనడం వ్యంగ్యమనో, అహంకారమనే చాలామంది అభిప్రాయపడవచ్చు. అట్టివారి కోసం నా అభిప్రాయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు.

దళిత సమాజాన్ని విభజించడానికి అసలు ఆ సమాజం ఎప్పుడు ఐక్యంగా ఉంది?  ‘చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయా, చిందేసే వీరబాహుడు నేనేనయా’ – అని మాదిగలు సాంస్కృతికంగా మాలవారిపై ఆధిపత్యం వహించాలని చూడలేదా? మాల కులానికి చెందిన మాదరి బాగయ్య (భాగ్యా రెడ్డి వర్మ) నాయకత్వంలో 1930వ దశకంలో హైదరాబాద్ లో నడిచిన ఆది-హిందూ ఉద్యమంలో మాదిగ వారిని దూరంగా ఉంచడమేగాక, మాల-మాదిగల మధ్య కులాంతర వివాహాలకు అడ్డుగోడలు కట్టలేదా?[8] కాంగ్రేసు పార్టీలో మాల కులానికి చెందిన దామోదరం సంజీవయ్య-మాదిగ కులానికి చెందిన సదాలక్ష్మి ల మధ్య అధికార పోరాటంలో మాల కులం సంజీవయ్య  పక్షాన, మాదిగ కులం సదాలక్షి పక్షాన నిలబడలేదా? కాన్షీ రాం చమార్ కులస్థుడనీ, ఉత్తర్ భారత దేశంలో చమార్ లు అంటే ఇక్కడ మాదిగలు అని, కాబట్టి మాదిగల పార్టీకి ఓటు వేసేదేమిటని 1994 అసెంబ్లీ ఎన్నికలలో మాలలు బహుజన్ సమాజ్ పార్టీకి దూరంగా ఉండలేదా?[9] మాల ఉద్యోగస్తుల సంఘాలుగా, మాదిగ ఉద్యోగస్తుల సంఘాలుగా మాల-మాదిగ కులాలకు చెందిన ఉద్యోగస్తులు తమను తాము విభజించుకోలేదా? ప్రతి విద్యా సంస్థలో మాదిగ విద్యార్ధి సంఘాలు, మాల విద్యార్ధి సంఘాలు  ఉండడం కనపడడంలేదా? మరి ఇన్ని రకాల విభజనలు కళ్ళకు కట్టినట్లుగా, స్పష్టంగా కనబడుతున్నప్పటికీ రిజర్వేషన్ల వర్గీకరణ దళితుల విభజనకు దారితీస్తుంది అనడం ఎంతవరకు సబబు? ఇంకో రకంగా అడగాలంటే ఇటువంటి చొప్పదంటు వాదాలు ఎవరిని మాయ పుచ్చడానికి? ఎవరిని మోసం చెయ్యడానికి?

దళిత సమాజ ఐక్యతను నిజంగా కాంక్షించే వారు అది ప్రజా సాహితి లాంటి పత్రికలైనా లేదా యస్ ఆర్ శంకరన్ లాంటి పెద్దలైనా ముందుగా దళిత సమాజం పట్ల, వర్గీకరణ విషయంపట్ల కొంత ఆత్మ శోధన చేసుకుని ఆత్మశుద్ధి చేసుకోవడం అత్యావశ్యకం. వారు నిజాయితీగా అలా చేసుకోవడం జరిగితే రెండు విషయాలను నిర్భయంగా అంగీకరిస్తారు. అవి: ఒకటి, దళిత సమాజం ఇతర వర్ణ సమాజాల మాదిరే విభజనలమయం; రెండు: వర్గీకరణ సమస్యను సామరశ్యంగా పరిష్కరించకోకుండా ఉంటే యిప్పటికే దళిత సమాజంలోనున్న విభజనలు మరింతగా విజృంభిస్తాయేగాని మట్టుపడే అవకాశం ఇసుమంతైనా ఉండదు. ఇలా అంగీకరించిన తరువాత  పాయలు పాయలుగా విడివడి ఉన్న దళిత కులాలను అనుసంధానం చేయడానికి వారు చేపట్టవలసిన ప్రప్రధమ కార్యక్రమం ఏ ఇసుక మేటలు ఆ అనుసంధానానికి అడ్డుగా ఉన్నాయో వానిని గుర్తించి, చదును చేసి పాయల మధ్య తెన్నులు తీయాలి. అలా జరిగిన రోజున పాయలన్నీ కలసి ప్రవాహ ఉరవడిని పెంచుతాయి.  పోను పోను ఆ ఉరవడి ఉధృతమై దళిత సమాజ శక్తిని ఉద్వేగం చేస్తుంది. ఇప్పుడు మాల-మాదిగ కులాలమధ్య పేరుకుపోయిన పెద్ద ఇసుక మేట – వర్గీకరణ.  ఈ మేటను తియ్యకుండా దళిత సమాజ ఐక్యత గురించి ఆలోచన చెయ్యడం అవివేకులు చేసే పని.

నాలుగు, మహారాష్ట్రలో జరిగిన ఖైర్లాంజీ దురాగతం అగ్రకులాలలో నిభిడీకృతమైన రాక్షసత్వానికీ, పాశవికతకూ, దళితులపై వారిలో పేరుకుపోయిన ఏహ్యభావానికి నిలువెత్తు దర్పణం పడుతుంది.  కుల సమాజం భౌతికంగా, మానసికంగా తమపై విధించిన పరిమితులను అధిగమించి, గీచిన సరిహద్దులను దాటి దళితులు మనుష్యులుగా ఎదగడానికి, స్వతంత్ర్యంగా-ఆత్మ గౌరవంతో బ్రతకడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుందో, అగ్రకులాలు ఎంత దారుణానికి వడికట్టగలవోనని మరోసారి తేల్చి చెప్పిన ఖైర్లాంజీ అమానుషత మరో కారంచేడు, యింకో చుండూరు.  ఈ దుస్సంఘటన జరిగిన తరువాత ప్రజా సాహితి వారు తమ 289వ సంచికలో (డిసెంబరు, 2006) “ఖైర్లాంజీ అవమానాల దురాగతాల జీవితాలింకెన్నాళ్ళు” అనే సంపాదకీయాన్ని ప్రచురించారు. ఇందులో ఖైర్లాంజీ గ్రామ అగ్రకులాలన్ని ఏకమై భయ్యాలాల్ బోత్మాంగ్ కుటుంబంపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటనను వివరిస్తూనే ఆ సంఘటన వెనుక దాగిన, అందుకు దారితీసిన సామాజిక – ఆర్ధిక పరిస్థితులను, స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం దళితుల సామాజిక, ఆర్ధిక స్థితిగతులాభివృద్ధికి రాజ్యాంగ బద్దంగా చేపట్టిన పాలసీ-పథకాలు, అంబేద్కర్ చూపెట్టిన మార్గం – వీటన్నిటినీ క్లుప్తంగానేగానే చర్చించినప్పటికీ, సూక్ష్మంగా విశ్లేషించడం చేశారు.  ఈ విశ్లేషణనుండి దార్ల తన వ్యాసంలో తీసుకున్నవి, మన చర్చకు ఉపయోగపడేవి రెండు విషయాలు: (1) దళితులను సామాజిక విముక్తులను చేయడంలో మతానికున్న పరిమితులు; (2) దళితుల వైయక్తిక విముక్తి/అభివృద్ధి పీడిత జన సమిష్టి విముక్తి/అభివృద్ధి జరిగినప్పుడే.

మనిషి మనుగడకు మతం అవసరమా, కాదా? అవసరమైతే ఏ మేరకు దాన్ని మనిషి తన జీవితంలో అహ్వానించాలి? అవసరం లేకుంటే మనిషికవసరమైన ఆథ్యాత్మికదాహాన్ని ఏ విచారధారతో తీర్చవచ్చు – మున్నగు ప్రశ్నలపై సమాధానం కోసం మనిషి నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఆ ప్రశ్నలపైననే తాత్వికుల మధ్య, ఆస్తిక-నాస్తిక వాదుల మధ్య నిరంతర వాద-వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఒక మత విచారధార చెరసాలలో బందీలు గావించబడిన ఒక కూటమిని మరో మత విచారధార సహాయంతో విముక్తులను చెయ్యవచ్చా, లేదా? – అనేది కూడా పైన పేర్కొన్న ప్రశ్నల పరంపర క్రిందికే వస్తుంది. ఈ ప్రశ్నలను అటుంచి, అంబేద్కర్ మత మార్పిడి చర్యను గమనిస్తే, వేరే మత సహాయంతో దళితులను విముక్తం గావించవచ్చు అని అతను భావించాడని స్పష్టంగా తెలుస్తుంది.[10] కుల సామాజిక వ్యవస్థ పునాదిపై నిర్మితమైన హిందూ మత ధర్మం తన కబంధ హస్తాలలో దళితులను చిక్కించుకుని భౌతికంగా, మానసికంగా వారిని తర తరాలుగా శక్తి విహీనులు చేసుకుంటూ వస్తుంది. అట్టి ధర్మం నుండి, దాని కుల వ్యవస్థనుండి దళితులను విముక్తులను గావించి వారిలో మానవత్వాన్ని రగులగొల్పి మానవీయత కలిగిన మనుష్యులుగా తీర్చిదిద్దే ఒక మహత్తర శక్తి  ‘సమానత’ అనే సూత్రంపై నిర్మితమైన బౌద్ధ ధర్మానికే ఉందని అంబేద్కర్ మనస్పూర్తిగా విశ్వసించాడు. ఎందరో వివిధ మత ధర్మ పెద్దలు తమ తమ మతాలలో చేరమని అంబేద్కర్ ని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా ఎట్టి ప్రలోభానికి లొంగక తన విశ్వాసానికి అనుగుణంగా, కొంత ఆలస్యంగానైనా, తన మరణానికి ముందు తాను విశ్వసించిన బౌద్ధ ధర్మాన్నే బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు.  మిగిలిన దళితులను కూడా అట్టి మార్గాన్ని అనుసరించమని ప్రభోదిస్తాడు. ఆ ప్రభోదానికి ప్రభావితులైన భయ్యాలాల్ బోత్మాంగ్ లాంటి దళితులెందరో బౌద్ధాన్ని స్వీకరించి ఆ ధర్మ సూత్రాలకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకుని నడుచుకుంటున్నారు. అలా నడుచుకుంటున్నప్పటికీ కుల రక్కసి రక్త కౌగిలి నుండి దళితులను ఆ ధర్మం విముక్తి చెయ్యలేక పోవడం విచారకరం. ఇదే విషయాన్ని ప్రజా సాహితివారు తమ సంపాదకీయంలో ప్రముఖంగా పేర్కొన్నారు.

ఆచరణలో బౌద్ధ ధర్మం దళితులను విముక్తం చెయ్యలేకపోయింది అన్న విషయం మనకందరికీ తెలిసినదే. సరే, ఎందుకు అలా జరుగలేదు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని లోతుగా పరిశోధించి చెప్పవలసి ఉన్నా,  నాకు ఇందుకు రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించిన దళితులు ఆ స్వీకరణను హిందూ మతం నుండి తమను తాము విముక్తం చేసుకొనడానికి దూరంగా జరుపుకొనడానికి ఉపయోగించుకొనడానికి బదులుగా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించని ఇతర దళితులతో, దళిత కులాలతో తమను తాము దూరంగా జరుపుకుని, అలా జరుపుకున్నట్లు చూపించుకోవడానికి ఉపయోగించుకోవడం.  ఉదాహరణకు, బౌద్ధాన్ని స్వీకరించిన దళితులలో మహారాష్ట్రలోని మహార్లది అగ్రస్థానం. అంబేద్కర్ తమ కులానికి చెందినవాడు కావడం వల్లనే మహార్లు అతని మార్గాన్ని అవలంభించారు అన్న విషయాన్ని అటుంచితే,  నయా బౌద్ధులు (బౌద్ధాన్ని స్వీకరించిన మహార్లు), మహార్లు (బౌద్ధాన్ని స్వీకరించని వారు) అనే రెండు కూటమిలుగా వీరు తమను తాము విభజించుకున్నారు. ఈ రెండు కూటాల మధ్య వివాహ సంబంధాలు కూడా ఉండవు. ఒకవేళ  అలా జరిగినా ఆ జరగడం అనేది చాలా అరుదు అనికూడా తెలుస్తుంది.  వివరణలో ఏ కుల నిర్మూలన ప్రయోజనాన్ని ఆశించి అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించాడో, మహార్లు నయా బౌద్ధులుగా అవతారమెత్తి ఆ ఆశయాన్ని తుంగలో తొక్కడం చారిత్రకంగా జరిగిన ఒక పరిణామం.  ఈ అనుభవం ఒక్క బౌద్ధానికే పరిమితం కాదు.  క్రైస్తవ, సిక్కు, ఇస్లాం – లాంటి మతాలను స్వీకరించిన దళితులలో కూడా ఇదే మాదిరి అనుభవాన్ని గమనించవచ్చు. మతం మార్చుకున్నా హిందూ మతం తమ చుట్టూ కట్టిన కుల గోడలను కూలగొట్టుకోకుండా ఉండడం అటుంచి ఆ గోడల సమీపానికి సైతం యితరులు రాకుండా దళితులు తామే స్వయంగా నయా కులాల రూపంలో కందకాలు త్రవ్వుకోవడం అంబేద్కర్ మార్గ విఫలానికి ఒక కారణమైతే, ఇలా మతం మార్చుకున్న వారిపై బయటినుండి విధించిన/వచ్చి పడిన పరిమితులు రెండవ కారణం.

రాజ్యంగ బద్దంగా దళితులకు కల్పించిన రిజర్వేషన్ వసతులను క్రైస్తవం, ఇస్లాం లాంటి మతాలలోకి మారిన దళితులకు వర్తింపకుండా చట్టం చేయడం చేశారు. మతం మారినంత మాత్రాన కులం మారుతుందా?  వారి ఆర్ధిక స్థితి బాగుపడుతుందా? ఈ చట్టాన్ని ఏ ఆధారంతో చేశారో అంతుపట్టదు.  క్రైస్తవం పుచ్చుకున్న దళితులకు క్రైస్తవ మిషనరీలు కొంత విద్యాబుద్దులు నేర్పి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఇది బ్రిటీషు వలస ప్రభుత్వ హయాంలో. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తరువాత అగ్ర కులాలు మన రాష్ట్రంలో ముఖ్యంగా కమ్మలు-రెడ్లు క్రైస్తవ విద్యాలయాల్లో సీట్ల కొరకు, వారి సంస్థలలో ఉద్యోగాల కొరకు పెద్ద మొత్తంలో క్రైస్తవ మతంలోకి వచ్చి పడటం జరిగింది, ముఖ్యంగా రోమన్ కాథలిక్ సంఘంలోనికి. అంతవరకు ఫారిన్ మిషనరీల హయాంలో దళితులు కొంత సమానత్వాన్ని చవిచూడటం జరిగింది. ఎప్పుడైతే ఈ అగ్ర కులాల ప్రవేశం జరిగిందో అప్పుడే ఆ మతంలో సమానత్వానికి సిలువ వేయడం, అగ్ర కులతత్వానికి బీజాలు పడటం వెంట వెంటనే జరిగిపోయాయి. కాథలిక్ సమాజంలో అగ్రకుల హేరోదులు ఆరంగంతోనే సృష్టించిన వీరంగాన్ని ఎదురించే శక్తి లేని దళిత శిశివులు ప్రోటెస్టెంటుల పశుల పాకలలో తలదాచుకున్నారు. గుంటూరు ప్రకాశం జిల్లాలలో కాథలిక్ సమాజంలో అగ్రకులాలు ఎందుకు ఎక్కువగానున్నారో, ప్రోటెస్టెంటు  (బాప్టిస్టులు, పెంటెకోస్టులు మున్నగువారు) సమాజాలలో నూటికి తొంభై ఎనిమిది మంది దళితులే ఎందుకు ఉన్నారనే విషయాన్ని పరిశీలిస్తే కాథలిక్ సమాజం నుండి దళితుల మహాభినిష్క్రమణలో అగ్రకుల పరిసయ్యుల పాత్ర బోధపడుతుంది.

పోనివారు పోగా ఉన్న కొద్దిమంది దళితులపట్లనైన ‘నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న క్రీస్తు బోధనను ఆచరించారా?  అటువంటిదేమీ జరుగలేదు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో కాథలిక్ ల కోటాను అచ్చంగా అగ్రకుల కాథలిక్ పిల్లలకిచ్చి, అడపా తడపా ఏర్పాటు చేసిన తెలుగు మీడియం బళ్ళల్లో దళిత క్రైస్తవులను జేర్చుకోవడం జరిగింది. స్కూళ్ళల్లో – కళాశాలల్లో టీచర్ల, లెక్చరర్ల పోస్టులు అగ్రకుల కాథలిక్ లకు రిజర్వ్ చేసి, చప్రాసి పనులతో,  పాకీపనులతో దళిత క్రైస్తవులకు ఉపాధి పేరుతో కూలిపని కల్పించారు. కన్యల ఆసుపత్రులలో అగ్రకుల కాథలిక్ లకు స్టెతస్కోపులిచ్చి దళిత క్రైస్తవులకు చీపుర్లందించారు. సాధారణ దళిత క్రైస్తవులు సరే గురువులుగా, కన్యాస్తీలుగా మారిన దళిత క్రైస్తవులనన్న సమానత్వంతో చూచారా? అటువంటిది కూడా జరుగలేదు.  చార్లెస్ చౌదరీలు, స్టవిస్లాస్ సుబ్బా రెడ్లు సుపీరియర్ ఫాదర్లు, రెక్టర్ లయితే; యేసుపాదం, జోజప్పల్లాంటి ఎందరో దళిత గురువులు పచారీ సరుకుల కొనుగోలుదారులు; రూములన్నీ శుభ్రంగా ఉడ్చారా? బిల్డింగ్ మరమ్మత్తులను జాగ్రత్తగా చేస్తున్నారా, లేదా అని సూపర్ వైజ్ చేసే బేలుదారీ మేస్త్రీలు.  గోపి రాసిన ‘గుడిసె ఏసోపు’ కథలు ఈ సత్యాలకు అద్దం పడతాయి.[11] వివరణలో మతం మార్చుకున్నందుకు దళితులు రిజర్వేషన్ వసతులకు చట్టపరంగా దూరం కాబడి, మత సంస్థలలోని అవకాశాలకు కుల పరంగా దూరం గావించబడి రెంటికి చెడ్డ రెవటలయ్యారు. ఆచరణలో దళితులకు ఎదురవుతున్న ఎన్నో సామాజిక-ఆర్ధిక సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ‘మతం అనేది ఒక మత్తు మందు’ అన్న మార్క్సు దృక్పథాన్ని ప్రాతిపదికగా చేసుకుని “భయ్యాలాల్ హిందూ సామాజిక వ్యవస్థ నుండి విముక్తి కావటానికి, బౌద్ధాన్ని స్వీకరించాడు. ఏ సంస్కృతిక ధర్మమూ అతన్ని కాపాడలేదు” అని ప్రజా సాహితి వారు అంటూ మనిషి కట్టు బాట్లపై ఆలోచనా రీతులపై ఆర్ధిక స్థితిగతులపై మత ప్రభావాన్ని ఒక్క ఉదుటున కొట్టిపారేయటం సరికాదు.

ఇక దళితుల వైయక్తిక విముక్తి/అభివృద్ధి సమస్త పీడిత జన సమిష్టి విముక్తి/అభివృద్ధి జరిగినప్పుడే అన్న ప్రజా సహితి వాదన గురించి కొంత చర్చించవలసి ఉంది. దళిత కూటమిలోని వ్యక్తుల వైయక్తిక సమస్యలేమైనాగాని, అవి ఏ కోవకు చెందినప్పటివైనాగాని ఆ కూటమిలోని వ్యక్తులందరూ సామూహికంగా అనుభవించే కొన్ని ఉమ్మడి సమస్యలు నాలుగు కోవలకు చెందుతాయి: సామాజిక/సాంస్కృతిక గుర్తింపు లేకపోవడం, సాంఘీక అసమానత్వం, ఆర్ధిక పీడన, రాజకీయ నిర్భంధనం. ఈ సమస్యల పరిష్కారాలుగా అంటరానితనం పాటింపు నిషేధం, విద్యా-ఉద్యోగ, రాజకీయ అవకాశాలలో దళితులకు దేశ జనాభాలో  వారి జనాభా నిష్పత్తి ప్రాతిపదికన సీట్ల కేటాయింపులను రాజ్యంగా బద్దంగా గైగొనడం జరిగింది. వీటిని  విడమరచి చూస్తే ఒక్క అంటరానితన పాటింపు నిషేధం తప్ప మిగిలిన పరిష్కార మార్గాలన్ని దళిత కూటమిలోని కొద్దిమంది వ్యక్తుల వైయక్తిక అభివృద్ధి మార్గాలు మాత్రమే గాని, కూటమి యొక్క సామూహిక విముక్తికి, అభివృద్ధి సాధనాలుకాదు.  ఉదాహరణకు విద్యా-ఉద్యోగాలలో దళితులకు కేటాయించిన 15 శాతం సీట్లను వినియోగించుకుని విద్యాపరంగా, తద్వారా ఆర్ధికపరంగా అబివృద్ధికి నోచుకునేది వారిలో 15 శాతం మంది మాత్రమే.  మరి వారిలో మిగిలిన 85 శాతం జనాభా సంగతేమిటి?  దళిత కూటమి సామూహిక విముక్తి జరగనందువలననే ఖైర్లాంజీ, కారంచేడు, చుండూరు లాంటి అగ్రకుల అమానుష దురాగతాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఈ మేరకు ప్రజా సాహితి వారి దృక్పధంతో అంగీకరించక తప్పదు. సరే, దళిత కూటాన్ని భారత రాజ్యాంగం కల్పించిన వసతులు విముక్తం చెయ్యలేకపోయాయి, మరి ప్రజా సాహితి వారు ఆ కూటమి ప్రజల సామూహిక విముక్తికి చూపిస్తున్న మార్గం ఏమిటి?

బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన ‘ఓ రిజర్వు పంచాయితీ కథ’ (ప్రజా సాహితి, 1981: 43వ సంచిక) ద్వారా ప్రజా సాహితివారు చెప్పిన విషయంలోగాని, ‘ఖైర్లాంజీ అవమానాల దురాగతాల జీవితాలింకెన్నాళ్ళు’ అన్న సంపాదకీయంలో చెప్పినదాన్లో గాని రెండు అంశాలలో వారి సందేశం  స్పష్టం: (1) భూమిపై హక్కు సాధించకుండా దళితుల విముక్తి సాధ్యం కాదు. (2) భూమిలేనివారు దళితులలో అధికంగా ఉన్నప్పటికీ అలా లేనివారు దళితేతరులలోకూడా ఉన్నారు. ఈ పీడితులంతా (భూమిలేని దళితులు – దళితేతరులు) సంఘటితమై ఐక్యంగా భూపోరాటం ద్వారా భూమిని సాధించుకోవాలి.  వర్గ మార్గం మంచి మార్గమే.  అయితే కుల సమాజంలో ఈ మార్గ ఆచరణ సాధ్యమేనా? – అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్గంలోని కొన్ని పరిమితులను వామపక్ష ఆలోచన విధానానికి కట్టుబడినవారికి అంబేద్కర్ అలోచనకు కట్టుబడిన దళితులు దళితేతరులు మొదటనుండి చెబుతూనే ఉన్నారు. వాటిలో ముఖ్యంగా: (1) కుల వ్యవస్థ – ఫ్యూడల్  వ్యవస్థ ఒకదానికొకటి పెనవేసుకున్న కాలంలో అగ్రకులాల అధికారానికి నిమ్నకులాల బానిసత్వానికి మూలం పైకులాలకు భూమిపై అధికారం, క్రింది వారికి అలా అధికారం లేక పోవడం. ఫ్యూడల్ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థగా  రూపాంతరం చెందిన తరువాత అగ్రకులాల అధికార మూలం కూడా మారింది.  అప్పుడు భూమి మూలమైతే ఇప్పుడు విద్య మూలంగా మారింది. ఈ మార్పును గమనించకుండా గతించిన కాలానికి చెందిన సమస్య పరిష్కారాన్ని నడుస్తున్న కాలంలో వర్తింప జేయాలని చూడటం, మే సెవెంటీంత్ కామ్రేడ్స్ మాటలలో “జబ్బుకు పొంతనలేని మందును ఇవ్వడం”[12] లాంటిది అవుతుంది. (2) దళితులలో దళితేతరులలో భూమిలేనివారు ఉన్నారు. సరే, ఈ ఉమ్మడి సమస్య ప్రాతిపదికన వీరిరువురిని ఉమ్మడి వేదికపైకి తీసుకురాగలరా? తీసుకు రాలేరని యిన్నేళ్ళ వామపక్ష ఉద్యమం-రాజకీయాలు, నక్సలైటు ఉద్యమ వైఫల్యాలు చెబుతూనే ఉన్నాయి. ఈ పరిమితులను అధిగమించేది, దళిత-దళితేతరులలో ఉన్న పీడిత సమాజాన్ని ఆర్ధిక-సామాజిక బంధ విముక్తులను గావించేది కేవలం మార్క్స్ వర్గ దృక్పథాన్ని అంబేద్కర్ కుల దృక్పథానికి జతచేసి కుల పోరాటాలను, వర్గ పోరాటాలను జతగా, ఏక కాలంలో చేపట్టినప్పుడే. ఇది దళిత కుల – వర్గ దృక్పథం అనీ, దీనిలో వర్గీకరణ వంటి అంశాలను కూడా భాగస్వామ్యం చేయాలనీ, అంతే తప్ప భూమి కోసం దళితులంతా కలిసి ఉమ్మడి పోరాటాలు చేయడం ద్వారానే తమ సమస్యలు తీరిపోతాయని మాదిగలు నమ్మే స్థితిలో లేరని చాలా సున్నితంగానే దార్ల  ప్రజాసాహితి వ్యాసాల్లోని భావజాలాన్ని తిరస్కరిస్తున్నాడు. సమాజం అంతటినీ చూసినప్పుడు వర్గ దృక్పథం, దళితుల్ని కూడా కలుపుకొని చూసినప్పుడు వర్గ – కుల దృక్పథం, మాదిగల్ని కలుపుకున్నప్పుడు వర్గ,కుల, వర్గీకరణ దృక్పథంతో భూమి కోసం జరిగే పోరాటాలు జరగాలని ఆశించడంలో ఎంతో స్పష్టత కనిపిస్తుంది.

మొత్తానికి మాదిగ కులంలో పుట్టినప్పటికీ మాదిగలు వేసిందే దరువు, రాసిందే సాహిత్యం అని తన కుల వకల్తా పుచ్చుకోక మాదిగ సాహిత్యం ఆరంభంలో అవేశం హద్దు దాటిందని ఒప్పుకునే నిజాయితి దార్లలో ఉండడం అభినందించదగిన విషయం. తెలుగు సాహిత్యంలో దళిత కథకుగల ప్రాముఖ్యతను తెలియజేయడంతో మొదలయిన దార్ల కలం మాదిగ సాహిత్యం పలికించిన ప్రతి సాహిత్య ప్రక్రియను తడుతూ మార్కిస్టులను అంబేద్కరిస్టులను దగ్గరకు చేర్చే ఒక మంచి ప్రయత్నంపై దృష్టి కేంద్రికరించడం రాబోయే కాలంలో ఆ కలం చేపట్టబోయే నూతన ప్రయాణానికి నాంది ప్రస్తావన.

*****


నోట్స్ అండ్ రిఫరెన్సెస్

* నా తెలుగు దోషాలను సవరించడంతోపాటు వ్యాస పొందికకు తగిన సూచనలిచ్చిన వసంత దుగ్గిరాలకు (ఉస్మానియ యూనివర్శిటి), శ్రీథర్ మోదుగుకు నా ధన్యవాదాలు.

[1] రాములు,బి.యస్. 2003. ‘50 ఏళ్ళ తెలుగు కథ తీరు తెన్నులు’, హైదరాబాద్: విశాల సాహిత్య అకాడమి, పే. 86.

[2] వెంకటేశ్వరరావు, దార్ల. 2009. దళిత సాహిత్యం: మాదిగ దృక్పథం (సాహిత్య విమర్శ వ్యాసాలు), హైదరాబాద్: దండోర ప్రచురణలు. (ముద్రణాలయంలో ఉన్న ఈ పుస్తకాన్ని మార్చి నెల మాసాంతానికల్లా బయటకు తీసుకు రావడానికి ప్రచురణ కర్తలు కృషి చేస్తున్నారు).

[3] రాములు,బి.యస్. 2003. ‘50 ఏళ్ళ తెలుగు కథ తీరు తెన్నులు’, పే. 163.

[4] ప్రసేన్. 1996. ‘మాల బ్రాహ్మల దళితదాష్టీకం!’, ఆంధ్రభూమి, 6 అక్టోబర్.

[5] దండోరా నేపథ్యంలో మాలల దృష్టికోణం నుండి మాదిగ చైతన్యాన్ని చెప్పిన నవల ‘మాదిగ పల్లె’. అయితే ఈ నవలకు  మాదిగ పల్లె అనే పేరు కంటే మాల పల్లె అని పేరు పెడితే చక్కగా సరిపోయేది. కథా నాయకుడు మాల కులానికి చెందినవాడు, కథనం అంతా ఆ నాయకుడు, అతని కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తూ, మాలల పోరాట పటిమ, సాహసాల గురించి చెప్పిన నవల.  మాదిగలలో  అటువంటి నాయకత్వం, దీక్ష దక్షతలు ఉన్నట్లు మచ్చుకైనా చెప్పదు ఈ నవల. రాయుడు చెప్పినట్లుగా మాల కులానికి చెందిన నరసయ్య మాదిగ పల్లె నవల రాసి తెలిసో, తెలియకో తమ కులానికి మాదిగలపై గల అభిప్రాయాన్ని వెల్లడించడం చేశారు.  చూడండి, రాయుడు, కె.యం. 2003. ‘స్వైర కల్పనగా మారిన ‘మాదిగ పల్లె”, చంద్రశేఖర రెడ్డి, రాచపాళెం, కె. లక్ష్మీనారాయణ (సం.) 1980 తర్వాత తెలుగు దళిత నవల (వ్యాస సంకలనం), అనంతపురం: లక్ష్మీ గ్రాఫిక్స్, పే. 73.

[6] ‘కక్క’ నవలపై చక్కని విశ్లేషణ కొరకు చూడండి, ఆచార్య ననుమాసస్వామి, 2003. ‘దళిత సాంస్కృతిక నేపథ్య ప్రతిబింబం కక్క’, చంద్రశేఖర రెడ్డి, రాచపాళెం, కె. లక్ష్మీనారాయణ (సం.) 1980 తర్వాత తెలుగు దళిత నవల (వ్యాస సంకలనం), అనంతపురం: లక్ష్మీ గ్రాఫిక్స్ పే: 82-97.

[7] చంద్రశేఖర రెడ్డి, రాచపాళెం. 2002. ఆధునికాంధ్ర కవిత్వం: ఉద్యమాలుసందర్భాలు, హైదరాబాద్: అనుపమ ప్రింటర్స్, పే: 72 & 74.

[8] చూడండి, వెంకటస్వామి, పి.ఆర్. 1955. అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్షిపేషన్, సికంద్రాబాద్: యూనివర్సల్ ఆర్ట్ ప్రింటర్స్.

[9] జానయ్య, మంద. 1999. దళిత్ పోలిటిక్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్: ఎ కేస్ స్టడి ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టి (బి.యస్.పి.), అముద్రిత యం.ఫిల్.ల్ థీసిస్. హైదరాబాద్: రాజనీతి శాస్త్ర విభాగం, యూనివర్శిటి ఆఫ్ హైదరాబాద్.

[10] అంబేడ్కర్, బి.ఆర్. 2004. కన్వర్షన్ యాజ్ ఎమాన్షిపేషన్, న్యూ ఢిల్లి: క్రిటికల్ క్వష్ట్.

[11] గోపి, డి. 1996. గుడిసె ఏసోబు: దళిత కథలు, విజయవాడ: దళిత స్త్రీ సాహిత్య పరిషత్.

[12] చూడండి, మే సెవెంటీంత్ కామ్రేడ్స్, సి.పి.యు.యస్.ఐ. 2001. ఇండియాలో ఏం చేయాలి (కా. వీరన్న సారధ్యంలో కులంపై, అంబేద్కర్ సిద్ధాంత చర్చ), దళిత బహుజన శ్రామిక విముక్తి: ఆంధ్రప్రదేశ్.

2 Comments

Filed under సామాజిక న్యాయం కోసం

నీవు మారేదెప్పుడు? (When would you change?)

నీవు మారేదెప్పుడు?
– మాదిగ సాంబయ్య గుండిమెడ

ఆడ్ని
ఆ …నల్లోడ్ని
మా యూనివర్శిటి గేటుముందు కుక్కలా కాపాలా కాస్తున్న ఆ…నల్లోడ్ని
మా లైబ్రరీ తలుపు ప్రక్క నిలబడి గూర్ఖాకాస్తున్న ఆ…నల్లోడ్ని
నేను లండన్నొచ్చినప్పట్నించి చూస్తున్న

ఆడ్ని
ఆ … నల్లోడ్ని
పొద్దున్నే ఆరుగంటలకు మిషన్ చీపురుచ్చుకొని
బిటీష్ లైబ్రరీ ముందు ఊడ్చే ఆ … నల్లోడ్ని
నేను లండన్నొచ్చినప్పట్నించి చూస్తున్న

దాన్ని
ఆ … నల్లదాన్ని
ఫైవ్ స్టార్ హొటళ్ళల్లాంటి మాహాస్టళ్ళలో
టాయిలెట్లు క్లీన్ చేసే ఆ … నల్లక్లీనర్ ని
నేను లండన్నొచ్చినప్పట్నించి చూస్తున్న

ఆళ్ళని
ఆ … నల్లోల్ని
రాత్రి ఎనిమిది గంటలనుండి తెల్లారి ఎనిమిది గంటలదాకా
తెల్లోడి సూపర్ మార్కెట్లలో
సల్లటి సలిలో సరుకులు సర్ధుతున్న ఆ … నల్లోల్ని
నేను లండన్నొచ్చినప్పట్నించి చూస్తున్న

దాన్ని మా … ముసిలమ్మని
పొద్దుటేళ పాపయ్యగారి పొలంలో కలుపుతీసి
సంధ్యపేళ కోటేశ్వరరావుగారి దొడ్లో అంట్లు కడిగే
మా … ముసిలమ్మని
నా సిన్నప్పట్నించి సూస్తున్న

ఆడ్ని
ఆ … యానాది కిట్టప్పగాడ్ని
అయినోరి యిళ్ళల్లో పెళ్ళిలపుడు ఆకులెత్తి
ఆరి దొడ్లో రోజూ దొడ్లు కడిగే
ఆ … యానాది కిట్టప్పగాడ్ని
నా సిన్నప్పట్నించి సూస్తున్న

ఆళ్ళని
ఆ … పాకీ వందనాన్ని, ఆడి పెళ్ళాం సుశీలమ్మని
మావూరి పంచాయితీ రోడ్లు ఊడ్సి
సైడుకాల్వల్లో పెంట ఎత్తెసే
ఆ … పాకీ వందనాన్ని, ఆడి పెళ్ళాం సుశీలమ్మని
నా సిన్నప్పట్నించి సూస్తున్న

నేను లండన్నొచ్చి
నాలుగేళ్ళయ్యింది
గూర్ఖకాసే ఆ … నల్లోడు
టాయిలెట్లు క్లీన్ చేసే ఆ … నల్లక్లీనర్
సల్లటిసల్లో సరుకులు సర్దే ఆ … నల్లోళ్ళు
యిపుడు లేరు.

ఆహా
బిటీష్ దేశంలో
నల్లోడికి మంచిరోజులొచ్చాయన్న మాట
మా నాయనే!
ఎంత సల్లటి మాట సెప్పెవురా సిన్నోడా …

రేయ్ ! ఎర్రినాకొడక !
‘ఆ … నల్లోళ్ళు’ పోయార్రా
కాని
ఆళ్ళ జాబుల్లోకి యిపుడొచ్చింది కూడా
ఆ నల్లోళ్ళేరా
బహుశా ఆళ్ళ పిల్లలయివుండోచ్చు
ఎట్టెట్టా….

నాకు ముప్ఫై ఏళ్ళు దాటాయి
కలుపు తీసే మా ముసల్ది
దొడ్లుకడిగే ఆ యానాది కిట్టప్పగాడు
పాకీ పనిచేసే ఆ వందనం, ఆడి పెళ్ళాం
అందరూ యిప్పుడు రిటైరైపోయారు

పోన్లే అయ్యా …
ఆళ్ళు కట్టపడ్డా
ఆ నల్లోళ్ళ పిల్లల్లాగా ముసిల్దాని పిల్లలు లిక్కిపట్టలేదు
ఆ యానాది కిట్టప్పగాడి కొడుకో – కూతురో
ఫినాయలు డబ్బాతీసుకోలేదు
ఆ పాకోళ్ళ పిల్లగాళ్ళు సీపుర్లుచ్చుకోలేదు

రేయ్! మట్టి నా కొడుక !
యిప్పుడు ముసిల్దాని మనుమరాలు
అంటే నా సెల్లెలు లిక్కి పట్టిందిరా
యిపుడు కిష్టప్పగాడి కొడుకు
రామప్పగాడు డబ్బావుచ్చుకున్నాడురా
యిపుడు ఆ పాకోళ్ళ పిల్లల సేతికి సీపుర్లొచ్చాయిరా
అయ్యో … బిడ్డా!

ఏమ్ రోయ్ !
యిపుడు బిటిషోడంటే
ఒక్క తెల్లోడేగాదు
మీ దేశంలో వందల సంవత్సరాలుగా
మీకు ఊడిగం చేస్తున్న
నల్లోళ్ళు కూడ

మీ తెల్లోళ్ళ
పిల్లలు యూనివర్శిటీల కెళ్ళి
లైబ్రరీలలలో సదువు కుంటుంటే
మరి ఆనల్లోళ్ళ పిల్లలు
యూనివర్శిటీల ముందు ఎందుక్కాపలా కాయాలా?
లైబ్రరీలలోని టాయిలేట్లు ఆళ్ళే
ఎందుక్లీన్ చెయ్యాలా?

తూ … నీయబ్బ!
నీ రేసిజాన్ని, నీ వలసకంపుని
వదులు కున్నావు కాదు కదరా!

ఏవే
నా అందమైన బంగారు భారతదేశమా!
డాక్టరు కోర్సు చేస్తున్న గంగాధర శాస్త్రిగారి మనుమరాలు
హేమలతా దేవే నీ బిడ్డా?
కంప్యూటర్ ఇంజనీర్ కోర్సు చేస్తున్న బాపినీడు గారి మనుమడు
శ్రీనివాసర్రావే నీ బిడ్డడా?

మరి
మా ముసిల్దాని ముద్దుల మనుమరాలు
నా సిట్టి సెల్లెలు శాంతమ్మ నీ బిడ్డకాదా?
శాస్త్రి మనుమరాలి చేతికి స్టెతస్కోప్ ఎట్లావచ్చింది? మరి
మా ముసిల్దాని మనుమరాలి చేతికి లిక్కెట్లావచ్చింది?

ఆ… యానాది కిష్టప్పగాడి కొడుకు
రామప్పగాడు నీ బిడ్డడు గాడా?
ఆ పాకోని పిల్లలు నీ పిల్లలు కారా?
మరి ఆడి మనుమడి చేతికి కంప్యూటర్ మౌస్ ఎట్లొచ్చింది?
ఈళ్ళ పిల్లగాళ్ళ సేతులకు సీపుర్లేందుకొచ్చాయి?

తూ నీయవ్వ!
నీ సవతి తల్లి మాదిరి ప్రేమని
నీ కుల గజ్జిని ఎప్పుడు వదిలించుకుంటావే?”

లండన్ , 8 మార్చి, 2007

అంకితం: గురువర్యులు ఎండ్లూరి సుధాకర్ గారికి వినమ్రయంతో వారి ఏకలవ్య శిష్యుని తొలి కవిత.

కవితలు
18 అభిప్రాయాలు
# డా.వి.ఆర్ .దార్ల 02 ఏప్రిల్ 2007 , 1:27 am
ఇలాంటి కవిత్వం వల్ల దేశదేశాల్లో ఉన్న వివక్ష అర్థమవుతుంది. మంచి ప్రయత్నం. కవితలో భావతీవ్రత ఉంది. ‘ తెలుగు మాదిగ సాహిత్య వైతాళికుడు’ డా. ఎండ్లూరి సుధాకర్ గారికి అంకింతం ఇవ్వటం మరింత సమంజసంగా ఉంది.

# ప్రసాద్ 02 ఏప్రిల్ 2007 , 1:09 pm
చక్కగా చెప్పారు.

నేనూ పడమర దేశాలలో నల్ల వాళ్ళతో మన దేశపు దళిత కులాల వాళ్ళను చూపిస్తూ వాళ్ళనుభవించిన బానిసత్వానికి మన దళితులు అనుభవించిన (అనుభవిస్తున్న) దాస్యానికి పెద్ద తేడా లేదని నా “బానిసత్వం నాటి నుండీ నేటి వరకూ” (http://poddu.net/?p=143) లో చెబుదామని ప్రయత్నించా.

–ప్రసాద్
http://blog.charasala.com

# suresh kumar digumarthi 03 ఏప్రిల్ 2007 , 7:21 am
ఎండ్ళూరి వారి ఏకల్వ్య సిష్యుడు, మా అన్న సాంబయ్య గారి కవిత తను పెరిగిన ప్రపంచానికి మరియు నివ్సిస్తున్న సమాజానికి చక్కటి అనునంధానాన్ని ఏర్పరిచింది. దలితుకు గ్లోబల అవగాహనను కలిగిస్తుంది.

# ravinder 03 ఏప్రిల్ 2007 , 10:49 am
మొదటి కవితే అయినప్పటికి కవితలో చాలా మెచ్యురిటి కనిపించింది.
సాంబయ్య గారు ఇలాగే మంచి కవితలు రాస్తారని, రాయాలని
ఆశించడం అతిశయోక్తి కాదేమో….

# shravankumar 05 ఏప్రిల్ 2007 , 2:39 am
అయ్యా సాంబయ్య బాగానే రాసినవ్,ఇక్కడి నల్లొల్ల మీద,అక్కడి ధళితుల మీద…..
దొరికిన అవకాషాన్ని అందుకొని అంచెలంచెలుగా ఎదిగి పైకొచిన నువ్వు కూడా
అందాల బంగారు భారత దేశ ముద్దు బిడ్డవె నయ్యా…..!
నీకు సామెతలొచ్చుగా…..పెద్ద గీత పెద్ద గీత అంటూ బాపనొల్ల మీద ,చౌదరీల మీద,రెడ్లౌల్ల మీద పడే బదులు….ఆ పెద్ద గీత ముందు నీలెక్కన నొడు (నీలాగ ఒకడు) ఇంకొపెద్ద గీత గీస్తె అయ్|ంపాయె ఇక డప్పులెందుకు ,దండొరాలెందుకయ్యా!!
దళితుల్లో నీలా ప్రతి పది మందిలో ఒక్కడు తయారై
మువ్వన్నెల జెండాను ప్రపంచ నలుమూలలా ఎగిరెసుకు పొతుంటే ,
సంబరమ్ముతో నిన్ను భుజంపైన ఎత్తుకునెటొడు
ఓ బాపనొడొ,ఓ చౌదరో, ఓ వెలమోడొ ఉండడంటవా……………………

నాకు తెలిసిన బాపనొడు………..
ఓయాబై సంవత్సరాల ముసలోడు
అనాథ యనాదుల కొసం శరనాలయం పెట్టిండు
పేరు…సంగమేశ్వర శాస్త్రి………..

నాకు తెలిసిన రెడ్డోడు
వరంగల్ జిల్లా చిట్యాలలొ ఓ వైద్యు డు
ఇరవయె నాలుగు గంటలు పేదలకు ఆందుబాటులొ ఉండెటొడు..
ఈ రెడ్డోడు మాద్గొల్లకి సాయం చేసి పేరు బాగానే సంపాంచిండు .
ఈడు వుల్లె ఉంటె మనల్ని దెకెటొడుండడని
అన్నలు రెడ్డోనింటిని లెపిపారెసిండ్రు మందుగుండుతొ…….
ఎమయింది…రెడ్డి మకాం మార్చిండు హైధ్రాబాద్కు…
ఊర్కుంటాడు.. ఆడ కూడ మొదలుపెట్టిండు ..సేవ…దళితుల సేవ….పూరి గుడిసెవాసుల సేవ…….. ..పేరు …సురేందర్ రెడ్డి

నాకు తెలిసిన ఓ దళిత రాజకీయ నాయకుడు
సామన్య కుటుంభం నుంచి వచ్చినొడని,పేద దళితుడని,
నాయకున్ని చేసిండ్రు నాకు తెలిసిన ఓ పార్టీ
నాయకుడైండు, ఏమిచేసిండ్రా అంటే బొజ్జ నింపుకుండు, కొట్లు కొట్లు గడించిండు,
ఏమన్న చేసినాడ్రా మరి దళితులకి అంటే మొండి చెయె సూయించుండు తప్ప ఇంకెమేచెయలె…..,
ఓ రాజకీయ పార్టీకి ఎకంగ ప్రెసిడెంటైండు కేవలం దళితుడు అన్న కారణంగ……పదవిలో ఉన్నంత కాలం ఎమిగుర్తుకు రాదు ,పార్టీనుంచి ఊడపీకంగనే కులం మాత్రం గుర్తుకొస్తది…..
పేరు ….బంగారు….

అయ్యా సాంబయ్య బాగానే రాసినవ్,ఇక్కడి నల్లొల్ల మీద,అక్కడి ధళితుల మీద…..

సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు ,
ను వ్వు సదివినంత సదువూ సదవలే,
ఆడు , ఈడు అన్నది వినుడె గాని సదివింది తక్కువె!

అయ్యా సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు కాని
ఇక్కడి నల్లొడు నాల్గు అక్షరాల్నేర్చినోడయ్యా
ఆ నాల్గూ రాని తెల్లొడు మరి ఆ నల్లొని కింద ఈడ్గం చేస్తున్న ఘటనలూ లేవంటావా సాంబయ్య!!

అయ్యా సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు కాని
వ్యక్తిత్వం ముఖ్యమయ్యా,తపన అవసరమయ్యా……
ఇవి వున్నొడు నీలా పైకొస్తాడయ్యా
ఎవొడొచ్చి సిం హన్ని ఆడివికి రారాజును చేసిండు
స్వశక్తి తొ దానికదే అడివికి రాజు ఆయింది
అందుకే సిం హన్ని ‘స్వయమేవ మృగేంద్ర ‘ అంటారు…..

బాపనొడి గీత పక్కన, మరొ పెద్ద గీత గీసిన నిన్ను చూసి ,
అందాల బంగారు భారతమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ…
నా ఈ స్వగర్వానికి నువ్వేరా కారణం అంటూవుంటే…
నువ్వూ కాక ఇంకెవ్వడయ్యా భారతమ్మ ముద్దు బిడ్డడు!!!

అయ్యా సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు కాని

ఇక ఈ దండొరాలు,డప్పుల చప్పుల్లు నిద్రోతున్న మన జనాలను లేపడానికి,
వాల్లల్లో శక్తి ని నింపి ‘ పెద్ద గీత ‘ గీయడానికి ఉపయోగిస్తే బాగుంటుందేమో

అయ్యా సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు !!!!!!!!!!!!!!!!!!!!!!!

# Raghothama Rao C 06 ఏప్రిల్ 2007 , 12:09 pm
ఏ అజెండాతో కవిత వ్రాసినా దాని అసలు లక్ష్యం మనసుని కదిలించగలగడం. ఆ పనిని నెరవేర్చలేని రోజు కవి విఫలమైనట్టే.
.
ఏ కులాన్ని సమర్థించే “కవిత” ఐనా అందులో “కవిత్వం” ఉంటేనే కవిత అయ్యేది. తిట్లు, శాపనార్థాలు, వెటకారాలు, చమత్కారాలు కవిత్వం అనిపించుకోవు. అందువల్ల ఇందులో “కవిత్వం” అనదగ్గ వాక్యాలు అరుదుగా ఉన్నాయి. ఒకవేళ ఎండగట్టడమే ప్రధాన లక్ష్యం ఐతే కవిత్వం తప్ప వేరే ఏదైనా ప్రక్రియను ఎంచుకోవడం మేలు.
.
ఇది మీ మొదటి కవిత అంటున్నారు గనుక ముందుముందు చక్కగా వ్రాసేందుకు ప్రయత్నించండి.
.
నా ఉద్దేశంలో ఎండ్లూరి గారు మంచికవి కాగలిగేవారే, కులం గంతలు కట్టుకోకుంటే!

# మహేష్ 06 ఏప్రిల్ 2007 , 6:27 pm
వాడు మారేది ఎప్పుడూ? గాంధీ సంస్కరణవాదం తోనే, మానసిక పరివర్తన తోనా?

.
వేలాది సంవత్సరాలు కొనసాగుతున్న కులవ్యవస్థ మూలాలు ఎక్కడున్నాయి. బ్రామ్మణవాదం తెచ్చిన మనుధర్మశాస్త్రం మౌళిక ప్రాతిపదికని మనకి తెలుసు. చారిత్రాత్మకంగా చూసుకుంటే, యూరోపియన్ సమాజంలోని బానిసత్వంలో కనిపించే శ్రమదోపిడి, అణచివేత లక్షణాలు కులవ్యవస్థలో కూడా కనిపిస్తాయి. కాలమానాలు వేరే అయ్యివుండవచ్చు. ఒకటి ముందు, మరొకటి తరువాత అవ్వొచ్చు. కులవ్యవస్థ, ఫ్యూడల్ ధోరణులు సంస్కరణవాదం తో మార్చగలుగుతామా? ఇప్పటిదాకా చరిత్ర మటుకు సాధ్యం కాదనే చెబుతుంది.

.
అమెరికా లో తెల్లవారి మానసిక పరివర్తనతో నల్లజాతి విముక్తి జరగలేదు. ఎన్నో పోరాటాలతో, ప్రజా ఉద్యమాలతో, పౌరహక్కుల ఉద్యమాలతోనే సాధ్యమైంది. మార్టిన్ లూధర్ కింగ్ , మాల్కం ఎక్స్ , పాల్ రాబ్ సన్, రోజాపార్క్ , బ్లాక్ పాంథర్స్ పోరాటాల, త్యాగాల ఫలితమే నల్లజాతి విముక్తి. హోన్యూటన్, బాబ్ సీలీ పోరాటాలు ఫలితం .ఇప్పటికీ చాలామంది బ్లాక్ పాంథర్స్ జైళ్ళల్లో మగ్గుతున్నారు. జర్నలిస్టు, రచయిత ముమియా అబూ జమాల్ ఉరికంబం మీద నిలబెట్టారు.
.

సౌత్ ఆఫ్రికా లో నెల్సన్ మండేలా నాయకత్వంలో ఆఫ్రికన్స్ కూడా సాయుధపోరాటం తోనే విముక్తి పొందారు.
.

“దళితుల విముక్తి హిందువుల ఆత్మ పరిశుద్ధి పైన ఆధారపడి వుంది” అనుకోవటం పొరపాటు. హిందూ మతోన్మాదాన్ని కానీ, బ్రామ్మణవాద కులవ్యవస్థను ప్రజాపోరాటాలతోనూ, వర్గపోరాటలతోనూ ఓడించాలి. కారంచేడు, నీరుకొండ, వేంపెంట, ఖైర్లాంజీ మారణకాండలను సాగించే కొంతమంది అగ్రకుల వ్యక్తులను, వాళ్ళని పెంచిపోషించే పాలకవర్గాలను ప్రజాపోరాటాలు, విప్లవపోరాటలతోనే ఓడించాలి. ఈ క్రమంలోనే దళితులు పోరాడి విముక్తి పొందుతారు.

# ravikiran timmireddy 07 ఏప్రిల్ 2007 , 12:52 am
సాంబయ్య గారూ,

అగ్ర కులం లో పుట్టి, ఏదో కొద్ది జరుగుబాటుండే మధ్య తరగతి లో పెరిగిన మాలాటి వారికి, ఆర్ధిక కష్టాలగురించి కొద్దో గొప్పో తెలుసుగానీ, కులం వలన కలిగేటటువంటి సంఘపరవైన కష్టాలు ప్రత్యక్ష్యంగా అనుభవం కాదు. అందుకని నా అభిప్రాయాలు కొన్ని సార్లు నిజానికి దూరంగా వుండడానికి కూడా ఆస్కారం వుండకపోలేదు.

ఐతే దళిత జన స్నేహం లేకపోలేదు. కాకపోతే ఆ స్నేహంకూడా జరుగుబాటు వున్నటువంటి, సంఘంలో ఆర్ధికంగా నిలదొక్కుకున్న దళిత కుటుంబాలునుంచే కావడం మూలాన, అందులోనూ పట్టణంలోనూ, స్నేహంలో కులాలు చూడని వయసులోనూ ఐన సావాసాలవడం వలన, ఆర్ధికంగానూ, సామాజికంగానూ, ముఖ్యంగా పల్లెటూర్లలో ఏ అవకాశాలూ తమ దరికి చేరని దళితుల కష్ట సుఖాల గురించి ప్రత్యక్ష అనుభవం లేకపోవటం అనేది వాస్తవం. ఈ పరిమితవైన అనుభవం వలన, నేనే ప్రెశ్నెలైతే అడగుతానో మీరూ అవే ప్రశ్నలని మీ కవితలో అడగడం వలన మీ అనుభవం, లేకపోతే మీ అనుభవం నేర్పిన జీవన సత్యం నా దళిత అనుభవంలాగే బహు పరిమితమయిందని నే నర్థం చేసుకోవలసి వస్తుంది. నా లాగా, నా కున్న ఆర్ధిక స్తోమత కలిగిన దళిత స్నేహితుల్లాగా మీక్కూడా అవకాశాలు చాలా కలసి వచ్చి, భవిష్యత్తు లో పిడికెడు కూడు కోసం భయపడాల్సిన అవసరం లేని స్తితిలో వచ్చే ప్రశ్నలే మీ కవితలో కూడా పల్లవించాయి.

ఎంతమంది బాపన పడుచుల చేతిలో స్టెతస్కోపులను మీరు చూశారో నాకు తెలీదు. అగ్రకులస్తుడుగా నాకైతే చాలా తక్కువమందే తెలుసు. రెడ్డి, కమ్మ కులాలైతే నాకు చాలా మందే తెలుసు. రెడ్డి, కమ్మ కులస్తులైనా ఎందుకు పైచదువుల్లో ఎక్కువున్నారంటే, ఆర్ధిక పరవైన వెసులుబాటు మూలానే. ప్రొఫషనల్ చదువులు చదివిన దళితుల్లో ఎంత మంది ఏ మాత్రం ఆర్ధిక శక్థి లేనటువంటి దళితులనుంచి వచ్చారో మీరే చెప్పాలి.

సాంబయ్య గారూ, ఇంకా మీరు స్కూల్లో వున్నారంటే యువకులే అయ్యుంటారు. కుల విభజనలకన్నా, కులవిభజలకి కూడా మూలవైనటువంటి ఆర్ధిక అసమానతల్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ కవిత కూడా ఒక అగ్ర తరగతి దళిత కవితవుతుంది. మా మధ్య తరగతి, అగ్రకుల అనుభవాల పరిమితే మీ అగ్ర తరగతి దళిత కుల పరిమితవుతుంది.

మీ కవితలో కావలిసినంత ఎనర్జీ వుంది. కానీ అవసరవైన లాజికల్ సినర్జీ మాత్రం లోపించింది.

రవికిరణ్ రెడ్డి తిమ్మిరెడ్డి.

# sunil talla 01 మే 2007 , 11:10 am
కవిత బాగుంది. చక్కని అభివ్యక్తి,మనోరంజక మైన శిల్పం.

Leave a comment

Filed under సామాజిక న్యాయం కోసం

నూతన వ్యవస్థను నిర్మిద్దాం! (Let’s Construct a New System)

ఎంతో చెప్పాలని ఉండే
కాని కొంచం కూడా చెప్పలేక పోయాను !
చాలా రాయాలని ఉండే
కాని ఏమీ రాయలేక పోయాను !

నా మాట విని
కడుపులో దేవినట్లు
ముఖం పెట్టాడు !
నా రాత చూసి
కుక్కలు చించిన విస్తరిలా ఉందని
విసిరికొట్టాడు !

నా మాటని
వాడు పలికే తీరులోనే
పలకాలంట ?
నా రాతని
వాడు నిర్ధేశించిన వ్యాకరణంలోనే
వ్రాయాలంట ?

ఆ మాట తీరులో – ఆ వ్యాకరణంలో
దాగున్న అసలు కుట్ర తెలియక….

అయ్యోరికి జబ్బు చేసిద్దేమోనని
నా నోరు మూసేసుకోని
మూగోడినయ్యాను !
అయ్యోరికి కోపం వచ్చిద్దేమోనని
నా రాత చెరిపేసుకుని
తలలేనోడ్నయ్యాను !

యింతేనా…?

నా ఆజానుబాహు దేహం చూసి
కొండలా ఉన్నానని
ఎద్దేవా చేశాడు !
నా దిట్టమైన కండలు చూసి
ఏనుగులా ఉన్నానని
న్యక్కారం చేశాడు !

నన్ను కొండను చేసి
నా పైన ఆడు తపస్సు చేసుకున్నాడు !
నన్ను ఏనుగుని చేసి
ఆడికి అంబారిగా మార్చుకున్నాడు !

అయితే…!

ఆడికి తెలియదు !
కొండ క్రింద మంట ఉంటుందని
ఆ మంటకు
కొండ బ్రద్దలవుతుందని !
ఆడికి తెలియదు !
ఏనుగు కోపిష్టిదని
కోపమొస్తే
అంబారెక్కినోడిని లాగి విసిరేసిద్దని !

హేయ్………………………..!

ఇప్పుడు నేను
బ్రద్దలయి కొండన్నుండొచ్చిన
క్రొత్త దావానలాన్ని!
ఇప్పుడు నేను
రోషమొచ్చి ఘీంకరిస్తున్న
రోష గజాన్ని!

నేను బ్రద్దలయినప్పుడే
నా మీద కూర్చున్నోడు
బ్రద్దలయ్యాడు !
నా మొదటి ఘీంకారంతోనే
నా పైన సవారి చేస్తున్నోడు
క్రిందపడి హహకారాలు చేశాడు !

ఇప్పుడు నేను
నన్నులా కాకుండ
మన్నులా చేసినోడిని
సాగనంపుతాను !
ఇప్పుడు నేను
నా చేతులతోటే
నా రాతను తుడిపించేసినోడిని
తరిమికొడతాను !

ఇప్పుడు నువ్వూ – నేనూ, మనం
మన భాషలో మాట్లాడుకుందాం !
ఇప్పుడు మనం
మన భాషలో వ్రాసుకుందాం !
ఇప్పుడు మనం
మనదైన ఓ నూతన వ్యవస్థను
నిర్మిద్దాం !

9 అక్టోబర్, 2007, లండన్.
(జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్ ల ‘నిర్ధేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు’ వ్యాస ప్రేరణతో)

కవితలు
12 అభిప్రాయాలు
# C.R.Khanna 01 నవంబర్ 2007 , 4:39 am
చాంధస భావాల మీద కవితాయుధంతో
మెరుపు దాడి ప్రకటించిన
కవి సాంబయ్య గారికి
అభినందనలు.
ఎన్నో సంవత్సరాలుగా
అగ్రవర్ణాలు
నిమ్నజాతి భాషా,సంస్కృతుల మీద
చేస్తున్న అణిచివేతను
ముక్కు సూటిగా ప్రశ్నించిన తీరు అద్భుతం.
ఇప్పటి వరకు
పుస్తకాలు చదివి మాత్రమే
స్పందించి రాసిన కవిత్వం చూసాము.
కానీ ఇలా
ఒక వ్యాసం చదివి స్పందించి
కవిత్వమై ప్రవహించడం
కొత్తగా ఉంది.
చక్కని కవితకు మరోసారి
శుభాకాంక్షలు.

# శ్రవణ్ 02 నవంబర్ 2007 , 8:43 am
అద్భుతం. ఆత్మగౌరవం లేకుండా ఏదీ సాధించలేం. ఖన్నా గారన్నట్టు ముక్కుసూటిగా ప్రశ్నించారు. ధన్యవాదాలు.

# Suresh K Digumarthi 06 నవంబర్ 2007 , 5:15 am
ప్రతీ వాక్యంలోనూ మన జీవితం. ఈ కవిత చదువుతూ వుంటే నేనే మంటయి కాల్చేసినట్టు, ఏనుగై విసిరేసినట్టు, నన్ను నేను నిర్మించుకున్నంత ప్రోత్సాహం కలిగింది. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములమవుదాం. కవి గారికి, రచయితలకు నా ధన్యవాదాలు.

# నాగరాజు 31 జులై 2008 , 2:14 pm
సాంబయ్య గారు మీ కవిత చాల బాగుంది.తరతరాలుగా దలితులను విద్యకు దూరంగా వుంచడమే కాక,వీరు నేర్చిన దొంగల భాషను దలితులకు అంటగట్టడమూ,దలితుల ప్రతిభను వీల్లు ఏర్పరిచిన ప్రమాణాల కింద పాతిపెట్టడం జరిగింది.కానీ నేడు దలితుల ఆత్మగౌరవ ఫోరాటాలు,తమదైన ప్రత్యేక సాహిత్యం హర్షించదగినవి.

# athaluri vijaya lakshmi 10 డిసంబర్ 2009 , 7:10 am
ఎంతోకాలంగా ఎదురుచూసిన పదోన్నతి వచ్చేసింది
నేనిప్పుడు ఆఫీసర్ని యాభైమంది కార్మకులపైన ఆజమాయిషీ
అందులోనూ మహిళా కార్మికులపైన
ఇంకేం ఇంతకన్నా ఏం కావాలి?
మొదటిసారి అధికారహోదాలో ఆఫీసులో అడుగుపెడుతుంటే ఒళ్ళు తెలియలేదు
వాళ్ళందరిచేతా వంచిన నడుము ఎత్తకుండా పని చేయించాల్సిన బాధ్యత నాది
వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ లీవులు, వాళ్ళ జీతభత్యాలు
ఇవన్నిటినీ పర్యవేక్షించాలిసిన బాధ్యతకూడా నాదే
నామీద ఎంత నమ్మకం లేకపోతే ఇంతపెద్ద పదవి ఇస్తారు
ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలాఉంది
కారణం మరో ప్రమోశన్ రావాలికదా
సెంటిమెంట్లు పక్కనపెట్టి అధికార దర్పాన్ని ఆహ్వానించాను
రోజూకన్నా విభిన్నంగా అధికార దర్ఫంతో ఆఫీసులో అడుగుపెడుతుంటే
తమశా అనుభవం
బెదురు చూపులతో, బిక్కు, బిక్కుమంటూ చూస్తూ నమస్కారాలు
మహారాణి వెనకాల చెలికత్తెల్లా నిశ్శబ్దంగా అనుసరిస్తూ వస్తోన్నపాదాలు
తెచ్చిపెట్టుకున్న గంభీరంతో అటెండెన్స్ తీసుకుంటోంటే
ఇరవై ప్రెజంటులు, ముప్ఫై ఆబ్స్ంటులు
సంజాయిశీ అడిగిన అధికారం …..సమస్యల చిట్టావిప్పబోతుంటే వినడానికి తిరస్కరించిన అహం
ముందు ముందు ఆబ్స్ంట్లు అంగీకరించబడవన్న వార్నింగ్
నా కళ్ళల్లో సూర్యకాంతిపూవులా విచ్చుకున్న ఆనందం
వాళ్ళ కళ్ళల్లో కొడిగట్టిన కాంతి తరవాత కనిపించే వి’శాదం
అధికారపొరలకు కనిపించని దైన్యం
సాయంత్రం నా వెనక వాళ్ళందరి కాన్వాయి
రాజు వెడలె రవితేజములలరగ అనుకుంటూ
సెక్యూరిటీ సాయంతో బయలుదేరిన బ్యూరోక్రట్ ల దర్ఫం
ఒళ్ళుతెలియని ఆనందం సహజత్వం కోల్ఫోయిన అధికారం
ఇంతలో కలిగిందో అనుభవం గుండె చెదిరే విశాదం
కడుపుకోసం… కన్నపేగు కోసం మహిళా కార్మికుల వెతలు
గుండెల్ని మెలిపెట్టే కతలు
కాళ్ళూలేని పిల్లలు, మెదడు ఎదగని కూనలు
కాటిన్యం ప్రదర్శించినరోజు బయట పడిన వాస్తవాలు
తాగివచ్చే భర్తలు క’శ్టార్జితం కరిగిస్తూ ఇదేమని అడిగినందుకు
కాళ్ళూ కీళ్ళూ విరగగొట్టే రాక్షసులు
అదిలించినరోజు ఎగసిపడిన గుండెలు
కదిలిస్తే కాలవలైన కన్నీళ్ళు
కదిలితే చెదురుతుందేమోనన్న భయంతో
అధికార పీటంకోసం ప్రదర్శించిన కాటిన్యం
కరిగినీరవుతోంటే కళ్ళముందుకు ఎదురీది వస్తోన్న మానవత్వం

అత్తలూరి విజయలక్షి

Leave a comment

Filed under సామాజిక న్యాయం కోసం

గూడెం నుండి బయట పడండి (Stay away from Culture of Degradation)n

కమ్యూనిస్ట్, నక్సలైట్, హేతువాద, దళిత, స్త్రీవాదులు నడిపిన సామాజిక, సాహిత్య ఉద్యమాలు తెలుగు జాతిని ముఖ్యంగా సామాజిక పీడనకు, రాజకీయ అణచివేతకు, ఆర్థిక దోపిడికి గురైన వర్గాలలో ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిని ఆవిష్కరించాయి. ఈ ఉద్యమాల చైతన్య జవసత్వాల అధారంతో తరతరాలుగా సామాజిక అణచివేతకు, అవమానానికి గురై, అంధకారంలో అలమటించిన మాదిగలు ఏ కులం పేరుతో తాము అవమానించబడ్డారో అదే కులాన్ని భూమికగ ‘దండోరా’ పేరుతో ఒక మహోన్నతమైన సామాజిక ఉద్యమాన్ని నడుపుకున్నారు.

ఊరి చివరకు నెట్టివేయబడి, మానవీయతను కోల్పోయి, భీతితో సిగ్గుతో అవమాన భారంతో ఆలోచనలు లేని పశు పక్ష్యాదుల మాదిరి బ్రతుకీడుస్తున్న కులాల, వాటి సంస్కృతులను ఊరి మధ్యకు, ప్రజా బాహుల్యంలోకి తెచ్చారు. యిలా తేవడం అంటే అవమానింపబడ్డ కులాలకు, కుల జీవన సంస్కృతులకు గౌరవాన్ని ఆపాదింపజేసుకోవడం. అది ఒక సామాజిక చారిత్రక అవసరం. ఆ అవసరాన్ని సాధించడంలో, సామాజిక సమానత్వాన్ని ప్రతిస్ఠాపిత దిశగా దండోర ఉద్యమ కృషి అనన్యం అసమాంజసం. ఈ ఉద్యమ చైతన్యం కులమదాంధుల గర్వానికి చిల్లులు పెడితే, కుల బాధితులకు మనో ధైర్యాన్నిచ్చింది. కులం పేరు చెప్పుకోవడానికి లజ్జతో చచ్చిన ఎందరో ఈనాడు తమ పేర్ల ప్రక్కన కులాన్ని జత పరచుకొని కులానికి వ్యతిరేకంగా నిలబడే సామాజిక నిబ్బరాన్ని కలిగించింది. దండోర ఉద్యమ నాయకులుగా కృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగలు జాతిలోనూ అణగారిన జాతులలోనూ రగిలించిన ఆవేశానికి రేకెత్తించిన ఆలోచనలకు మాదిగ జాతి హృదయ ఫలకాలపైనా, తెలుగు జాతి చరిత్ర గ్రంధ చిఠాలలోనూ ఒక సుస్థిరమైన స్థానాన్ని లిఖింపజేసుకున్నారు.

అయితే, ఈ మధ్య కాలంలో మాదిగల, మాదిగ దండోర నాయకుల ఆలోచన సరళులను, వ్యవహార విషయాలను జాగ్రత్తగా గమనిస్తే రెండు రకాల అనాలోచిత, అసంధర్భ ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి, తెలుగు దేశం, కాంగ్రేసు పార్టీల పదమూడు సంవత్సరాల సుదీర్ఘ వంచన తరువాత కూడా ఒక్కొక్క పర్యాయం యాచిస్తూ, యింకొక్క పర్యాయం బెదిరిస్తూ వాటినే నమ్ముకొని, అంటిపెట్టుకొని వర్గీకరణ కోసం ఎదురు చూడడం. రెండు, సామాజిక చారిత్రక అవసరార్ధం ఊరి మధ్యకు తెచ్చిన ఊరి చివరి బ్రతుకుల చుట్టే తమ జీవిత పోకడలను, ఆలోచనలను అల్లుకుంటూ ఒక కృత్రిమ స్పృహలో బ్రతకడం. ఇదే యింకో రకంగా చెప్పాలంటే, ఊరి చివరి రోదన బ్రతుకులను రొమాంటిసైజ్ చెయ్యటం. జయప్రభ గారి ‘పద పొరపాట్లు చేద్దాం’ (ఆంధ్రజ్యోతి, 2 ఏప్రిల్, 2007) కవితకు స్పందిస్తూ కృపాకర్ మాదిగ గారు వ్రాసిన ‘మా గూడెంలోకి రా’ (ఆంధ్రజ్యోతి, 16 ఏప్రిల్, 2007) గూడెం బ్రతుకులను రొమాంటిసైజేషన్ చేసే ప్రయత్నమే. ఈ వ్యాసంలోని చర్చ రెండవ అంశం మీద కేంద్రీకరించబడింది.

రెండవ అంశంపైన చర్చ ప్రారంభించేముందు మొదటి అంశంపై నా అభిప్రాయం: రాష్ట్రంలో రాజ్యాధికారం కమ్మల అధినేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ; రెడ్ల ఆధిపత్యంలోని కాంగ్రేసు పార్టీల మధ్య అట్ల తద్ధి రోజున యిచ్చి పుచ్చుకునే వాయినంలా వారినుండి వీరికి, వీరి నుండి వారికి మధ్య చేతులు మారినంత కాలం వర్గీకరణ సాధ్య పడదు. రాజ్యాధికారం వీరిరువురుల చేతులనుండి మూడవ చేతికి వెళ్ళే అవకాశం సమీప భవిష్యత్తులో కానరానందున, కనిపిస్తున్న ఒకే ఒక మార్గం రాష్ట్ర వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ ని ‘తెలంగాణ’, ‘ఆంధ్ర’ లుగా వర్గీకరించబడినప్పుడు ‘దళిత రిజర్వేషన్ల వర్గీకరణను’ సున్నితంగా సాధ్యపరచుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ విభజనకి, వర్గీకరణకు గల సంబంధాన్ని మరొక వ్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ఈ వ్యాస దృష్టి రెండవ అంశంపైన సారించడానికి రెండు కారణాలున్నాయి. కృపాకర్ కవిత ఒక కారణమయితే, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం మాదిగ పరిశోధనా విద్యార్ధుల రచనలు మరొక కారణం. దండోరా ఉద్యమ తొలి రోజుల్లో ఈ విశ్వ విద్యాలయం మాదిగ సాహిత్యానికి మజిలీ. కీర్తి శేషి నాగప్పగారి సుందరరాజు గారి అధ్యక్షతన ‘మాదిగ సాహిత్య వేదిక’ ని స్థాపించుకొని యుతులు కత్తి కళ్యాణ్ చంద్ర, కొలికపూడి శ్రీనివాస రావు, డా. దార్ల వేంకటేశ్వర రావు, డా. కట్టెపోగు సురేష్ గార్లు యింకా ఎందరో మాదిగ మేధావులు, విద్యార్థులు మాదిగ జాతి, దాని సంస్కృతిపైన కొన్ని విలువైన సంకలనాలు వెలువరించారు. ఆ రోజున వారు వెలువరించిన సాహిత్యం ఒక చారిత్రక అవసరం. అనాటి చారిత్రక అవసరం ఈనాడు లేకపోయినప్పటికీ విశ్వ విద్యాలయంలో ఎందరో మాదిగ రీసర్చ్ స్కాలర్ లు (విశ్వ విద్యాలయం బయట ఎందరో) ‘చెప్పు, డప్పు’ అంశాలు ప్రధానంగా పుంఖాను పుంఖానులుగా కవిత్వాలు వ్రాయడం.

చారిత్రక అవసరత, సామాజిక ప్రయోజనం కానరాని వీరి వర్తమాన రచనలను ముఖ్యంగా కృపాకర్ ఆలోచనాభిప్రాయాలు కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జాతి నాయకుడిగా అతను వ్యక్త పరచిన అభిప్రాయాలు అతని జాతి జనుల ఆలోచనలపైన, వారి ఆలోచన విధానంపైన ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఈ ఆలోచనలే వారి జీవిత దిశని – దశని నిర్ధేశిస్తాయి. అట్టి ఆలోచనలు ఆ జాతి జీవన గమనానికి కర దీపాలు కావచ్చు – కర దూపాలూ కావచ్చు. ‘మా గూడెంలోకి రా’ కవితలో వ్యక్తం కాబడ్డ ఆలోచనను ఒక నమూనాగా తీసుకుని, మాదిగల ప్రగతికి అడ్డుగా నిలిచే ఈ ఆలోచన విధానం నుండి బయట పడవలసిన సామాజిక చారిత్రిక అవసరతను చెప్పడం ఈ వ్యాసంయొక్క ప్రధాన ఉద్ధేశం. ఈ ఉద్ధేశాన్ని వివరించే నిమిత్తం రెండు అంశాలను ప్రధానంగా స్వీకరించి రెండు స్వతంత్ర భాగాలలో వానిని చర్చించడం జరిగింది. మొదటి భాగంలో గూడెం రొమాంటిసైజేషన్ ఏ విధంగా మాదిగల ప్రగతికి ప్రతిబంధకం అవుతుందో చెప్పబడింది. గూడేం రొమాంటిసైజేషన్ కుల వ్యస్థను పరోక్షంగా ఏ విధంగా పటిష్టపరుస్తుందోనన్నది రెండవ భాగంలోని చర్చాంశం. ముగింపుగా కాలంతో పొంతనలేని, తిరోగామ ప్రేరకమైన రొమాంటిసైజేషన్ మానుకొని, వర్తమానంలో ప్రపంచీకరణ తెచ్చిన మార్కెట్ వ్యవస్థలోకి, ఆధునిక వృత్తులలోకి మాదిగల ప్రవేశంపై దృష్టి పెట్టవలసినదిగా నివేదించడం జరిగింది.

గూడె సంస్కృతి రొమాంటిసైజేషన్ ఎటు దారి తీస్తుంది?

గూడెం జీవితానికి, దాని చుట్టూ అల్లుకున్న జీవన సంస్కృతికి ఔన్నత్యాన్ని ఆపాదించుకునే నిర్మాణాత్మక చర్య అనే మిథ్యలో కృపాకర్ గూడెంలోని వివిధ వాసనల (మన్ను వాసన, పసరు వాసన, చెమట వాసన) గురించి, పలు రకాల భోజనాల ( కాల్సిన ఈరిగెలు, దొబ్బల సియ్యల కూర, సంకటి ముద్దలు, పుల్ల నీళ్ళు, రొయ్యల కారం ) గురించి, చంటి పిల్లలు వారి ఆట పాటల (సీమిడి బుగ్గలు, లల్లాయి పాటలు, మూకుడు తప్పెట్లు) గురించి, యింకా ప్రకృతికి దగ్గరగా ఉండే స్వేచ్చా జీవితం గురించి, గూడెంలోని మనుష్యుల మధ్య పరిఢవిల్లే సహాయ సహకారాల గురించి ఎంతో హుందాగా చెప్పుకున్నారు. ఒక విధంగా అధునిక జీవన ఆరాటంలో అలసిపోయిన బయటివారు గూడేనికి వెళితే మనసుకు స్వాంతన కలుగుతుందని భావించేటట్లుగా, గూడెంలోనివారు ‘నిజంగా మాజీవితాలు అంత మధురంగా ఉంటాయోమోననే’ విశ్వాసం కలిగేంతగా రొమాంటిసైజ్ చెయ్యడం జరిగింది.

అయితే, యిటువంటి రొమాంటిసైజేషన్ కవి ఆశించిన ఫలితాన్ని సాధించకపోగా అది గూడేలలో ఉండే మాదిగ ప్రజలకు తిరోగామ ప్రేరకమవుతుంది. యిది ఎలాగో చెప్పేముందు కొన్ని ‘కామన్ సెన్సె’ ప్రశ్నలు అడుగుతాను. నగర నాగరికతలో ఎన్ని అగ్రహారాలున్నాయి? అధునిక ఆర్థిక వ్యవస్థలో, ఉద్యోగ వత్తుడులలో ఎంత మంది బ్రాహ్మణులు ‘మంత్రాల కట్టుబాట్ల కట్లు మడులలో’ బ్రతుకుతున్నారు? ‘సంకటి ముద్దలు, పుల్ల నీళ్ళు, ఎండు తలకాయల కారం, సింతాకుపొడి రొయ్యల కారం’ – యిదే కదా గూడెంలో దొరికే భోజనం! ‘గొప్ప భోజనం’ అని చెప్పుకోవడానికి ఏముంది యిందులో ‘గొప్ప’? అసలు ఎందరు మాదిగలు ఈనాడు సంకటి ముద్దలు తిని బ్రతుకుతున్నారు? ఒక వేళ బ్రతుకుతున్నా, ఆ సంకటి ముద్దల రుచి వలనా లేక, పప్పు భోజనాలు, బెండకాయ వేపుళ్ళు, దొండకాయ యిగుర్లు, కోడి మాంసాలు, వేట పలావులు వండుకు తినే ఆర్థిక స్ఠోమత లేకనా? చంటి పిల్లలకు చీమిడి వస్తే శుభ్రం చేస్తారా లేక, అదేదో అమూల్యమైన పదార్ధంలా అలాగే ఉంచుతారా? ‘మా పిల్లల చీమిడి మాకు ముద్ధు’ అని వితండవాదం చేస్తే, ఆ చీమిడి మీద ఈగలు వాలి చంటి పిల్లల ఆరోగ్యంతో పాటు పరిసరాల ఆరోగ్యం కూడా నాశనం చేయడం కాదా? యింకా, చీమిడి పాముకున్న బుగ్గలతో మూకుడు తప్పెట్లు వాయిస్తూ లల్లాయి పాటలు పాడే బదులు పరిశుభ్రమైన స్కూల్ యూనిఫాంలో పాలుగారే బుగ్గలతో ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ‘ (లేదా యింకేదైనా) అని అన్ని కులాలవారి పిల్లలలాగా మాదిగ బుజ్జి తల్లులు – మాదిగ బుజ్జిగాళ్ళు పాడుతుంటే చూడాలనే ఆశ – ఆకాంక్ష మాదిగలకు కలగదా? ‘కుక్కలకు బొక్కలెయ్యడం, కోడికి గింజలెయ్యడం, దూడకి మేతయ్యడం, పిల్లికి ముద్ధెయ్యడం’ – లాంటివి గూడెం వాళ్ళే చేస్తారా లేక, యితరులు కూడా చేస్తారా? ఒక వేళ గూడేం వాళ్ళు మాత్రమే చేస్తారనుకుంటే – ఈ పనులకు పరిమితమవ్వడమేనా గూడెం మనుష్యుల జీవితం, ఆ జీవితార్థం? – యివి సాధారణ ప్రశ్నలు. అయితే, ఈ సాధారణాలే గూడే జీవితాన్ని ఆకళింపు గావించే సాధనాలు.

గూడెం రొమాంటిసైజేషన్ ఏ విధంగా తిరోగామ ప్రేరణోనని ‘ఆకాక్ష ‘ అనే ఒక భావన, ‘ప్రపంచీకరణ’ అనే ఒక సంధర్భం అసరాగా చర్చించే ముందు కవితలో పొడవడిన ఒక అపసవ్యం గురించి, కవితలో అలోచనను సంగ్రహంగావించే ఒక సైద్ధాంతికపర అంశాన్ని క్లుప్తంగానైనా మాట్లాడవలసి ఉంది. మనిషి చేసే ప్రతి పనికి ఒక హేతువుంటుంది. కాని కుల సమాజంలో హేతువు లేకుండా చేసే పనులలో ముఖ్యమైన పని స్వకుల స్తుతి పరకుల నింద. కవితలో బ్రాహ్మణులపై వ్యక్తపరచబడిన అసహ్యం ఈ ధోరణినే ప్రతిబింబిస్తుంది. ‘మాదిగ దండోరా: ఏడు వ్యాసాలలో’ ఉధ్ఘాటించిన ఉన్నాతాభిప్రాయాలతో పోలికే లేని ‘మా గూడెంలోకి రా’ కవితలో ధ్వనించిన కుల స్వరం నన్ను విచారగ్రస్తుడిని చేసింది. బ్రాహ్మణులపై వ్యక్తపర్చిన ఈ అసహ్యం మాదిగల ఔన్నత్యాన్ని ఏ విధంగా ప్రకాశవంతం గావిస్తుందో అర్ధం కాదు! మాదిగ కులంలో పుట్టడం మాదిగల తప్పు ఎలాకాదో బ్రాహ్మణ కులంలో పుట్టడం కుడా బ్రాహ్మణుల తప్పు కాదు. తప్పు పట్టవలసింది, అసహ్యించుకోవలసింది ఆ మనుష్యులకు వారు ఫలానా కులానికి చెందిన వారని నమ్మేటట్లు గావించిన కుల వ్యవస్థ భావజాలానిది. ‘బ్రాహ్మణులపైన కాదు – బ్రాహ్మణ భావజాలంపైన మా పొరాటం’ అని అంబేద్కర్ చెప్పినా, ‘పురుషులపై కాదు – పురుషాధిక్య వ్యవస్థ పై మా పొరాటం’ అని జయప్రభ (డా. యస్.వి. సత్యనారాయణ. (సంపా.), 1997. ‘స్త్రీవాద వివాదాలు.’ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, పే. 113-120) చెప్పినా ఒకటే సారంశం: ‘మనుష్యులపైన కాదు. మనుష్యులను మనుష్యులుగా గాక ఆధిక్యత గలవారుగా, ఆధిక్యత లేనివారుగా తయారు చేస్తున్న వ్యవస్థలు, వాటి భావజాలాల పైనే పోరాటం’. ఈ విషయంలో కృపాకర్ నాతో ఏకిభవించకపోవడానికి ఎటువంటి కారణం ఉండదని ఆశిస్తాను.

సైద్ధాంతికపర ఆలోచన:
సాధారణంగా ప్రతి వ్యక్తి తన ప్రాధమిక అవసరాలు (భోజనం, వస్త్రం, నివాసం) తీర్చుకున్న తరువాత చేపట్టే పని (పనులు) రెండు విషయాల ఆధారంగా చేస్తాడు. ఒకటి, ఏదేని ఒక పనిని లేదా ఒక విషయాన్ని ‘గొప్పదిగా’ తాను స్వయంగా నమ్మినపుడు; రెండు, సమాజంలో తాను గొప్పవారు అనుకున్నవారు చేసిన, చేస్తున్న పనుల ద్వారా. అంటే, వారు గొప్పవారు కాబట్టి వారు చేసే పనులు కూడా గొప్పవని భావించడం. విషయాలకు (లేదా వ్యక్తులకు) ఒక్కసారి ‘గొప్పతనం’ ఆపాదించిన తరువాత వ్యక్తి ఆలోచనలు ఆ గొప్ప విషయం చుట్టూతే పరిభ్రమిస్తాయి. ఆ మేరకు ఆ వ్యక్తి అలోచనలు యితర విషయాలవైపు మళ్ళడం అరుదుగా జరుగుతుంది. ఈ అలోచన అధారంగా ‘గొప్పతనం’, ‘ప్రయోజనం’ లేని విషయాలకు ‘గొప్ప’ అపాదించుకోవడం వలన అట్టి చర్యలు వ్యక్తులలో గొప్ప విషయాలను సాధించాలనే ‘ఆకాంక్షను’ ఎలా అదిమిపెడతాయో క్రింద చెప్పడం జరిగింది.

ఒక మనిషిగాని, ఒక సమాజంగాని లేదా ఒక దేశంగాని ప్రగతి సాధించాలంటే అందుకు ముందుగా కావలిసిన ముడి సరుకు ప్రగతి సాధించాలనే ‘ఆకాంక్ష’. ఒక స్కూటరో, ఒక కారో నడవడానికి చమురు ఎలా అవసరమో, మనిషి చలనానికి ఆకాంక్ష అంతే అవసరం. చమురు లేకుంటే మోటారు యంత్రం నడవనట్లే ఆకాంక్ష లేకుంటే మనిషి యంత్రం కూడా నడవదు. అంటే మనిషి చలనానికి చమురుగా పనిచేసేదే ఆకాంక్ష. ఊరి చివరకు నెట్టివేయబడ్డ వారు ఊరి మధ్యకు రావాలనే ఆకాంక్ష ఉండబట్టే శతాభ్దాలుగా అణిచివేతకు గురికాబడ్డవారి అరాటాలూ పోరాటాలు. కాని, ఈ రోజున బయటి వారిని గూడెంలోనికి రమ్మనే ఆలోచన , గూడెంలో ఉన్న వారిని గూడెంలోనే ఉండి పొమ్మనే భావన, సంకటి ముద్దల గురించి, రొయ్యపొట్టు కారాల గురించి గొప్పగా చెప్పుకోవడమంటే – గూడెం గుడిసెలలోఉన్నవారు గృహాలలోనికి మారాలనే, రుచికరమైన ఆరోక్యకరమైన భోజనాలు చెయ్యాలనే ఆకాంక్షలు లేకుండా చేయడమే. అభివృద్ధికి నోచుకోని వ్యక్తులుగాని, కులాలుగాని అభివృద్ధి చెందిన వ్యక్తుల, కులాలకు మించి లేదా, కనీసం వారి చందంగానైనా ఎదగాలనే ఆకాంక్ష, చైతన్యం కావాలి. కాని గూడెం రొమాంటిసైజేషన్ యిప్పటివరకు అంతో – యింతో సాధించిన ప్రగతిని కూడా కాలదన్ని కాలం వెనుకకు మళ్ళించే తిరోగామ ప్రేరణ. ఇంకా చెప్పాలంటే, రొమాంటిసైజేషన్ లాజిక్కు ఎంతవరకు దారి తీస్తుందంటే ఒకానొకప్పుడు గూడెంలోని మగవారి మొలలకు గోసిగుడ్డలు మాత్రమే ఉండేవి. కాబట్టి యిప్పుడు గూడెంలో ఉంటున్న మగవారు కూడా గోసెలే కట్టుకోండి – అనేంతవరకు.

ప్రపంచీకరణ సందర్భం:
ప్రతి సమాజంలో అభివృద్ధి చెందిన – చెందని రెండు వర్గాలు (వాంఛితం కాకున్నా) ఉంటాయి. అభివృద్ధి చెందిన వర్గాలే కాల క్రమేణా ఆధిపత్య వర్గాలుగా రూపాంతరం చెందడం కూడా జరుగుతుంది. అభివృద్ధి చెందే దశలో కాల మాన పరిస్థితులు, సంధర్భాలు అందించే అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందడం జరిగితే, అభివృద్ధి చెందిన పిదప అవకాశాలను తాము మాత్రమే పొందే విధంగా వ్యవస్థలను రూపొందించుకొని ఆధిపత్య వర్గంగా (వర్గాలుగా – కులాలుగా) వ్యవస్థాపితం చేసుకోవడం జరుగుతుంది. మన చర్చ అభివృద్ధికి నోచుకోని మాదిగల గురించి గాబట్టి ‘ఆధిపత్య’ అంశాన్ని ప్రక్కన ఉంచుదాం. ఇప్పుడు మనం ఉంటున్న కాల సందర్భం మార్కెట్టు చుట్టూ పరిభ్రమిస్తున్న ప్రపంచీకరణ. మార్కెట్లో ప్రతి వస్తువుకి ఓ వెల ఉన్నట్లే ఈ ప్రపంచీకరణ వ్యవస్థలో ప్రతి వ్యక్తికి ఓ ధర ఉంటుంది. ఆ ధర రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకొని నిర్ణయించబడుతుంది: వ్యక్తి నైపుణ్యత, ఆ నైపుణ్యాన్ని విక్రయించి దానితో లాభాలు గడించగలిగే తీరు. ఇక్కడ ఒక అవ్యక్తమైన అంశం ఉంది. లాభాలు గడించగలగడమంటే వ్యక్తి తన నైపుణ్యతతో వస్తువు తయారు చేసినప్పటికినీ ఆ వస్తువును కొనే మార్కెట్టు (జనాభా) కూడా ఉండాలి. అంటే ఆర్థిక శాస్త్ర పరిభాషలో ‘సరఫరాతో పాటు గిరాకి కుడా ఉండాలి.’ గిరాకి లేని వస్తువును ఏ వ్యాపారి తన కొట్టులో ఉంచి అమ్మనట్లే, అమ్మబడలేని, లాభాలు గడించలేని ఏ నైపుణ్యానికి ప్రపంచీకరణలో స్థానం లేదు.

అయితే, ‘మార్కెట్లో అమ్ముకొనేందుకేనా వ్యక్తి నైపుణ్యత? ఒక్కొక్క పర్యాయం నైపుణ్యతను మనుష్యులు ఆత్మ సంతృప్తి కొరకు సాధిస్తారు’. ఈ వాదన ఎల్లరకు తెలిసినదే. ఆత్మ సంతృప్తి ఆర్ధికంగా స్థిరపడిన వారికి – అసలు ఆర్ధికతే లేనివారికి ఆత్మ సంతృప్తి పొందాలనే ఆరాటం ఎక్కడనుండి కలుగుతుంది? రెక్కాడితేగాని డొక్కాడని మనుష్యులకు ‘ఆత్మ సంతృప్తి’ అనే ఓ అందమైన భావన ఒకటుందని, ఆ భావనను సాక్ష్యాత్కరింపజేసుకోవచ్చుననే ఆలోచన ఎక్కడనుండి పుడుతుంది? ఇటువంటి అకడమిక్ ఆలోచనలు మన చర్చను ఏ దరికి చేర్చవు, కాబట్టి ఈ వాదనలను ప్రక్కన ఉంచుదాం.

ప్రపంచీకరణ జరగడానికి ముందే లాభదాయకమైన మాదిగ చెప్పుని అభివృద్ధి చెందిన కులాలు చెప్పుల ఫ్యాక్టరీలు స్థాపించి హస్తగతం చేసుకోగా, ఆధునిక సాంకేతికత (రేడియో, టి.వి., యాడ్ ఏజెన్సిలు మొదలైన వాటి రూపాలలో) మాదిగల దండోరా పనిని సాంకేతిక నైపుణ్యత సాధించిన కులాల స్వంతం చేసింది. కుల వృత్తులు కోల్పోయి, ఆధునిక వృత్తులకవసరమైన నైపుణ్యాన్ని సాధించుకోలేక మాదిగ బ్రతుకులు ఎప్పుడో శుష్కించుకుపోయాయి. యిప్పటి మార్కెట్టు సమాజంలో పురాతన కాలంనాటి మాదిగ చెప్పుకి మార్కెట్టు లేదు. లేని మార్కెట్టుని సంపాదించుకోవాలంటే ప్రస్తుతం చెప్పుల తయారీలో ప్రసిద్ధి పొందిన బాటా, కరోనా లాంటి సంస్థల కంటే మన్నికగా, ఆ సంస్థలు అందించే ధరలకంటే (కనీసం వాటి విధంగానైన) తక్కువకి మాదిగలు చెప్పులు తయారి చేయాలి. అలా చేసిన రోజు మార్కెట్టులో వారి చెప్పుకి గిరాకి దొరుకుతుంది. అయితే, అలా మన్నికగా తయారుచేసి, చవుక ధరలకు విక్రయించగల సాంకేతిక నైపుణ్యం, ఆర్ధిక సంపత్తి – రెండూ మాదిగల దగ్గర లేవు. మాదిగల డప్పు పరిస్థితి కూడా వారి చెప్పు స్థితికంటే భిన్నంగానేమి లేదు. సాంప్రదాయ, జానపద, సాంస్కృతిక కళల ప్రోత్సాహం పేరుతో ఆ కళలే పెట్టుబడిగా నగరాలలో వ్యాపారం చేస్తున్న సాంస్కృతిక సంస్థల సంస్థానాలలో పలు కులాల కళా రూపాలలో మాదిగ డప్పు ఓ రూపం. లేదా ఎన్నికలప్పుడు, ఎన్నికలులేనప్పుడు పలు రాజకీయ పార్టీలు జరుపుకునే మహానాడు, మిని మహానాడులలో అనేకానేక ప్రజాకర్షక సాధనాలలో ఓ సాధనం మాదిగ డప్పు. అంతకు మించి తమ డప్పు ద్వారా మాదిగలు రువ్వుకుంటున్న రూకలేమీ లేవు.

ఆర్ధిక ప్రయోజనం లేని డప్పులను – చెప్పులను నెత్తికెక్కించుకొని కడుపులు మాడ్చుకోవడంకంటే వాటిని అటకలకెక్కించడం జరగాలి. ప్రత్యామ్నాలు ఆలోచించించడంతోపాటు, ఆధునిక వృత్తులలో నైపుణ్యతను సాధించే మార్గాలను అన్వేషణ చేసి బక్కచిక్కిన బ్రతుకులను బలోపేతం చేసుకోవాలి. పైన పేర్కొన్నట్లుగా అభివృద్ధి కాల సంధర్భాలు అందించే అవకాశాలను అందుకోవడంలో, అందుకోవాలనే ఆలోచనలలో, ఆకాంక్షలలో ఉంది. అంటే కాలానుగుణంగా తమను తాము సంస్కరించుకొని మార్పు చెందటంలో వ్యక్తుల, సమూహాల లేదా కులాల అభివృద్ధి అధారపడిఉంది. అలా జరగనినాడు చెరువులోని పాత నీరు పోయి కొత్త నీరు రాకుంటే ఆ పాత నీటికి పాచి పట్టి కొంత కాలానికి మురుగుగా మారడం ఎంత సత్యమో, మారని మనుష్యులు వారి ఆలోచనలకు తెగులు పట్టి కాల క్రమంలో భ్రష్టు పట్టడం కూడా అంతే సత్యం. మాదిగలు కాలంతో మారకుండా డప్పు, చెప్పు, గూడెం – దాని సంస్కృతి అంటూ సాంస్కృతిక విషయాలచుట్టూ తమ ఆలోచనలను పరిభ్రమింపజేసుకుంటూ కాలంతో (తమ వర్తమానంతో) పొంతనలేని సృహలోకి తమను తాము జోకొట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సాంస్కృతిక అంశాల ఆవశ్యకతను నేను తక్కువ అంచనా వెయ్యడం లేదు. కాని మాదిగలకున్న శతకోటి సమస్యలను ఏక కాలంలో పరిష్కరించుకోవాలనే ఆలోచన, వారికున్న మేధా సంపత్తి, ఆర్ధిక స్థితిగతుల పరిమితుల దృష్ట్యా సరికాదు. ఉన్న వనరులు వినియోగించి నూతన వనరులు సాధించుకోవాలంటే సమస్యల ప్రాధాన్యతననుసరించి వనరులను కేటాయించుకొని ఆ దిశగా కృషి చేయాలి. కాని అలా జరుగకుండా గూడెపు రోదన బ్రతుకులను, గతించిన వృత్తులను రొమాంటిసైజ్ చెయ్యడం జరుగుతుంది. అట్టి రొమాంటిసైజేషన్ అభివృద్ధి సాధనకు కావలసిన ఆలోచనలను ఏ మాత్రం రేకెత్తించక పోగా, సాధించాలనే ఆలోచనల పొంగు మీద నీళ్ళు జిలకరిస్తుంది.

హిందూ మతం కోరుకునేదేమెటి?
గూడెం రొమాంటిసైజేషన్ మార్కెట్ వ్యవస్థలో మాదిగలను మాంద్యులుగా మార్చడమేగాక, హిందూ మత పునాదైన కుల వ్యవస్థకు పరోక్షంగా ద్వార పాలకులుగా మారుస్తుంది. అంటే, గూడెం రొమాంటిసైజేషన్ కుల వ్యవస్థను పరోక్షంగా పటిస్టపరుస్తుంది. ఇలా పటిష్టం కావడమే హిందు మతం కోరుకునేది. ఈ విషయాన్ని కృపాకర్ ప్రస్తావించిన రొయ్యపొట్టు కారం, ఈ మధ్యనే జరిగిన ‘దళిత గోవిందం’ ల అధారంతో ‘డిడక్టివ్ మెథడ్’ లో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

గూడె జీవన సంస్కృతి రొమాంటిసైజేషన్లో భాగంగా కృపాకర్ రొయ్యపొట్టు కారం గురించి గొప్పగా చెప్పుకుంటాడు. హిందూ మతానికి కావలిసింది కూడా ఈ రొమాంటిసైజేషనే. ఎందుకంటే, గూడెం జనం రొయ్యపొట్టు కారం గురించి ఆలోచించినంత కాలం – రొయ్యల గురించి ఆలోచన రాదు. రొయ్యల గురించి ఆలోచన రానంత వరకు, రొయ్యల చెరువులు గురించి ఆలోచన రాదు. రొయ్యల చెరువుల గురించి ఆలోచన రానంత కాలం – ఆ చెరువులు వాటి యాజమాన్యం ఆధీనంలోకి ఎలా వెళ్ళాయనే ఆలోచన రాదు. ఆ యాజమాన్యం గురించి ఆలోచన రానంత కాలం – ఆ యాజమన్యాన్ని ఉత్పత్తి, పునరుత్పత్తి చేసే సామాజిక, అర్ధిక, రాజకీయ రంగాలలోని అసమానత్వ చిట్టాల చిక్కుల ఆలోచన రాదు. ఆ ఆలోచన రానంతవరకు గూడెపోళ్ళు గూడెం దాటి బయటకి రారు. వారు గూడెం దాటి బయటకి రాకుండా ఉండడమే హిందు మతానికి కావాలి. అందుకు ఏమి చేయడానికైనా, చివరకు దేవుడ్ని గుడి నుండి గూడేనికి తీసుకు వెళ్ళడానికైనా సంసిద్ధం. మొన్న జరిపిన ‘దళిత గోవిందం’ కూడా ఈ కోవకి చెందిదే.

హిందువేతర మతాల సమానత్వ భావధారలతో సామాజికంగా అణచివేతకు గురికాబడిన కులాలలో వచ్చిన చైతన్యాన్ని నీరుగార్చేందుకు, మతం మార్చుకున్న వారిని తిరిగి తనలో కులుపుకునేందుకు చరిత్ర పొడవునా హిందు మతం చేస్తున్న శతకోటి గారడులలో, మల్లెపల్లి లక్ష్మయ్య గారు అన్నట్లు, ‘దళిత గోవిందం’ ఓ గారడీ! (ఆంధ్రజ్యోతి, 22 ఏప్రియల్, 2007) తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో, యింకా రాష్ట్రంలో క్రైస్తవం పుంజుకుంటుంది. కాబట్టే హిందు మతానికి అకస్మాత్తుగా దళితులు గుర్తుకు రావడం జరిగింది. అంటే ఉత్తరాదిలో ఇస్లాం లేకుండా హిందు మతానికి దళితులు గుర్తుకురానట్లే దక్షిణాదిలో క్రైస్తవం లేకుంటే దళితులు గుర్తోచ్చేవారు కాదు. మరో విధంగా చెప్పాలంటే, హిందువేతర మతాల ప్రాభవంలో తన ప్రాభల్యాన్ని కోల్పోకుండా ఉండడం కోసమే ఈ ‘దళిత గోవిందం’ గాని, శతబ్ధాలుగా ‘అంటరానివారి’ నవస్వప్నం ‘దళిత వసంతం’ కోసం మాత్రం కాదు.

అయితే, “విగ్రహాన్ని దళితుల దగ్గరకు తీసుకు వెళ్ళడం వలన హిందు మతానికి ఒనగూరే ప్రయోజనమేమిటి?” ఈ ప్రశ్నకు సమాధానమే మనం పైన చెప్పుకున్న గూడెం రొమాంటిసైజేషన్ కుల వ్యస్థను ఏ విధంగా పటిస్టపరుస్తుందో చెబుతుంది. దళితులు కూడా సమాజంలో భాగమని, సమానత్వం కలవారని హిందువులు నమ్మినట్లయితే వెంకటేశ్వర విగ్రహ దర్శనార్ధం దళితులను ఆయన ఆలయానికి అహ్వానించి ఉండేవారు. అలాగాక విగ్రహాన్ని దళితుల గూడేలకు, పేటలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇది అంత ఆలోచన లేని, సాధుపూరితమైన (ఇన్నోసెంట్ ) చర్య కాదు. ఈ దేశ సంపదలపై, సామాజిక వనరులపై (దేవాలయం సామాజిక వనరులలోని భాగం) దళితులకూ సమాన హక్కు ఉందని అంగీకరించక పోవడం ఒక కారణమైతే, దళితులు ‘హిందువుల లాంటి’ మనుష్యులు కాదని భావించడం మరొక కారణం. ఈ రెండవ అంశాన్ని మనం కొంత విడమర్చి చెప్పుకోవాలి. ‘దళితులను మనుష్యులుగా’ గుర్తించడం వేరు, ‘దళితులు కూడా తమలాంటి మనుష్యులు’ అని గుర్తించడం వేరు. మరో రకంగా చెప్పాలంటే, ‘దళితులను దళిత మనుష్యులుగా’ గుర్తించడం వేరు, ‘దళితులు తమతో సమానత్వం కలిగిన మనుష్యులుగా’ గుర్తించడం వేరు. ‘దళితులు తమలాంటి మనుష్యులే’ అని హిందువులు గుర్తించినట్లయితే వారిని దేవాలయంలోకి అహ్వానించి ఉండేవారు. కాని, అలా గుర్తించక ‘కేవలం దళిత మనుష్యులు ‘ అని మాత్రమే గుర్తించడం వలననే విగ్రహాన్ని దళితుల దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్ళడమంటే గూడెంలో ఉన్నవారిని గూడెంలోనే ఉండమని లేదా, దళితులను దళితులుగానే ఉండమని!

ఇంకొంత వివరణగా చెప్పాలంటే, చీకటి ఉంటేనే పగటి విలువ తెలుస్తుంది. వేసవి వేడిమి చురుకు తగిలితేనే పండు వెన్నెల హాయి తెలుస్తుంది. చీకటిలో, శిధిలావస్థలలో మగ్గి మృగ్యమైపోతూ, రోదిస్తున్న దళితులు తమకళ్ళెదురుగా ఉంటేనే హిందువులకు తమ జీవితాలలో వెల్లి విరుస్తున్న ఆనందమయాలు, యితరుపై తమ ఏలుబడి – నియంత్రణాధిపత్యాలు తెలిసేది. వీరు విలాసం పొందాలంటే వారిని విలాపానికి గురి చెయ్యాలి. అందుకోసం వారిని గుడులలోకి రానివ్వరు, గూడేలనుండి బయటకి పోనివ్వరు. ఇలా గూడేలలో, పేటలలో, పాళేలలో – ఎవరి ‘స్థానంలో ‘ వారిని ఉంచడమే హిందు మత ఆధిపత్యానికి, గర్వానికి కారణాలు. గర్వం కృత్రిమమే కావచ్చు. కాని, అది కృత్రిమమా (నెగెటివ్) లేక, వాస్తవమా (పాజిటివ్) అనే విషయాలతో దానికి నిమిత్తం లేదు. కృపాకర్ చెప్పుకుంటున్న గూడెం, యితర మాదిగలు పొగుడుకుంటున్న చెప్పులూ డప్పులూ గూడేన్ని, వర్తమానంతో సంబంధంలేని దాని సంస్కృతిని మాదిగల హృదయాలలో పటిష్టపరుస్తాయి. అలా పటిష్టపరచడమంటే కులాన్ని మరింత పటిష్టపరచడం, తద్వారా దళితులను మానుషత్వానికి దూరం చేసిన హిందు మతాన్ని మరింత పెంపొందించడం. కులాన్ని పటిష్టపరచుకోవడం ఆధిపత్యానికి ఆరాటపడే హిందూ మతానికి అవసరం. కులబాధితులు, సమసమాజ కాంక్షితులైన మాదిగలకు కాదు.

ముగింపు:
గ్రామాలు కులవ్యవస్థ కంచు కోటలు. దళితులు గ్రామాలలో ఉన్నంత కాలం కులం వారిని వెంటాడి వారి భౌతికాభివృద్ధితోపాటు మానసిక వికాసానికి కూడా అడ్డుకట్టలు పరుస్తుంది. కాబట్టి ‘గ్రామాలు వదిలి పట్టణాలకు తరలండి’ అని అంబేద్కర్ ఏనాడో పిలుపునిచ్చాడు. ఈ పిలుపు రెండు కారణాల వలన యివ్వడం జరిగింది. ఒకటి, ఆర్థికశాస్త్ర వేత్త అయిన అంబేద్కర్ రాబోయే కాలంలో పట్టణాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు అని అనాడే గ్రహించి ఆ రాబోయే అభివృద్ధిలో దళితులను భాగస్వామ్యులుగా చేసేందుకు. రెండు, గ్రామాలలో కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న కుల వృత్తుల శృంఖలాలనుండి దళితులను విముక్తి గావించి ఆధునిక వృత్తులలో వారిని రాణింపజేసేందుకు. ఆ వృత్తులలో దళితులు రాణించాలంటే అందుకవసరమైన విద్యను, నైపుణ్యతను వారు పెంపొదింపజేసుకోవాలి. అలా పెంపొదింపజేసుకొనిననాడు తర తరాలుగా హిందు కుల వ్యవస్థ తమపై రుద్ధిన ఆత్మ న్యూనతా భావాన్ని అధిగమించి ఆ వృత్తులలో దళిత యువత సగర్వంగా ప్రవేశించడానికి అవకాశం ఉంది. నాడైన, నేడైన మాదిగలు, యితర దళితులు చెయ్యవలసిన పని గూడేలనుండి, పేటలనుండి బయట పడటం. ఆధునిక వృత్తులలోకి ప్రవేశించి కులాన్ని దుర్భలను చేసి, క్రమంగా ఆ వ్యవస్థను నిర్మూలించడం. యిలా చెయ్యడం మాదిగలతో పాటు కుల బాధితులు, సమ సమాజాన్ని కాంక్షించే వారందరి భుజ స్కంధాలపైనున్న చారిత్రక సమిష్టి బాధ్యత. అయితే, అరుదుగా తమ వర్తమాన జీవితాలతో సంబంధమున్న చెప్పు, డప్పు, గూడెం విషయాల రొమాంటిసైజేషన్ మాదిగలను ఈ చారిత్రక బాధ్యతనుండి ప్రక్కదారి పట్టించి ఒక కృత్రిమ స్పృహలోనికి జోకొట్టడమేగాక, హిందువుల హోమగుండంలో వారు ఆజ్యంగా మారెందుకు ఆయత్తం చేస్తుంది. నడుస్తున్న మార్కెట్ వ్యవస్థలో వస్తువులైనా, సంస్కృతులైనా ఎవరికీ చెందవు. కేవలం వినియోగించుకునే వారికే చెందుతాయి. అంటే, తొడిగేవాడిదే చెప్పు, కొట్టేవాడిదే డప్పు. ఏనాడో పరాధినంపాలై, వర్తమానంలో ఏ విధంగానూ ఆర్ధిక ప్రయోజనకారి కాని నాటి మాదిగ కుల వృత్తులను విడనాడి ఆధునిక వృత్తులలో నైపుణ్యత సాధించి మార్కెట్లో ప్రవేశించే మార్గాలను వెదకాలి. అందుకిప్పుడు మాదిగలు (వీరితో పాటు యితర దళితులు) వేసుకోవలసిన ప్రశ్నలు: మారిన ఆర్ధిక రంగ అవసరాల రీత్యా నేర్వవలసిన సామర్ధ్యం ఏమిటి? ఆ సామర్ధ్యాన్ని సాధించేది ఎలా? ఆ సామర్ధ్యం ఆధారంగా గ్లోబలైజెడ్ వృత్తులలో స్థానాలు సంపాదించేదెలా? ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు, గ్లోబల్ వృత్తులలోకి ప్రవేశానికావసరమైన నైపుణ్యతను సాధించేందుకు చెయ్యవలసిన మొట్ట మొదటి పని: గూడెం నుండి బయటపడడం.
—- సాంబయ్య గుండిమెడ

1 Comment

Filed under సామాజిక న్యాయం కోసం